క్రమశిక్షణే వారి మతం కావాలి!
- DV RAMANA

- Nov 27, 2025
- 2 min read

అయ్యప్ప దీక్ష తీసుకుని ఆ డ్రెస్‌కోడ్‌తో విధులకు హాజరైనందుకు ఓ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు ఉన్నతాధికారులు మెమో జారీచేశారు. అదే రీతిలో వేరే మతానికి చెందిన ప్రార్థనా స్థలంలోకి ప్రవేశించడానికి, అక్కడ అధికార విధులు నిర్వర్తించడానికి నిరాకరించినందుకు ఒక ఆర్మీ అధికారిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించేశారు. దీనిపై ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ సంచలన ఆదేశాలు జారీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగం భారతీయ పౌరులకు మతస్వేచ్ఛ హక్కు కల్పిస్తోంది కదా! అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటిపై చర్చించే ముందు దానికి ఆస్కారమిస్తున్న రెండు ఉదంతాలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై ఎస్.కృష్ణకాంత్ అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. ఆ దీక్ష తీసుకున్నవారు కఠిన నియమాలతో పాటు ప్రత్యేక వస్త్రధారణ, ఆహార్యం పాటించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఎస్సై కృష్ణకాంత్ కూడా గడ్డం, జుట్టు పెంచుతూ నల్లవస్త్రాలు ధరించి విధులకు హాజరవుతున్నారు. దాంతో ఆయనకు సౌత్‌ఈస్ట్ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ (ఏడీసీపీ) శ్రీకాంత్ మెమో జారీ చేశారు. అలా చేయడం క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని మెమోలో పేర్కొన్నారు. అంతేకాకుండా దీనికి కొనసాగింపుగా తెలంగాణ పోలీసు శాఖ సంచలన ఆదేశాలు కూడా జారీ చేసింది. అయ్యప్ప, తదితర మతపరమైన దీక్షలో ఉండగా విధి నిర్వహణలో పాల్గొనవద్దని, అందుకు అనుమతి లేదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీక్షలు చేయడం తప్పనిసరైతే సెలవులు తీసుకోవాలని దీక్షలు తీసుకుంటే సెలవులు తీసుకోవాలని, డ్యూటీలో ఉంటూ దీక్షలు చేయడానికి అనుమతి లేదని తేల్చిచెప్పింది. పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు జట్టు, గడ్డం పెంచుకోవడం, బూట్లు లేకుండా సివిల్ డ్రెస్ ధరించేందుకు పర్మిషన్ ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని ఆ మెమోలో శ్రీకాంత్ పేర్కొన్నారు. పోలీసు శాఖ పంపిన ఈ ఆదేశాలు దుమారం రేపుతున్నాయి. ఈ నిబంధనను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తెలంగాణ యూనిట్ తీవ్రంగా ఖండిరచింది. ఏడీసీపీపై చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కోరింది. అయ్యప్ప దీక్ష ఆచరిస్తున్న ఎస్సైకి మెమో జారీ చేయడం హిందూ వ్యతిరేక చర్యగా వీహెచ్‌పీ సహా హిందూ సంఘాలన్నీ విమర్శిస్తున్నాయి. గతంలో కూడా పోలీసులు అయ్యప్ప దీక్షలో ఉంటూ డ్యూటీ చేయరాదంటూ నోటీసులు జారీ చేయడంపై వివాదాలు చెలరేగాయి. ఈ వివాదంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. మన పండగల సమయంలో ఎవరైనా దీక్ష చేస్తే పోలీసు శాఖ ఎందుకు అవసరం లేని రూల్స్ జారీ చేస్తుందని ఆయన ప్రశ్నించారు. నిబంధనలనేవి