top of page

కొసరు పనులతో.. బోధనకు ఎసరు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jul 21, 2025
  • 3 min read
  • అదనపు పనులతో పాఠశాలల వేళలు వృథా

  • ఒకే సమాచారాన్ని పదే పదే పంపాల్సిన దుస్థితి

  • సీర్పీలను కాంప్లెక్స్‌ల్లో కూర్చోబెట్టి టీచర్లపై ఒత్తిడి

  • వారు ఉండగా మళ్లీ టీచర్లను వాడేసుకుంటున్న వైనం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

పాఠశాల విద్యను ప్రక్షాళన చేస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి వాస్తవికతకు మధ్య పొంతన కుదరడంలేదు. గత ప్రభుత్వంలో పాఠాలు చెప్పడం కంటే ఇతర అంశాలపైనే టీచర్లు ఎక్కువ దృష్టి పెట్టాల్సివచ్చేదన్న విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు కూడా ఆ పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించడంలేదు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కలెక్టర్లతో సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు తీసుకుంటున్న అర్ధరహిత నిర్ణయాలు, చర్యలు తీసుకుంటున్నారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ప్రస్తుత విద్యా సంవత్సరంలో 230 పనిదినాలు ఉన్నాయి. ఇప్పటికే అందులో దాదాపు పది శాతం పనిదినాలు పూర్తయ్యాయి. జూన్‌ 12న విద్యా సంవత్సరం ప్రారంభమైంది. గత నెలన్నర రోజుల్లో అధికారిక వాట్సాప్‌ గ్రూపులో 18 సార్లు గూగుల్‌ ఫారం నింపాలని లింకుల ద్వారా అధికారులు ఆదేశించారు. నాలుగుసార్లు పాఠశాల పనివేళల్లో జూమ్‌ మీటింగ్స్‌ నిర్వహించారని పలువురు టీచర్లు సాక్ష్యాధారాలతో చూపించారు. ఉదయం 9.30 గంటలకు బోధన సమయంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహణపై జిల్లా విద్యాధికారి జూమ్‌ సమావేశం నిర్వహించడాన్ని టీచర్లు తప్పు పడుతున్నారు.

అదనపు పనులతోనే సరి

ప్రతి నెలా తల్లిదండ్రులను పిలవడం, డాక్యుమెంట్లు, సమావేశం ఫోటోలు, సాక్ష్యాధారాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయడాన్ని ఉపాధ్యాయులు చాలా ఇబ్బందికరంగా భావిస్తున్నారు. పన్నెండు రోజులపాటు సాగిన బడిబాటలో రోజువారీ వివరాలను మండల కేంద్రానికి పంపడంతోపాటు రాష్ట్ర వెబ్‌సైట్‌లో పొందుపరిచామని, దానికి తోడు సీఆర్పీ నుంచి రోజూ ఫోన్‌ కాల్స్‌ వచ్చేవని మరో ఉపాధ్యాయుడు తెలిపారు. సీఆర్పీల నుంచి ఇప్పటి వరకు 30 కాల్స్‌ పైగా వచ్చాయని, ప్రొగ్రెషన్‌ యాక్టివిటీ, యూడైప్‌ అప్డేషన్‌, టెక్ట్స్‌బుక్‌ ఎంట్రీ, నోట్‌బుక్స్‌ ఎంట్రీ, యూనిఫారాలు.. ఇవి కాకుండా ఈపీలు, జీపీల ఎంట్రీ పేరుతో ట్యాబ్‌, మొబైల్‌ ఫోన్లకు గంటల తరబడి అంకితం కావాల్సి వచ్చిందన్నారు. అటెండెన్స్‌ కాప్చర్‌తో పాటు మధ్యాహ్న భోజనం యాప్‌లో వివరాలు నమోదు చేయడం, కాంప్లెక్స్‌ గ్రూపులో వివరాలు షేర్‌ చెయ్యడం వంటి పసులతో గంటకు పైగా బోధన సమయం కరిగిపోతోందని మరో ఉపాధ్యాయుడు పేర్కొన్నారు. ముగ్గురు టీచర్లు ఉన్న తమ స్కూల్లో ఒకరు రెండున్నర రోజులు, మరొకరు మూడు రోజులు సెలవులో ఉన్నారని, ఆ ఆరు రోజుల్లో బోధన జరగలేదని ఇంకో ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రారంభ పరీక్ష పేరిట రెండు రోజులు, యోగా పేరిట అరపూట, చెట్లు నాటే కార్యక్రమానికి ఒక పూట ఇలా మరో మూడు రోజులు.. వెరసి పది రోజులు పోయాయని, మిగిలిన రోజుల్లో ఒక తరగతికి ఒక పాఠం చెబితే, మరో తరగతి చూస్తూ ఉండిపోయిందన్నారు. రోజూ ఇంత సమాచారాన్ని పాఠశాల నుంచి రాష్ట్రం, కేంద్రం వరకు పంపిస్తుంటే, సైకిళ్ల పంపిణీ డేటా కోసం మళ్లీ విద్యార్థుల వివరాలు అడగాల్సిన దీనావస్థ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఏ విద్యార్థి హాజరయ్యారన్నది చిరునామా, ఆధార్‌ సంఖ్య, ఫోటోతో సహా తెలుసుకునే వెసులుబాటు ఉండగా పదో తరగతి విద్యార్థినుల సంఖ్య అధికారుల వద్ద లేక మళ్లీ గూగుల్‌ ఫారం ద్వారా సేకరించడం హాస్యాస్పదం.

