top of page

కాల్పులే నిత్యకృత్యమైతే ఎలా..?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 9 hours ago
  • 3 min read

నిత్యకృత్యంగా మారిన పోలీస్ ఎన్‌కౌంటర్లు, నేరస్తుల కాళ్లపై కాల్పులు జరిపే విధానాన్ని ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాద్ బెంచ్ మూడున్నర నెలల క్రితం ఒక విచారణ సందర్భంగా తీవ్రంగా తప్పుపట్టింది. ఒక నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్‌కుమార్ దేశ్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ పోలీసులు చట్టానికి అతీతులు కారని, శిక్షించే పని న్యాయవ్యవస్థదే కానీ పోలీసులది కాదని స్పష్టం చేసింది. సంచలనాల కోసం, ప్రభుత్వం మెప్పు కోసం నిందితుల కాళ్లపై కాల్పులు జరపడం అలవాటుగా మార్చుకోవడం తప్పిదమే కాకుండా ప్రమాదకరమని పేర్కొంది. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించే చర్యగా పేర్కొంది. దీనికి సంబంధించి రాష్ట్ర డీజీపీ, హోంశాఖ కార్యదర్శి నుంచి సమాధానం కోరడంతో పాటు పోలీసులకు సిక్స్ పాయింట్ మార్గదర్శకాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత జిల్లా SP, ASP లపై నేరుగా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. హైకోర్టు ఇంత తీవ్రంగా స్పందించే స్థాయిలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయా అంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు అవుననే చెబుతున్నాయి. యోగి ప్రభుత్వ ‘జీరో టాలరెన్స్ ’ విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. యోగి ఆదిత్యనాథ్‌య సీఎం పదవి చేపట్టిన మార్చి 2017 నుంచి ఇప్పటివరకు అంటే తొమ్మిదేళ్ల కాలంలో UP పోలీసులు నేరగాళ్లు, మాఫియా ముఠాలను నియంత్రించే క్రమంలో మొత్తం 17,043 ఎన్‌కౌంటర్లు జరిపారు. అంటే రోజుకు సగటున ఐదు ఎన్‌కౌంటర్లు నమోదయ్యాయి. ఇది చాలా తీవ్రమైన అంశం. సాధారణంగా నెలలో ఒకటి రెండు ఎన్‌కౌంటర్లు జరిగితేనే సమాజం గగ్గొలెత్తిపోతుంది. అలాంటిది రోజుకు సగటున ఐదు ఎన్‌కౌంటర్లు జరగడమంటే సామాన్యం కాదు. కానీ యోగి ప్రభుత్వ దండనీతికి వెరచి ఎవరూ వీటిని ప్రశ్నించలేకపోతున్నారు. ప్రభుత్వ వాదన ప్రకారం వ్యవస్థీకృత నేరాలకు, ఇతరత్రా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అరాచక శక్తుల నడుములు విరగ్గొట్టి శాంతిభద్రతలను కాపాడటం సమంజసమే అయినప్పటికీ.. అది మరీ శృతిమించకూడదు. పిచ్చుకకు, పిడుగు ఒకే మంత్రం అన్నట్లు నేరగాళ్లన్న ఆరోపణతో అందరిపైనా తుపాకులు ఎక్కుపెట్టకూడదన్నదే హైకోర్టు స్పందన అంతరార్థంగా కనిపిస్తున్నది. తొమ్మిదేళ్లలో ఆ రాష్ట్రంలో జరిగిన 17,043 పోలీసు కాల్పుల ఘటనల్లో 289 మంది కరుడుగట్టిన నేరస్తులు హతమయ్యారు. మరో 11,834 మంది గాయపడగా, 34,253 మందిని అరెస్టు చేశారు. