కథనం కామెంట్ సెక్షన్‌లో..
- DV RAMANA

- Dec 25, 2025
- 2 min read
భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుబంధంగా ఎడ్యుసిటీ
భూమి ఇవ్వడానికి ముందుకొచ్చిన పూసపాటి కుటుంబం
భీమిలి మండలం అన్నవరంలో 136.63 ఎకరాలు కేటాయింపు
ఏవియేషన్ ఎడ్యుసిటీతో ఈ ప్రాంతం అభివృద్ధికి అవకాశం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
రాజవంశానికి చెందిన ఆయనకు పైలట్ కావాలన్న ఆకాంక్ష ఉండేది. వారి పూర్వీకులకు రెండు సొంత విమానాలు కూడా ఉండేవట! కానీ పైలట్ కావాలన్న ఆయన కోరిక మాత్రం నెరవేరలేదు. కానీ ఈ ప్రాంత అభివృద్ధికి రెక్కలు తొడిగే ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని మాత్రం పూర్తి ఉచితంగా ఇచ్చి ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలోని విద్యార్థులకు, ఉద్యోగార్థులకు విమానయాన రంగంలో పుష్కలంగా అవకాశాలు లభించేలా చేస్తున్నారు. ఆయన మరెవరో కాదు.. రాజులు, రాజ్యాలు పోయినా ఇప్పటికీ విజయనగర ప్రజల గుండెల్లో మహారాజుగానే స్థిరపడిపోయిన మాజీమంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ పూసపాటి అశోక్‌గజపతిరాజు. రాజులుగా ఉన్నప్పటి నుంచి పూసపాటి కుటుంబీకులు దానధర్మాలు ప్రసిద్ధి పొందారు. ఈ కుటుంబం ఏర్పాటు చేసిన మాన్సాస్ ట్రస్ట్ ద్వారా ఎన్నో విద్యాసంస్థలు, దేవాలయాలు నడుస్తున్నాయి. తమకున్న భూముల్లో చాలావరకు ప్రభుత్వ కార్యక్రమాలకు, పేద రైతులకు దానంగా ఇచ్చేశారు. చేతికి ఎముక లేదన్నట్లుగా సాగుతున్న వీరి దానశీలతకు మరో తాజా నిదర్శనమే ఏవియేషన్ ఎడ్యుసిటీకి అవసరమైన 136.63 ఎకరాలను విరాళంగా ఇవ్వడం. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఈ భూమి ధర రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని అంచనా.
భీమిలి సమీపంలో..
భారత నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ డేగా విమానాశ్రయాన్నే ఇన్నేళ్లుగా పౌర విమానాశ్రయంగా నిర్వహిస్తున్నారు. ప్యాసింజర్ విమాన సర్వీసులను నిర్వహిస్తున్నారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంగా ఇది పేరొందినా నేవీపరంగా కొన్ని పరిమితులు ఉండటం వల్ల దీన్ని పూర్తిస్థాయి అంతర్జాతీయ విమాశ్రయంగా అభివృద్ధి చేసేందుకు వీలుపడలేదు. అందువల్లే దానికి ప్రత్యామ్నాయంగా భోగాపురం వద్ద అత్యాధునిక హంగులతో కొత్త విమానాశ్రయ నిర్మాణం చేపట్టారు. అది దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పుడు దీనికి అనుబంధంగా ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటు దిశగా సన్నాహాలు ముమ్మరం కావడంతో విశాఖ, భోగాపురం ప్రాంతాలు విమానయాన రంగంలో అత్యున్నత కేంద్రాలుగా ఎదుగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. భోగాపురంలో అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సమీపంలోనే ఉన్నతస్థాయి విమానయాన విద్య అవకాశాలు కల్పించేలా ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మించాలని నిర్ణయించాయి. అయితే దీనికి భూమి సమకూర్చడం కొంత సమస్యాత్మకంగా మారింది. ఇప్పటికే భోగాపురం విమానాశ్రయానికి భారీగా భూసేకరణ జరిపినందున మళ్లీ ఎడ్యుసిటీ కోసం రైతుల నుంచి భూములు సేకరించడం ఇబ్బందికరంగా మారింది. ఈ తరుణంలో పూసపాటి కుటుంబీకులు మరోసారి తమ వితరణశీలతను చాటుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటు చేయ సంకల్పించిన ఏవియేషన్ ఎడ్యుసిటీకి తమ కుటుంబానికి చెందిన భూములను పూర్తి ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ మేరకు విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం గ్రామం వద్ద ఉన్న మాన్సాస్ ట్రస్టుకు చెందిన 136.63 ఎకరాలు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. విమానాశ్రయాన్ని నిర్మిస్తున్న జీఎంఆర్ గ్రూపే ఎడ్యుసిటీ నిర్మాణానికి ముందుకురాగా, దానికి అవసరమైన భూమి సమకూరుస్తున్నందుకు ప్రతిగా తమ పూర్వీకుడైన మహారాజా అలక్ గజపతి పేరు పెట్టాలని కోరింది. ఆ మేరకు ఈ ఎడ్యుసిటీకి జీఎంఆర్`అలక్ ఎడ్యుసిటీ అనే పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణంగా మాన్సాస్ ట్రస్టు ఆధీనంలో ఉన్న 136.63 ఎకరాలను ఎడ్యుసిటీకి దఖలు పరిచేందుకు దేవదాయ శాఖకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్తులు ఇచ్చింది. పౌర విమానయానానికి సంబంధించిన అన్ని యూనివర్సిటీ బ్రాంచ్‌లను ఒకచోటకు తెచ్చేందుకు ప్రభుత్వం ఎడ్యుసిటీని ప్రతిపాదించింది.
విమానయానంపై మక్కువ
పూసపాటి రాజవంశీయులకు పూర్వకాలమే రెండు సొంత విమానాలు ఉండేవి. వాటికోసం విమానాశ్రయాలను సొంతం నిర్మించి, నిర్వహించేవారని చరిత్ర చెబుతోంది. రాజ్యాలు పోయిన తర్వాత రాజవంశీకుడైనప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇమిడిపోయిన అశోక్ గజపతిరాజు సైతం పైలెట్ కావాలని ఆశించినా అది సాకారం కాలేదు. కానీ ఆయన దేశంలో విమానయాన రంగాన్ని పర్యవేక్షించే పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రాథమిక అడుగులు పడటం విశేషం. ఇప్పుడు ఏవియేషన్ ఎడ్యుసిటీలో ఈ కుటుంబానికి భాగస్వామ్యం దక్కింది. దీనివల్ల దేశంలో విమానయానం, ఏరోస్పేస్‌తోపాటు రక్షణ రంగంలోనూ ఎయిర్‌ఫోర్స్ కొత్తపుంతలు తొక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ఎయిర్ ట్రాఫిక్ అటు ప్యాసింజర్, ఇటు కార్గో రవాణాపరంగా బాగా పెరుగుతోంది. వీటన్నింటివల్ల భవిష్యత్తులో పౌర, రక్షణ, వాణిజ్య విమానాయాన రంగాల్లో విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఎడ్యుసిటీ దానికి దోహదం చేస్తుంది.










Comments