సీఆర్పీలు ఎందుకు?

సమాచార సేకరణ, మానిటరింగ్‌ వంటి విషయాల్లో పాఠశాలకు విద్యాశాఖతో సమన్వయం చేయాల్సిన సీఆర్పీలు ఎక్కడా భౌతికంగా కనిపించడం లేదు, చాలాచోట్ల వీరు ఎమ్మార్సీ లేదా కాంప్లెక్స్‌ పాఠశాలల్లో క్లర్కులుగా మిగిలిపోతున్నారు. ఫోన్‌, వాట్సప్‌ ద్వారా మినహా టీచర్లను నేరుగా కలిసే అవకాశం వారికి లేదు. ఉపాధ్యాయులు సెలవు పెట్టిన సందర్భాల్లోనూ సీఆర్పీలను పాఠశాలకు పంపడం లేదు. కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులకు క్లరికల్‌ స్టాఫ్‌ ఉన్నప్పటికీ ఒక టీచర్‌ను అనధికారికంగా అసిస్టెంట్‌గా పెట్టుకుని బిల్లులు వేయడానికి వాడుకుంటుండటం, సీఆర్పీలను సొంత పసులకు వినియోగించుకోవడం విచారకరం. ఏదైనా రిపోర్టులు ఇవ్వాల్సి వస్తే టీచర్లు ఒక పూట ఆన్‌డ్యూటీ పేరుతో మండల విద్యా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ విద్యా సంవత్సరం యూనిఫారాల కోసం మూడు పూటలు, పాఠ్యపుస్తకాల కోసం ఒకసారి, నోటు పుస్తకాల కోసం మరోసారి పాఠశాల నుంచి ఒక టీచర్‌ మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చింది. సీఆర్పీ వ్యవస్థ పక్కదారి పట్టడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిరది. దీనికి ఒక విధంగా ప్రభుత్వమే కారణం. దీనివల్ల బోధనా సమయానికి గండి పడుతోంది. ఒక సీఆర్పీ వరిధిలో మహా అయితే పది పాఠశాలలు ఉంటాయి. నాలుగు రోజుల్లో మొత్తం సమాచారం సేకరించడమే కాక యూడైస్‌, ఆన్‌లైన్‌ వర్క్‌ వంటి వాటిల్లో అన్ని పాఠశాలలకు సహకరించే అవకాశం ఉండగా.. వారిని కాంప్లెక్స్‌లకు పరిమితం చేసేశారు. ఇచ్చిన బూట్లు, సాక్సులను పిల్లలు రోజూ వేసుకుని వస్తున్నారా లేదా.. అన్నది గూగుల్‌ ఫారంలో నింపమనడం, అలా ఎవరైనా కనిపిస్తే టీచర్లను మందలించడం, మెమోలిప్పించడంతోపాటు.. తాము నిర్వహిస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లకు పేరెంట్స్‌తో సబ్‌స్క్రైబ్‌ చేయించమని అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

బోధనకు అవకాశం ఇవ్వండి

రోజువారీ లెక్కలు, కొలతలు, సమాచారం ఆన్‌లైన్‌లో అందించడంతోనే సరిపోతోందని టీచర్లు వాపోతున్నారు. బోధనకు సమయం ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. రిపోర్టులు, రికార్డులు సరిగా లేకుంటే తమపై ఎక్కడ చర్యలు తీసుకుంటారోనన్న భయం వెంటాడుతోందని, ఫలితంగా బోధన కంటే కొసరు అంశాలపైనే దృష్టి పెట్టాల్సి వస్తోందంటున్నారు. కాంప్లెక్స్‌ సమావేశాల పేరిట రెండు రోజులు చొప్పున ఆరుసార్లు అంటే ఏడాదిలో 12 రోజులు బడి బోధనకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ప్రత్యేక కార్యక్రమాలు పేరిట మరో రెండు రోజులు వృథా అవుతున్నాయని.. ఈ విధానాన్ని మార్చి బోధనకు అవకాశం ఇవ్వాలని ఉపాధ్యాయవర్గం విజ్ఞప్తి చేస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page