అందరికీ ఒకేలా వర్తించాలని, మతం ఆధారంగా ఉండకూడదన్నారు. ముస్లిం ఉద్యోగులకు విధి నిర్వహణలో ఉన్న సమయంలో నమాజు(మతపరమైన ప్రార్థన) చేసుకోవడానికి అవకాశం ఎలా కల్పిస్తున్నారని ఆయన నిలదీశారు. ఈ చర్యలు మన రాజ్యాంగం కల్పించిన మతస్వేచ్ఛ.. అంటే ఎవరికి ఇష్టమైన మతాన్ని, మత విశ్వాసాలను వారు ఆచరించే వెసులుబాటుకు తూట్లు పొడుస్తున్నట్లు కాదా! అన్న ప్రశ్నలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తిని లేదా వ్యక్తులను వారి ఇష్టానికి, విశ్వాసాలకు వ్యతిరేకంగా వ్యవహరించమని బలవంతం చేయడం లేదా తను విశ్వసించే మతాచారాలను పాటించవద్దని చెప్పడం మతస్వేచ్ఛ హక్కుకు సంకెళ్లు వేయడమే అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలతో విభేదిస్తున్నావారూ ఉన్నారు. దానికి ఉదాహరణగా ఈమధ్యే సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పును ప్రస్తావిస్తున్నారు. ఆర్మీకి చెందిన మూడో క్యావల్రీ రెజిమెంట్(అశ్విక దళం)లో లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్న శామ్యూల్ కమలేశన్ అనే అధికారి తమ రెజిమెంట్‌లో ఉన్న సర్వధర్మస్థలంలోని మందిరం, గరుద్వారాల్లో ప్రతివారం సంప్రదాయకంగా జరిగే సైనిక పరేడ్‌లో పాల్గొనేందుకు నిరాకరించారు. క్రిస్టియన్ అయిన అతను వేరే మతాలకు చెందిన ప్రార్థన మందిరాల ఆవరణల్లోకి వెళ్లడానికి ఇష్టపడలేదు. అయితే దీన్ని క్రమశిక్షణ ఉల్లంఘనగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా పరిగణించిన ఆర్టీ ఉన్నతాధికారులు శామ్యూల్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. తన డిస్మిస్‌ను కమలేశన్ న్యాయస్థానంలో సవాల్ చేశారు. క్రిస్టియన్ అయిన తాను ఇతర మతాల ప్రార్థనా మందిరాల్లోకి వెళ్లమని తనను బలవంతం చేయడం, వెళ్లనందుకు ఉద్యోగం నుంచి తొలగించడం తన హక్కులకు భంగకరమని ఆయన వాదించారు. అయితే ఢల్లీి హైకోర్టు, చివరికి సుప్రీంకోర్టు కూడా ఆయన వాదనలను తోసిపుచ్చాయి. ఆర్మీ క్రమశిక్షణను ఉల్లంఘించడం, నిబంధనలు పాటించడానికి నిరాకరించడం వంటి చర్యలకు పాల్పడినందుకు కమలేశన్ ఆర్మీ ఉద్యోగంలో కొనసాగే హక్కు, అర్హత కోల్పోయారని, అతన్ని డిస్మిస్ చేయడం సమంజసమేనని కొత్త చీఫ్‌జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. తద్వారా న్యాయస్థానం ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది. దేశపౌరులకు రాజ్యాంగం మతస్వేచ్ఛ కల్పించడం వాస్తవమే, దాన్ని అనుభవించే హక్కు తారతమ్యాలు లేకుండా ప్రతి పౌరుడికి ఉందనడం కూడా వాస్తవమే కానీ.. దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ద్వారా స్పష్టమైంది. ఇతర అన్నివర్గాల పౌరుల కంటే పోలీసు, భద్రతా దళాలు, తదితర యూనిఫారం సర్వీసులకు అనేక ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఆయా సంస్థలు, విభాగాలు క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తాయి. అలాగే నిర్దేశించిన యూనిఫారం మాత్రమే ధరించాల్సి ఉంటుంది. వీటిలో మతపరమైన విశ్వాసాలకు తావులేదన్నది సుస్పష్టం.










Comments