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే పోలీసు కాల్పుల్లో 23 మంది నేరస్తులు హతమైనట్లు రికార్డుల్లో నమోదైంది. విడ్డూరమేమిటంటే.. ప్రపంచంలో ప్రముఖ శైవక్షేత్రంగా, మోక్షనగరిగా ప్రశస్తి పొందిన కాశీ క్షేత్రం ఉన్న వారణాసి జోన్ పోలీసు కాల్పుల్లో రెండోస్థానంలో ఉంది. ఈ విషయంలో మీరట్ జోన్‌లో అత్యధికంగా 4,813 పోలీసు కాల్పులు జరగ్గా ఆ ఘటనల్లో 97 మంది నిందితులు మరణించారు. దీనితో పాటు 3,513 మంది అనుమానితులు గాయపడగా 8,921 మందిని అరెస్ట్ చేశారు. రెండోస్థానంలో ఉన్న వారణాసి జోన్‌లో జరిగిన 1,292 ఎన్‌కౌంటర్లలో 29 మంది నేరగాళ్లు మరణించారు. ఈ ఘటనల్లో 2,426 మంది అరెస్ట్ అయ్యారు, 907 మంది గాయపడ్డారు. వీటి తర్వాత ఆగ్రా జోన్ మూడో స్థానంలో ఉంది. ఈ జోన్ పరిధిలో జరిగిన 2,494 ఎన్‌కౌంటర్లలో 24 మంది నేరస్తులు మరణించారు. ఈ ఘటనల్లో 5,845 మంది నిందితులను అరెస్ట్ చేయగా, 968 మంది గాయపడ్డారు. ఇవి కాకుండా రాష్ట్రంలో ఇతర జోన్లయిన బరేలీ, లక్నో, ఘజియాబాద్ కమిషనరేట్, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, గౌతమ్‌బుద్ధ నగర్ (నోయిడా) కమిషనరేట్ల పరిధిలో కూడా పెద్ద ఎత్తున పోలీసు కాల్పులు జరిగిన పెద్దసంఖ్యల్లోనే నిందితులు, నేరస్తులు మరణించారు. అదే సమయంలో ఈ కాల్పుల ఘటనల్లో, నేరప్రపంచాన్ని అంతమొందించే ప్రత్యేక ఆపరేషన్‌లో యూపీ పోలీసులు కూడా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. గూండా తాండాలను, మాఫియా ముఠాలను అంతమొందించేందుకు ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారు. ఈ క్రమంలో పలు ఎదురుకాల్పుల ఘటనల్లో రాష్ట్రవ్యాప్తంగా 18 మంది పోలీసులు నేలకొరిగి అమరులయ్యారు. అదే సమయంలో నేరస్తులు జరిపిన ఎదురుకాల్పుల్లో 1,852 మంది పోలీస్ అధికారులు, జవాన్లు గాయపడ్డారు. ఈ విషయంలోనూ మీరట్, వారణాసి జోన్లు అగ్రస్థానంలో ఉన్నాయి. మీరట్ జోన్‌లో నేరస్తులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులు తూటాలు తగిలి అమరులు కాగా 477 మంది గాయపడ్డారు. వారణాసి జోన్లో 104 మంది, ఆగ్రా జోన్లో 62 మంది పోలీసులు గాయపడ్డారు. ఒకప్పుడు మాఫియా ముఠాలకు, గూండాలు రౌడీలకు, దోపిడీ దొంగలకు అడ్డాగా నేరాల నిలయంగా పేరొందిన ఉత్తరప్రదేశ్ ఈ కఠిన చర్యల ఫలితంగా చాలావరకు ఆ చెడ్డపేరును చెరిపేసుకుని స్థిమితపడింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు కూడా యోగి ప్రభుత్వ ‘నేరరహిత ఉత్తరప్రదేశ్ ’ నినాదాన్ని బలపరుస్తున్నాయి. ఎన్‌సీఆర్‌బీ గణాంకాలను చూస్తే.. ఉత్తరప్రదేశ్‌లో నేరాల రేటు జాతీయ సగటు కంటే దాదాపు 28.5 శాతంగా తక్కువగా నమోదైంది. దేశంలో ప్రతి లక్ష జనాభాకు సగటున 252.3 కాగ్నిజబుల్ (తీవ్రమైన) నేరాలు జరుగుతుండగా.. 24 కోట్లకు పైగా జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఈ సగటు కేవలం 180.2 గా ఉంది. ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం 4,30,552 కాగ్నిజబుల్ కేసుల్లో 2,21,615 కేసులు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) కింద, 2,08,937 కేసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్) కింద నమోదయ్యాయి. నేరరహిత రాష్ట్రం అన్న నినాదంతో తీసుకుంటున్న ఈ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నప్పటికీ.. నేరం చేసిన వారందరినీ కాల్చిపడేయాలన్న ఉగ్ర నిర్ణయం మాత్రం సమంజసం అనిపించుకోదు. కాల్పులు నిత్యకృత్యం కాకూడదు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page