కొలమానాలు మారిస్తే పేదరికం పోతుందా?
- DV RAMANA

- Jun 9, 2025
- 2 min read

దేశంలో పేదరికం తగ్గిందట! ఎంతలా అంటే అతి పేదరికం రేటు పదేళ్ల వ్యవధిలో ఏకంగా ఇరవై శాతానికిపైగా తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంకు ఉవాచించింది. అంటే.. కటిక పేదరికం నుంచి కోట్లాది ప్రజలు కాస్త ఉన్నతస్థాయికి ఎదిగారన్నట్లే. మరి దేశంలో వాస్తవ చిత్రం అలా ఉందా? అంటే ఎవరైనా సరే ఠక్కున లేదు అనే అంటారు. మరెందుకు ప్రపంచ బ్యాంకు అంతపెద్ద అబద్ధాన్ని బయట కొదిలిందంటే.. వాస్తవానికి పేదరికం ఏమీ తగ్గలేదు.. కానీ ప్రపంచస్థాయిలో దాన్ని అంచనా వేసే ప్రమాణాలను (పారామీటర్స్) మార్చడం వల్ల భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అతి పేదరికం లో మగ్గుతున్నవారు ఉన్నఫళంగా, తమ ప్రమేయం లేకుండానే దాన్నుంచి బయటపడిపోయారు. కానీ వారి ఆర్థిక స్థితిగతులు, ఆకలి కేకలు మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. ప్రమాణాలను పెంచి పేదరికాన్ని పారదోలామని చెప్పుకోవడం సమంజసం కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ప్రజల ఆదాయాలు, జీవన ప్రమాణాలు పెరిగి ఉండోచ్చేమోగానీ.. అన్ని దేశాలను అదే గాటన కట్టి ఒకేలా చట్రంలో బంధించి అతి పేదరికం తగ్గిపోతోందని ప్రకటించడం విడ్డూరం. ఇప్పటివరకు రోజుకు 2.15 లోపు అమెరికన్ డాలర్ల సంపాదన కలిగిన కుటుంబాలను అతిపేదవారిగా ప్రపంచ బ్యాంకు ఇప్పటివరకు గుర్తిస్తోంది. దాన్ని తాజాగా మార్చి మూడు డాలర్లకు పెంచింది. అదేవిధంగా మధ్య ఆదాయ వర్గాలను గుర్తించే కొలమానాన్ని 3.65 నుంచి 4.20 అమెరికన్ డాలర్లకు పెంచింది. ఎగువ మధ్యతరగతి ఆదాయవర్గాల గుర్తింపు కొలమానాన్ని 6.85 నుంచి 8.40 అమెరికన్ డాలర్లకు పెంచింది. ఈ మార్పు ఫలితంగా 2011-12లో 34 కోట్లు (340 మిలియన్లు) దారిద్య్ర రేఖకు దిగువన ఉండగా 2022-23 నాటికి ఆ సంఖ్య 7.5 కోట్లకు (75 మిలియన్లు) తగ్గిపోయింది. అంటే సుమారు 171 మిలియన్ల మంది అతి పేదరికం నుంచి బయటపడి దిగువ మధ్యతరగతి గ్రూపులోకి వచ్చేశారన్నమాట. భారతదేశానికి చెందిన గణాంకాలు పరిశీలిస్తే.. 2011-12లో దేశంలో అతి పేదరి కం రేటు 27.1 శాతం ఉంది. ప్రపంచ బ్యాంకు కొలమానం పెంచిన తర్వాత లెక్కల ప్రకారం అది 2022`23 నాటికి అది 5.3 శాతానికి తగ్గింది. 2022-23 నాటికి మన దేశంలో దాదాపు 75.24 మిలియన్ల మంది తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. 2011-12లో వీరి సంఖ్య 344.47 మిలియన్లు. దీని అర్థం 11 ఏళ్ల వ్యవధిలో సుమారు 269 మిలియన్ల మంది అతి పేదరికం నుంచి బయటపడి దిగువ మధ్యతరగతి వర్గంలో చేరినట్లు భావించాలి. 2024 నాటి గణాంకాలు చూస్తే భారత్‌లో ప్రపంచ బ్యాంకు ప్రమాణాల కంటే తక్కువ ఆదాయంతో జీవించే వారు జనాభాలో 5.44 శాతం మేరకు అంటే 54,695,832 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అతి పేదరికం రేటు 2011-12లో 18.4 శాతం నుంచి 2022-23లో 2.8 శాతానికి తగ్గింది. అదే సమయంలో పట్టణ ప్రాంతా ల్లో ఇది 10.7 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అతి పేదరికం వ్యత్యాసం 7.7 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గింది. అదే సమయంలో మన దేశ జీడీపీ పరిస్థితి చూస్తే.. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు కోవిడ్ పూర్వ రేటుతో పోలిస్తే ఐదు శాతం మేరకు తక్కువగానే ఉంది. అదే సమయంలో ప్రపంచ స్థాయిలో విధాన మార్పులు, వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు భారత్ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ప్రపంచ బ్యాంకు హెచ్చరిం చింది. అయితే ఏ కోణంలో చూసినా ఎలా విశ్లేషించినా అంత పెద్దసంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడినట్లు కనిపించదు. ఎందుకంటే దేశ ప్రజల కనీస ఆదాయాలు చాలాకాలంగా ఎదుగూ బొదుగూ లేకుండానే ఉన్నాయి. అదే సమయంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు వారి కొనుగోలు శక్తిని తగ్గించేస్తున్నాయి. ఫలితంగా పేదలు పేదలుగానే ఉండిపోతున్నారు. పలు నివేదికలు ఘోషిస్తున్నాయి. భారతదేశం ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని గొప్ప లు చెప్పుకొంటున్నా అదంతా దేశ జనాభాలో పది శాతంలోపే ఉన్న సంపన్న వర్గాల వద్దే పేరుకు పోతోంది. ఆర్థిక వృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాల వరకు చేరడంలేదని స్పష్టమవుతున్న ఈ పరిస్థితుల్లో అతి పేదరికం తగ్గిపోయిందని చెప్పడాన్ని గణాంకాల గారడీగా పరిగణించాల్సి ఉంటుంది. ఈ లెక్క లను చూపించి జబ్బలు చురుచుకుంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తేనే పేదరికాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని పాలకులు గ్రహిస్తే మంచిది.










Comments