కుళ్లును కడిగేసిన రాజ్యాంగానికే తూట్లు!
- DV RAMANA

- Nov 28, 2025
- 2 min read

ప్రపంచంలో భారతదేశాన్ని అత్యంత గౌరవనీయ స్థానంలో నిలబెట్టిన ఘనత మన రాజ్యాంగానిదే. దాన్నే మనం మనసా వాచా కర్మణా ఒక భగవద్గీతగా.. ఒక ఖురాన్‌గా.. ఒక బైబిల్‌గా భావిస్తున్నాం. అంతటి ఘనమైన రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండాయి. అంతేనా.. అంటరాని కులాల ప్రత్యేక కోటా(రిజర్వేషన్) ద్వారా కోట్లాది నిమ్నవర్గాల ప్రజల ఆత్మాభిమానానికి.. మనుధర్మ విషపూరిత ఆచరణ విరుగుడుకు కూడా 75 ఏళ్లు. దేశ చరిత్రలో నవంబరు 26 సువర్ణాక్షర లిఖితం. సరిగ్గా 75 ఏళ్ల క్రితం.. 1950 జనవరి 26న భారత ప్రజానీకం తమకు తాము అంకితం చేసుకున్న ఆచరణాత్మక మార్గదర్శి, భవిష్యత్తుకు పునాది మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు. మన సామాజిక జీవనాన్ని తీర్చిదిద్ది వజ్ర కవచంలా రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగం వజ్రోత్సవ నేపథ్యంలో ఊరూవాడా ప్రజలు, పెద్దలు ఆ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని, కాపాడుకుంటామని ప్రతిజ్ఞలు చేశారు. వాస్తవానికి ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకోవడం మనకు కొత్త కాదు. ఈసారి కాస్త పెద్దస్థాయిలో జరుపుకొన్నాం.. అంతే తేడా. అయితే ఉత్సవాలు జరుపుకోవడంతో పాటు గడచిన 75 ఏళ్లలో రాజ్యాంగాన్ని ఎంతమేరకు పాటించామన్న దాన్ని కూడా సమీక్షించుకోవాల్సి అవసరం కచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి దన్నుగా నిలబడాలన్న ఆకాంక్షతో ఎందరో మహానుభావులు రాజ్యాంగాన్ని నిర్మిస్తే.. ఆధునిక పాలకులు ఈ 75 ఏళ్లలో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమో.. ఇతర అవసరాల కోసమో.. సవరణల పేరుతో పలుమార్లు దానికి తూట్లు పొడిచారు. గతంలో కుంపట్లమయమైన ఇండియా రాజ్యాంగ బలంతోనే ఏకీకృత స్వరంతో పురోగమిస్తున్నది. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలకు మార్గదర్శిగా నిలబడుతున్నది. ప్రజాస్వామ్యమే ఈ ప్రపంచంలో అనివార్యమైనదని కూడా రుజువు చేస్తున్నది. ఏ దేశ రాజ్యాంగానికీ లేని ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్నది మన రాజ్యాంగం. కులదాష్టికపు కుళ్లును సమూలంగా పెకిలించిన వజ్రాయుధం కూడా ఈ రాజ్యాంగమే. కొన్ని కులాల చేతిలోనే అధికారం. సంపద కేంద్రీకృతం కాకూడదని చెప్పినది.. అందుకు తగిన నిబంధనలను కూడా రాజ్యాంగ నిర్మాతలు భారతీయ రాజ్యాంగంలో పొందుపరిచారు. అంతేకాకుండా ఆయుధం పట్టకుండా యుద్ధం చేయకుండా రక్తపు చుక్క కారకుండా కులపీడిత అట్టడుగు వర్గాల ప్రజలకు అధికారాస్త్రాన్ని అందించింది. రాజ్యాంగం ఉనికిలోకి వచ్చిన తర్వాతనే మనుషులంతా ఒక్కటే, మనందరం భారతీయులమనే జాతీయ భావన, సమైక్య స్ఫూర్తి ప్రజల్లో మొగ్గ తొడిగాయి. వాటి కారణంగానే వర్ణ వ్యవస్థ నిర్దేశించిన సామాజిక దాస్య శృంఖలాలను బద్దలు కొట్టి సమానత్వాన్ని వెలిగెత్తి చాటింది. ‘ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ’ ఇదే భారత రాజ్యాంగ మౌలిక అంశం. రాజకీయ, సామాజిక, ఆర్థిక, స్వతంత్రాలను అందరూ పొందాలనే సార్వజనీన ప్రజాస్వామిక మౌలికతను జనానుభవంలోకి తీసుకొచ్చింది. ఫలితంగా తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని నేటి వరకు ఎందరెందరో మనుధర్మ పీడితులు, పేదలు అధికార పీఠాలపైకి రాగలిగారు. పరిపాలనలో తమదైన ముద్ర వేయగలిగారు. మహిళలకు హక్కులను నిరాకరించిన వ్యవస్థను చిదిమేసి రాజ్యాధికారం అప్పగించిన మహాస్త్రం మన రాజ్యాంగం. ఇందిరా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ అంతకు ముందు రాజమణి దేవి, సదాలక్ష్మమ్మ, ఈశ్వరీబాయి నేటి సీతక్క వరకు ఎందరెందరో మహిళామణులు ధైర్యసాహసాలతో తమదైన చరిత్రను లిఖించుకున్నారు. ఇంతటి ఘనమైన మన రాజ్యాంగాన్ని రచనా సమయంలోనే వ్యతిరేకించిన వారు చాలా మందే ఉన్నారు. అందులో మనుధర్మ ప్రేమికులు కొందరు. ఇది బూర్జువా రాజ్యాంగమంటూ ఇంకొందరు లేని పంచాయితీ పెట్టారు. తద్వారా మనుధర్మ అడుగుజాడలకు పరోక్షంగా మద్దతునిచ్చానే అపప్రదను మూటగట్టుకున్నారు. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని, నెహ్రూ విశాల దృక్పథాన్ని, గాంధీ దైవీకృత సమానత్వ కోణాన్ని అర్థం చేసుకోవడంలో వీరంతా విఫలమయ్యారు. తిరిగి వారిపైనా నిందలూ నిష్టూరాలు వేశారు. కానీ కాలగమనంలో ఈ ముగ్గురు నేతలను భారత మార్గదర్శకులుగా 75 ఏళ్ల భారత రాజ్యాంగం అమలు, దాని ఫలితాల తీరు చెప్పకనే చెబుతున్నాయి. కులవ్యవస్థను, దాని నీచత్వాన్ని అందమైన పదబంధాలతో, సమానత్వ డ్రామాలతో మోసగించే వారిని పక్కకు నెట్టివేసింది సరికొత్త భారత రిపబ్లిక్. పరిపాలనే చేతకాదు, ఈ ప్రజాస్వామ్యం నిలబడదని నాడు అవహేళన చేసిన విదేశీయులే నేడు మన రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నారు. ఎన్నో అనుమానాలను, ఆపోహలను పటాపంచలు చేస్తూ భారత రాజ్యాంగ పీఠికను ఆచారణత్మకంగా చూపిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కు జనాభా కలిగిన, సువిశాలమైన తొలి ప్రజాస్వామిక దేశంగా ఇండియా ప్రపంచానికే మార్గదర్శిగా నిలబడిరది. ఇంతటి శక్తివంతమైన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉన్నది. అయితే రాజకీయులు కురచ బుద్ధులతో దాన్ని పలుచబరుస్తుండటం దురదృష్టకరం. మారుతున్న కాలమానపరిస్థితులకు అనగుణంగా, కొంగొత్త అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగంలో సమయానుకూల మార్పులు చేసుకునే వెసులుబాటును రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు. అదే ఇప్పుడు స్వార్థ పాలకుల చేతిలో అస్త్రంగా మారుతోంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు విశాల ప్రజాహితాన్ని కాంక్షించకుండా.. తమ విధానాలు, స్వార్థపూరిత ప్రయోజనాల కోసం రాజ్యాంగానికి అనుచిత సవరణలు చేసి బలహీనపరుస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంఘర్షణలు దాని ఫలితమే. ఇటువంటి చర్యలు మన వేలితో మన కంటిని పొడుచుకోవడమేనని గ్రహించాలి.










Comments