క్లౌడ్ బరస్ట్‌కు తాత.. మైక్రో బరస్ట్!
- DV RAMANA

- Aug 15, 2025
- 2 min read

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వారాలో క్లౌడ్ బరస్ట్ జరిగి 60 మంది మృతి చెందారు. జనావాసాలు కొట్టుకు పోయాయి. అంతకుముందు ఉత్తరాఖండ్‌లో జరిగిన క్లౌడ్‌బరస్ట్ ఒక గ్రామం మొత్తాన్ని ఊడ్చిపారేసింది. హైదరాబాద్‌లోనూ ఈమధ్యే కేవలం ఒక్క గంట వ్యవధిలో పది సె.మీ.పైగా కుంభవృష్టి కురవడాన్ని క్లౌడ్ బరస్ట్‌గానే చెబుతున్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రం కేదార్‌నాథ్‌లో 2013లో క్లౌడ్‌బరస్ట్ సృష్టించిన విల యాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ఈమధ్య కాలంలో భారీ వర్షాలు, తుపానులు కాకుండా క్లౌడ్ బరస్ట్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది.. వణికిస్తోంది. క్లౌడ్ బరస్ట్ అంటే మేఘ విస్ఫోటనం. కాలుష్యం పెరిగిపోయి సముద్ర ఉష్ణోగ్రతలు, నీటిమట్టాలు పెరగడం, కర్బన ఉద్గారాలు పేరుకుపోవడం వల్ల పర్యా వరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతిని సహజ వాతావరణం గతి తప్పుతోంది. ఫలితంగా అంతా కామ్‌గా ఉందనుకున్న చోట మేఘ విస్ఫోటం సంభవించి కళ్లు మూసి తెరిచేలోపు ఆకాశానికి చిల్లుపడుతోంది. మెరుపు వరదలు ముంచెత్తుతున్నాయి. నిమిషాల్లోనే పెను విధ్వంసం సృష్టించగల క్లౌడ్ బరస్టే వెన్నులో వణుకు పుట్టిస్తుంటే.. ఇప్పుడు దాన్ని మించి విధ్వంసం సృష్టించగల మైక్రో బరస్ట్ ప్రపంచ దేశాలను టెన్షన్‌కు గురిచేస్తోంది. సాధారణంగా అతి స్వల్ప వ్యవధిలో భారీ వర్షాలు కురవడాన్ని మేఘ విస్ఫోటం అంటారు. దీనివల్ల 20 నుంచి 30 చ.కి.మీ పరిధిలో గంటకు పది సెం.మీ వర్షపాతం నమోదవు తుంది. కానీ మైక్రో బరస్ట్ సంభవిస్తే.. మేఘంలోని శక్తివంతమైన ఉరుములతో కూడిన చల్లని గాలి అత్యంత బలమైన నిలువు ప్రవాహాన్ని భూమి వైపు తోసుకొస్తుంది. తనతో పాటు మేఘంలో ఉన్న నీటిని కూడా అత్యంత వేగంగా కిందకు లాగేస్తుంది. ఫలితంగా వర్షం చినుకుల్లా కాకుండా భారీ నీటి స్తంభం లా.. ఆకాశంలో ఉన్న ఏదో నది భూమిపైకి ప్రవహిస్తోందా అన్నట్లుగా ఉంటుంది. మేఘాలను తోసు కుంటూ వచ్చే గాలి ప్రవాహం భూమిని తాకినప్పుడు నక్షత్రాకారంలో అన్ని దిశలకు వ్యాపిస్తుంది. దీన్నే మైక్రో బరస్ట్ అంటారు. ఈ ప్రక్రియలో గంటకు 100-150 కి.మీ వేగంతో సుడిగాలులు వీస్తాయి. ప్రచండ తుపాను లేదా హరికేన్‌ను తలపించే ఈ గాలులు 5 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఉన్నా.. చెట్లు, విద్యుత్ స్తంభాలు, భవనాలు, తదితర నిర్మాణాలను నేలమట్టం చేసి విధ్వంసం సృష్టిస్తాయి. విమానాలు టేకాఫ్ లేదా ల్యాండిరగ్ సమయంలో మైక్రోబరస్ట్ సంభవిస్తే విమానాలు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మైక్రో బరస్ట్‌లోనూ డ్రై, వెట్ అని రెండు రకాలు ఉన్నాయి. డ్రై మైక్రో బరస్ట్‌లు వర్షపు నీరు భూమికి చేరకముందే ఆవిరైపోవడం వల్ల ఏర్పడతాయి. వెట్ మైక్రోబరస్ట్‌లు భారీ వర్షంతో కలిసి ఏర్పడతాయి. మైక్రోబరస్ట్ చూడటానికి టోర్నడోను తలపిస్తుంది. టోర్నడో ఏర్పడినప్పుడు గాలి సుడిగుండంలా తిరుగుతూ ఏర్పడిన చోటే నష్టాన్ని కలిగిస్తుంది. కానీ మైక్రోబరస్ట్ లో గాలి నేరుగా భూమిని చేరి అన్ని దిశలకు వ్యాపించడం వల్ల నష్టం తీవ్రత కూడా విస్తరిస్తుంది. మైక్రోబరస్ట్‌ను రాడార్లు వంటి సాధానాలు గుర్తించగలిగినా అవి ఏర్పడే వేగం కారణంగా ముందస్తు హెచ్చరికలు చేయడం కష్టం. మైక్రోబరస్ట్ కొత్త విపత్తు కాదు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం నుంచే ఇటువంటివి సంభవి స్తున్నా.. చాలా తక్కువ ఉదంతాలే నమోదయ్యాయి. కానీ వాతావరణ కాలుష్యం తీవ్రంగా పెరిగిపోవడం తో ఇప్పుడు అవి ఎక్కువగా సంభవిస్తున్నాయి. 1983లో అమెరికాలోని మేరీల్యాండ్ ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో అత్యంత శక్తివంతమైన మైక్రోబరస్ట్ నమోదైంది. ఆ సమయంలో గంటకు 240 కి.మీ. వేగంతో గాలి వీచింది. 1984లో అదే అమెరికాలోని సౌత్‌డకోటా రాష్ట్రంలో సంభవించిన మైక్రోబరస్ట్ ను అత్యంత తీవ్రమైనదిగా పేర్కొంటారు. ఆ సమయంలో గంటకు 257 కి.మీ వేగంతో గాలి వీచినట్లు నమోదైంది. 2020లో పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో సంభవించిన మైక్రోబరస్ట్‌కు సంబంధిం చిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతుంటుంది. ఆకాశం నుంచి ఒక్కసారిగా నీరు సునామీలా భూమి పడే ఆ దృశ్యం చూసేవారినే భయపెడుతుంది. 2024లో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో అరుదైన మైక్రో బరస్ట్ భారీ నష్టం తెచ్చిపెట్టింది. ఇటీవల మన దేశంలోనూ సంభవిస్తున్న కుంభవృష్టి, ఆకస్మిక వరదలకు మైక్రో బరస్టే కారణం కావచ్చన్న చర్చ జరుగుతోంది. దీనికి ఒకే ఒక్క పరిష్కా రం.. వాతావరణాన్ని పరిరక్షించుకోవడమే. కాలుష్య కారకాలను విసర్జించి వాతావరణ సమతుల్యత సాధించకపోతే క్లౌడ్ బరస్ట్, మైక్రో బరస్ట్‌లే కాకుండా.. వాటి మించిన ఉత్పాతాలు పుట్టుకొచ్చి సర్వ నాశనం చేస్తాయనడంలో సందేహంలేదు.










Comments