top of page

కుల వ్యాఖ్యలతో ఐపీఎస్‌ దుమారం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 5, 2025
  • 2 min read

కులాల ప్రస్తావన కూడదని.. దాని వల్ల నిమ్న కులాలను కించపర్చినట్లు అవుతుందన్న వాదనలు, అభిప్రాయాలు చాలాకాలం నుంచే ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో వార్తాపత్రికలు తాము ప్రచురించే వార్తల్లో కులాల ప్రస్తావన లేకుండా ఒక సామాజికవర్గం అని మాత్రమే రాయాలని స్వీయ లక్ష్మణరేఖ గీసుకున్నాయి. ఆఫ్‌కోర్సు.. నేడు ఆ లక్ష్మణరేఖను అవి చెరిపేసుకున్నాయనుకోండి! మరోవైపు రాజకీయ, సామాజిక, పరిపాలన వ్యవహారాల్లోనూ కుల ప్రస్తావన కామన్‌ అయిపోయింది. నిమ్న కులాలవారు సైతం తమ కులాన్నే బహిరంగంగా, గర్వంగా చెప్పుకొంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దీన్ని కాసేపు పక్కనపెడితే పరిపాలనలో కీలకంగా వ్యవహరించే అత్యున్నతమైన అఖిలభారత సివిల్‌ సర్వీసుల అధికారులు గానీ, ఇతర అధికారవర్గాలు కానీ రాజకీయాలు, కులాల ప్రస్తావన తీసుకురావడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. దీనికి తాజా ఉదాహరణ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే. ఒక ఉన్నతాధికారిగా రాజకీయాలు మాట్లాడటమే తప్పు అనుకుంటే.. ఆయన తన రాజకీయ వ్యాఖ్యలకు కులాలను కూడా జోడిరచి మరింత కలకలం రేపారు. ఆయన అలా మాట్లాడటంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సునీల్‌కుమార్‌ మెజారిటీ సంఖ్యలో ఉన్న కాపులు, దళితులు కలిస్తే రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ ‘మీ కాపు నాయకుణ్ణి మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకుణ్ణి ఉప ముఖ్యమంత్రిని చేయండి. మా హర్షకుమార్‌, మా విజయ్‌కుమార్‌, మా జడ శ్రవణ్‌కుమార్‌లలో ఒకరిని ఉప ముఖ్యమంత్రిని చేయండి. రెండేళ్లలో దిగిపోయే ఉప ముఖ్యమంత్రి కాదు.. ఐదేళ్లు ఉండే పదవి కావాలి’ అని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపు సామాజికవర్గం ఏళ్లతరబడి రాజ్యాధికారం కోసం ప్రయత్నించి కొంత సఫలమైంది’ అంటూ గత ఎన్నికల ఫలితాలను సునీల్‌కుమార్‌ పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పుడు వారూ, మనం కలిస్తే ఉమ్మడి బలం రెట్టింపు అవుతుందంటూ ఇందుకు సహకరింమని కాపు సోదరులను కోరండి అని సునీల్‌కుమార్‌ దళిత సమాజానికి ఇచ్చిన పిలుపు విపరీతంగా వైరల్‌ అయ్యి కలకలం సృష్టించింది. ఆయన వ్యాఖ్యలు అఖిలభారత సర్వీసుల ప్రపర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సస్పెన్షన్‌లో ఉన్న అధికారులకు ప్రవర్తనా నియమావళి వర్తించదని, వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా సునీల్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలను కాపు, దళిత సంఘాలు పెద్దఎత్తున సోషల్‌మీడియా ద్వారా వైరల్‌ చేశాయి. రాష్ట్ర రాజకీయాలను కదిలించిన ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్టరాజు మండిపడటమే కాకుండా సునీల్‌కుమార్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక ఫిర్యాదు కూడా రాశారు. ఆలిండియా సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించినందుకు ఈ ఐపీఎస్‌పై చర్య తీసుకోవాలని డీవోపీటీ(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌)కు లేఖ రాశారు. అగ్నిమాపక శాఖలో అవినీతికి పాల్పడటం, అగ్రిగోల్డ్‌ లబ్ధిదారుల పేరుతో నిధులు పక్కదారి మళ్లించడం, ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు వెళ్లారన్న ఆరోపణలపై సునీల్‌కుమార్‌ సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సునీల్‌కుమార్‌ ఏపీ పోలీసు శాఖలో వివిద హోదాల్లో పని చేశారు. వైకాపా ప్రభుత్వంలో సీఐడీ ఏడీజీగా ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలు కొందరు హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్వయంగా రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వారి ఆచూకీ లభించలేదని కోర్టుకు సీఐడీ సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత సీబీఐకి ఫిర్యాదు చేయగా మొత్తం 18 మందిపై చర్యలు తీసుకుంది. అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి చెందిన వారిని అర్ధరాత్రి అరెస్టులు చేయించి చితకబాదించినట్లు సునీల్‌కుమార్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. అన్నింటికీ మించి అప్పట్లో నరసాపురం ఎంపీగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడం, కస్టోడియల్‌ హింసకు గురి చేశారన్న ఆరోపణలతో సునీల్‌కుమార్‌ చర్చనీయాంశమయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రఘురామ ఆనాటి ఘటనలపై ఫిర్యాదు చేయడంతో గుంటూరు పోలీసులు సునీల్‌కుమార్‌పై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన చేసిన రాజకీయ`కుల వ్యాఖ్యలను ఆధారం చేసుకుని రఘురామ ఆ విధంగా కూడా కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారని దళిత సంఘాలు విమర్శిస్తున్నాయి. సర్వీసు నియమావళి ప్రకారం చూస్తే.. అఖిల భారత సర్వీసు అధికారులు సర్వీసులో ఉండగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం పూర్తిగా నిషేధం. వారు ఏ పార్టీలోనూ సభ్యులుగా ఉండరాదు. రాజకీయాల్లో పాల్గొనే ఏ పార్టీతోనూ, సంస్థతోనూ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం, అనుబంధం పెట్టుకోకూడదు. రాజకీయ ఉద్యమాలు, కార్యకలాపాల్లో పాల్గొనకూడదు. ఆర్థికంగా కూడా మద్దతివ్వకూడదు. ప్రభుత్వాల విధానాలు, చర్యలను తప్పుపట్టకూడదు. సస్పెన్షన్‌లో ఉన్నవారికి కూడా ఇవన్నీ వర్తిస్తాయి. ఎందుకంటే సస్పెన్షన్‌ అన్నది తాత్కాలిక చర్య.. సర్వీసు నుంచి తొలగించినట్లు కాదు. సునీల్‌కుమార్‌ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, భావప్రకటన స్వేచ్ఛ ఆయనకూ ఉంటుందని, అది తప్పెలా అవుతుందని దళిత నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page