top of page

కక్షల కోలాటం.. ఫరీదుపేట కల్లోలం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jul 12
  • 3 min read
  • ఒకే సామాజికవర్గం.. వేర్వేరు కుంపట్లు

  • రక్షణ ఛత్రంగా రాజకీయ పార్టీలు

  • ఏ పార్టీ అధికారంలో ఉంటే వారిదే ఆధిపత్యం

  • యథాశక్తి కొమ్ము కాస్తున్న ఎచ్చెర్ల పోలీసులు

  • ఇరువర్గాలను లొంగదీస్తే తప్ప దాడులు ఆగవు

ree

ఫ్యాక్షన్‌ హత్యలకు కేరాఫ్‌గా నిలిచిన ఫరీద్‌పేటలో ఆ దుష్ట సంస్కృతికి ముగింపు కనిపించడంలేదు. ఆధిపత్య పోరులో వైరిపక్షాలు పరస్పరం దాడులకు పాల్పడుతున్నాయి. అయితే ఇది కాస్త తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న ప్రతిసారీ ఏదో ఒక హత్య జరుగుతోంది. గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఉన్నా శత్రువులను అనాయసంగా మట్టుబెట్టేస్తున్నారు. వైకాపా అధికారంలో ఉంటే టీడీపీ నాయకులు, టీడీపీ అధికారంలో ఉంటే వైకాపా నేతలే టార్గెట్‌గా దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సత్తారు గోపి హత్యకు ప్రత్యేకమైన కారణాలేవీ అక్కర్లేదు. ఫరీద్‌పేటలో రెండు పార్టీలుగా, రెండు వర్గాలుగా విడిపోయినవారే ఆధిపత్యం సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఈ హత్యలని స్పష్టమవుతోంది.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
ree

ప్రస్తుత ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి తన మాట చెల్లుబాటైన రోజుల్లో రాజకీయ ప్రత్యర్థులు, వారి కుటుంబాలు గ్రామంలో లేకుండా చేసుకున్నారు. దాంతో ప్రాణభయంతో ఎక్కడికెక్కడికో పారిపోయిన ఒక వర్గానికి చెందినవారు పక్క జిల్లా, పక్క రాష్ట్రం నుంచే మొదలవలస చిరంజీవిని అంతం చేసేందుకు స్కెచ్‌ వేశారు. అయితే రెక్కీ నిర్వహిస్తుండగా విశాఖపట్నం పోలీసులకు దొరికిపోయారు. ఈ నేపథ్యంలో ఫరీద్‌పేటలో తరచూ ఏదో ఒక గ్రూపునకు చెందిన వ్యక్తులు ఫ్యాక్షన్‌ రాజకీయాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జరిగిన సత్తారు గోపి హత్య కేసును తానే స్వయంగా దర్యాప్తు చేస్తానని సాక్షాత్తు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డే బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారంటే ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏదో జరుగుతోందని అర్థమవుతుంది. ఫరీద్‌పేటలో హత్యలు, దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. అందుకే దీన్ని సమస్యాత్మక గ్రామంగా గుర్తించారు. సుమారు ఇరవై మందే గ్రామంలో అశాంతికి, దాడులకు కారణమవుతున్నారని గుర్తించి వారిపై రౌడీషీట్‌లు తెరిచారు. ఎవరు ఎవరిపై దాడులు చేయవచ్చు, వాటిలో ఎవరెవరి భాగస్వామ్యం ఉండొచ్చన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది. అందుకే అక్కడ పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. అయినా దాడులు, హత్యలను ఆపలేకపోతున్నారు. ప్రోలీసు వైఫల్యమే దీనికి కారణమని స్థానికులు నిందిస్తున్నారు.

  • పోలీసుల తీరుపై ఆరోపణలు

ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి అనుచరుడిగా, వైకాపా నాయకుడిగా ఎదిగిన సత్తారు గోపి(46) హత్య అనంతరం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన అనంతరం గ్రామాన్ని సందర్శించిన ఎస్పీ కేవీ మహేశ్వర్‌రెడ్డికి ఎచ్చెర్ల పోలీసులు అనుసరిస్తున్న వైఖరి కారణంగానే గోపి హత్య జరిగిందని స్థానికులు ఫిర్యాదు చేయడం దీనికి నిదర్శనం. ఈ కేసులో ఎచ్చెర్ల పోలీసు అధికారిని నిందితుడిగా చేర్చాలని వారు డిమాండ్‌ చేయడం గమనార్హం. గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త కూన ప్రసాద్‌పై 2024 ఆగస్టు 18న దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన అదే నెల 24న మృతి చెందాడు. ఈ కేసులో తొమ్మిది మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు నలుగురిని మాత్రమే నిందితులుగా చూపించారు. వీరికి యాంటిసిపేటరీ బెయిల్‌ వచ్చేలా పోలీసులే సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాన్ని కూడా బాధిత కుటుంబీకులు ఎస్పీ వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. ఆ హత్య కసులో ప్రధాన నిందితులను విడిచిపెట్టడం వల్లే మరో హత్య జరిగిందని వారు వివరించినట్లు తెలిసింది.

