top of page

కాషాయ కేతనం.. దేనికి సంకేతం?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 15, 2025
  • 2 min read

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కేరళ రాజకీయ ముఖచిత్రాన్ని కొత్తగా మార్చేసింది. ఈ ఎన్నికల్లో అధికార వామపక్ష కూటమి (ఎల్‌డీఎఫ్‌)ను వెనక్కి నెట్టి యూడీఎఫ్‌(యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌) మెజారిటీ స్థానిక సంస్థలను కైవసం చేసుకుంది. కానీ యూడీఎఫ్‌ కంటే ఎన్డీయే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయవర్గాలను ఆకర్షించింది. నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను సెమీ ఫైనల్‌గా పరిగణించిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో అధికార ఎల్‌డీఎఫ్‌ కూటమి మట్టి కరవడంతో మరో కమ్యూనిస్టు కోట కుప్పకూలుతోందన్న విశ్లేషణలకు తావిస్తోంది. ముఖ్యంగా బీజేపీ సాధించిన ఫలితాలు వామపక్ష కూటమికి ప్రమాద ఘంటికల్లాంటివేనని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో యూడీఎఫ్‌ సంఖ్యాపరంగా వామపక్ష కూటమిని గ్రామ పంచాయతీ, బ్లాక్‌ పంచాయతీ, మున్సిపాలిటీ , నగరపాలక సంస్థల ఫలితాల్లో దెబ్బకొట్టింది. ఈ ఫలితాలు యూడీఎఫ్‌కు సంతోషం కలిగించినా.. కేరళలో ఒకసారి ఎల్‌డీఎఫ్‌, మరోసారి యూడీఎఫ్‌ విజయాలు సాధించే సంప్రదాయం ఉన్నందున ఇది పెద్ద విశేషం కాదు. కానీ దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్ప ఇతర రాష్ట్రాల్లో కమలదళం ఇంతవరకు బేస్‌ సాధించలేకపోయింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళల్లో ఒకటి రెండు సీట్లు సాధించడమే గగనం అన్నట్లున్న పరిస్థితుల్లో గణనీయమైన విజయాలు నమోదు చేయడం పెద్ద విజయమే. అన్నింటికీ మించి కేరళ రాజధాని తిరువనంతపురంలో పాగా వేయడం కమలనాథులను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తోంది. ఈ ఫలితాలపై ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్పందించి హర్షం వ్యక్తం చేశారంటే ఈ ఫలితాలు కాషాయదళానికి ఎంత బూస్ట్‌ ఇచ్చాయో వేరే చెప్పనక్కర్లేదు. 45 ఏళ్లుగా లెఫ్ట్‌ పార్టీలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురంపై తొలిసారి కాషాయ జెండా ఎగురవేశారు. 101 మంది సభ్యులున్న తిరువనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ ఏకంగా 50 స్థానాలు కైవసం చేసుకుంది. లెఫ్ట్‌ కూటమికి 29, యూడీఎఫ్‌కు 19 సీట్లు దక్కాయి. గతంలో ఈ కార్పొరేషన్‌లో సీపీఎంకు 51, బీజేపీకి 35, కాంగ్రెస్‌కు పది సీట్లు ఉండేవి. వాటిని అధిగమించి సగానికి సగం సీట్లు గెలుచుకోవడం ద్వారా తొలిసారి మేయర్‌ పీఠంపై కూర్చునేందుకు దాదాపు సిద్ధమైంది. ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఇస్తే మేయర్‌ పీఠం కాషాయదళానిదే. తిరువనంతపురం కార్పొరేషన్‌ కమ్యూనిస్టులకు పెట్టని కోట కాగా.. ఈ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ రెండిరటినీ బీజేపీ దెబ్బతీసిందన్నమాట. ఇదే కాకుండా మరికొన్ని అంశాలు కూడా కేరళ బీజేపీని ఆనందడోలికల్లో ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇంతకాలం ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ అనే రెండు ప్రధాన కూటముల మధ్య ముఖాముఖీ పోటీ జరుగుతూ వస్తోంది. కానీ తాజా ఎన్నికల పరిణామాల తర్వాత అనేక చోట్ల పరిస్థితి నెమ్మదిగా త్రిముఖ పోటీగా మారుతోంది. దీనికి కారణంగా ఒకప్పుడు ఎలాంటి పట్టు లేని బీజేపీ అంచెలంచెలుగా బలం పుంజుకుంటోంది. ఓట్లు, సీట్లు పెంచుకుంటోంది. గత ఎన్నికల్లో బీజేపీకి 15 శాతం ఓటు షేర్‌ ఉండగా ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఎంత శాతం ఓట్లు సాధించిందన్న లెక్కలు ఇంకా పూర్తిస్థాయిలో రాకపోయినా అది 20 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కోజికోడ్‌, కన్నూర్‌ వంటి వామపక్ష కంచుకోటల్లోకి కూడా కాషాయ పార్టీ చొరబడి కోజీకోడ్‌లో తన బలాన్ని 6 నుంచి 13 సీట్లకు పెంచుకుంది. కన్నూరులో 4 సీట్లు గెలుచుకుంది. అదే సమయంలో పాలక్కాడ్‌ మున్సిపాలిటీపై తన ఆధిక్యం నిలబెట్టుకుంది. త్రిపునితురా మున్సిపాలిటీలోనూ విజయం సాధించింది. మరోవైపు రాష్ట్రంలోని 26 గ్రామ పంచాయతీల్లోనూ ఎన్డీయే గెలుపొందింది. పండాలం మున్సిపాలిటీని ఎల్డీఎఫ్‌కు కోల్పోయినా త్రిపునితురా మున్సిపాలిటీని సీపీఎం నుంచి చేజిక్కించుకుని బ్యాలెన్స్‌ చేసింది. బీజేపీ సాధించిన పురోగతి కేరళలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనడానికి సంకేతంగా భావిస్తున్నారు. బీజేపీని కూడా బలమైన ప్రతినిధిగా పరిగణించాల్సిన అగత్యం కల్పిస్తోంది. ఉత్తరాదిలో అమలు చేసిన అభివృద్ధి అజెండాయే కేరళలోనూ బీజేపీని ముందుంజ వేసేలా చేసింది. దేశవ్యాప్తంగా ఇదే అజెండాతో ముందుకెళ్లాలన్నది ఆ పార్టీ లక్ష్యం. ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమల ఆలయంతో దగ్గర సంబంధం ఉన్న పతనంతిట్ట జిల్లాలోని పండాలం మున్సిపాలిటీలో ఎదురుదెబ్బ తగలడం మాత్రం బీజేపీకి మింగుడుపడనిదే. 2020 ఎన్నికల్లో 18 సీట్లు గెలిచి మున్సిపాలిటీని చేజిక్కించుకున్న బీజేపీ, ఈసారి తొమ్మిది సీట్లు మాత్రమే గెలిచి మూడో స్థానానికి పడిపోయింది. సమన్వయ లోపం, అంతర్గత కలహాలు, పాలనలో నిర్లక్ష్యం వంటివి అక్కడ బీజేపీ ఓటమికి కారణమయ్యాయి. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఎన్డీఏ రాష్ట్రవ్యాప్తంగా 1,900 కంటే ఎక్కువ వార్డులను గెలుచుకుంది. గత ఎన్నికల్లో సాధించిన వార్డుల కంటే 300 అధికంగా సాధించడం విశేషం. ఓట్ల షేరు విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందిస్తూ ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 20 శాతం మార్కును దాటిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 13 మున్సిపాలిటీల్లో ఎన్డీయే రెండో అతిపెద్ద కూటమిగా ఆవిర్భవించడం కాసరగోడ్‌లో ఒక జిల్లా పంచాయతీ సీటును గెలుచుకోవడం మిగతా రెండు కూటములకు ఒక హెచ్చరికలాంటిదే. ఇదో కొత్త చరిత్ర అని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల ఫలితాలను అభివర్ణించడం వాస్తవానికి దగ్గరగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వాతంత్య్రానంతరం కేరళలో ఎన్నికల పోరాటం రెండు కూటముల మధ్యే కేంద్రీకృతమై ఉండేది. ఇది త్వరలోనే త్రిముఖ పోటీగా మారే సూచనలున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page