  • రెండు దశాబ్దాల కక్షలు

ఫరీద్‌పేటలో 2001 జూన్‌ 21న ఎంపీపీ ఉపాధ్యక్షడిగా పని చేసిన కాంగ్రెస్‌ నాయకుడు కోటిపాత్రుని అప్పలనాయుడు హత్యకు గురయ్యారు. దీనికి ప్రతీకారంగా 2002 ఆగస్టు 24న టీడీపీకి చెందిన మొదలవలస రాంబాబు హత్య జరిగింది. గత ఏడాది ఆగస్టు 24న వైకాపా కార్యకర్త కూన ప్రసాద్‌ మృతి చెందాడు. సరిగ్గా 11 నెలల తర్వాత ఇప్పుడు మరో హత్య జరిగింది. గతంలో టీడీపీ హయాంలో కలెక్టర్‌ లక్ష్మీనృసింహం ఆదేశాలతో ఎస్పీ ఖాన్‌ వైకాపాకు చెందిన మొదలవలస చిరంజీవి, సత్తారు గోపితో పాటు మరో ఇద్దరిపై రౌడీషీట్‌ తెరిచారు. పంచాయతీ కార్యదర్శిపై దాడి చేసినందుకు వారిపై ఈ చర్య తీసుకున్నారు. తర్వాత వైకాపా అధికారంలోకి రావడంతో వీరి ప్రత్యర్థులైన అమ్మినాయుడు, రంగనాధంతో పాటు మరో ముగ్గురిపై రౌడీషీట్‌ తెరిచారు. వీరిలో కొందరు అజ్ఞాతంలో ఉన్నారు. ఈ వివరాలన్నీ తెలుసుకున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసులు గుర్తించిన 20 మంది వైకాపా, టీడీపీ నాయకులపై పీడీ యాక్ట్‌ పెట్టడానికి ఆరు నెలల క్రితమే ప్రయత్నించారు. దీన్ని ఎచ్చెర్ల పోలీసులు లీక్‌ చేయడంతో జిల్లా పార్టీ ప్రముఖుల ద్వారా పోలీసులపై ఒత్తిడి తెచ్చి పీడీ యాక్ట్‌ నమోదు చేయకుండా అడ్డుకున్నారని విశ్వసనీయ సమాచారం.

  • ఆధిపత్యం కోసం వేరుకుంపట్లు

ఎచ్చెర్ల రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉన్న ఫరీద్‌పేటలో హత్యలకు గురైనవారు, ఆ కేసులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారంతా ఒకే సామాజికవర్గానికి చెందినవారు. ఆధిపత్యం విషయంలో విభేదాలతోనే వేరు కుంపట్లు పెట్టుకొని, వేర్వేరు పార్టీల్లో చేరి పరస్పరం ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఫరీద్‌పేటలో నాలుగు హత్యలు, రెండు హత్యాయత్నాలు జరిగాయి. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్ధులు నామినేషన్లు వేయకుండా వైకాపావారు అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణం వల్లే ఎచ్చెర్లలో వైకాపా విజయం సాధించిందని టీడీపీ ఆరోపించింది. దీనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అప్పటినుంచే ఫరీద్‌పేట టీడీపీ నేతలు సమాయత్తమయ్యారు. అందులో భాగంగా పీడీ యాక్టు నమోదు కాకుండా జాగ్రత్తపడ్డారని తెలిసింది. ఒకవేళ పీడీ యాక్ట్‌ నమోదు చేయాల్సి వస్తే వైకాపాకు చెందినవారిపై కూడా పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే గ్రామంలో కొంతమేరకు ప్రశాంతత నెలకొంటుంది. కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన రౌడీషీటర్లను విచ్చలవిడిగా తిరగనిచ్చారు. ఇక్కడ ఎచ్చెర్ల ఎస్‌ఐ ఎవరనేది అప్రస్తుతం. ఎందుకంటే.. అందరూ అదే పని చేశారు.

  • కక్షలకు రాజకీయ ముసుగు

సత్తారు గోపి హత్య రాజకీయ కోణంలో జరగలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల వాదన అవాస్తవమని స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే సత్తారు గోపిని హత్య చేసినవారంతా ఆయన బాధితులే. గతంలో సత్తారు గోపిపై ఇలాంటివారు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే కేసులు నమోదయ్యాయి. అందువల్ల ఇది కేవలం కుటుంబ కలహమో, మరొకటో కాదు. బాధిత కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా తొమ్మిది మందికి పరోక్షంగా ముగ్గురికి ప్రమేయం ఉన్నట్లు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. 300 మంది పోలీసు సిబ్బందితో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. పార్టీల మధ్యే కాకుండా వ్యక్తుల మధ్య కూడా ఆధిపత్య పోరు కారణంగా హత్యలు, హత్యాయత్నాలు జరిగాయి. వైకాపా నాయకుడు జరుగుళ్ల శంకర్‌పై స్వయంగా అదే పార్టీకి చెందిన ఎంపీపీ మొదలవలస చిరంజీవి వర్గం కొన్నాళ్ల క్రితం హత్యాయత్నం చేసింది. అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి ప్రత్యర్థి పార్టీ అనే కోణం లేదు. కేవలం తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని అంతమొందించడమే లక్ష్యంగా ఇక్కడ ఫ్యాక్షన్‌ రాజకీయాలు నడుస్తున్నాయి. వీరంతా ఒక్కో పార్టీ గొడుగు నీడలో ఉండటం వల్ల వీరికి రాజకీయ రక్షణ లభిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ రౌడీషీటర్లు, గ్యాంగ్‌స్టర్లు తమ పార్టీలో ఉండకూడదన్న నిబంధన పెట్టేవరకు ఇక్కడ కక్షలు చల్లారవు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page