కదల్లేని దివ్యాంగ ఉద్యోగిని ‘కదిలించే’ పన్నాగం!
- BAGADI NARAYANARAO

- Jun 12, 2025
- 2 min read

జూనియర్ అసిస్టెంట్ సీటు కొట్టేసే ఎత్తుగడ
అతని స్థానంలో తమవారిని తెచ్చుకునే ఆలోచన
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో కొందరి యత్నాలు
నిబంధనలు వద్దంటున్నా బేఖాతరు
ఆయన ఆ కుర్చీలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కాలేదు. పోనీ స్వయంగా కోరుకున్నారా అంటే.. అదీ లేదు. కానీ అతన్ని తప్పించి.. ఆ కుర్చీని ఆక్రమించడానికి రెండేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తీరా చూస్తే.. ఆ బాధితుడు వికలాంగుడు. ఇద్దరు సహకరిస్తే తప్ప కదల్లేని అభాగ్యుడు. అయినా ఏమాత్రం కనికరం లేకుండా.. వికలాంగులను కదిలించకూడదన్న నిబంధనలు ఉన్నా.. ఖాతరు చేయకుండా కత్తిగట్టి అదేపనిగా సదరు ఉద్యోగికి స్థానచలనం కలిగించడానికి కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది కూడా ఇటువంటి ప్రయత్నమే జరిగినా జిల్లా అధికారులు అడ్డుకోవడంతో బయటపడిన ఆ బాధితుడు శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగి కేశవరావు. మళ్లీ ఇప్పుడు అతనిపై అదే బదిలీ కత్తి వేలాడుతోంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నిబంధనలకు విరుద్ధంగా.. ఒక అభాగ్య ఉద్యోగిపై బదిలీ వేటు వేసేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన స్థానంలో తమవారిని కూర్చోబెట్టేందుకు రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. పైడి కేశవరావు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. చిన్నతనంలోనే పోలియో సోకి రెండు కాళ్లు చచ్చుబడిపోవడంతో 80 శాతానికిపైగా వైకల్యం కలిగిన నిర్భాగ్యుడు. ఆ కోటాలోనే ఉద్యోగం సంపాదించాడు. ఇద్దరి సహాయం లేనిదే కదల్లేని దుస్థితి అతనిది. రోజూ త్రిచక్ర వాహనంలో కార్యాలయానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇంటి వద్ద కుటుంబ సభ్యులు వాహనంపై కూర్చోపెడితే.. కార్యాలయం వద్ద అటెండర్లు ఆయన్ను సీటు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెడుతుంటారు. ఇది చాలదన్నట్లు.. ఇటీవల విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి ఒక వాహనం ఈయన ప్రయాణిస్తున్న త్రిచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దాంతో కింద పడిన కేశవరావుకు మోకాళ్ల చిప్పలు విరిగిపోయాయి. రెండు నెలలు ఆస్పత్రి పాలై మోకాళ్ల చిప్పలకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఫలితంగా త్రిచక్ర వాహనం కూడా నడపలేని పరిస్థితి ఏర్పడిరది. దాంతో రిమ్స్‌లో సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న కేశవరావు చిన్నకుమారుడు ప్రతిరోజూ ఉదయం తాను విధులకు వెళ్లేటప్పుడే తన ద్విచక్రవాహనంపై తండ్రిని తీసుకెళ్లి కార్యాలయం వద్ద దించుతున్నారు. తిరిగి తన విధులు ముగిసిన తర్వాత రాత్రి 8.30కు ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇంత దీనస్థితిలో ఉన్న తనకు స్థానచలనం కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకుని కేశవరావు ఆందోళన చెందుతున్నారు.
బదిలీ కోరుకోకపోయినా..
ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో కేశవరావును తహసీల్దార్ కార్యాలయం నుంచి పంపించేసి తమకు అనుకూలంగా ఉన్నవారిని, తమవారిని తీసుకొచ్చేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. బదిలీల నుంచి దివ్యాంగులకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. బదిలీ కోరుతూ ఆయన దరఖాస్తు కూడా చేయలేదు. పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బదిలీ చేయాల్సి ఉంది. ఒకేచోట ఐదేళ్లలోపు పనిచేసిన ఉద్యోగులను వారు కోరితేనే బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. మెడికల్ గ్రౌండ్స్‌లో ఉద్యోగుల వినతి మేరకు బదిలీ చేయవచ్చు. కానీ ఇవేవీ లేకుండానే.. కేశవరావు దరఖాస్తు చేసుకోకుండా.. కనీసం ఆయన శారీరక దుస్థితిని పట్టించుకోకుండా బదిలీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారని తెలిసింది. తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరి నాలుగున్నరేళ్లే అయ్యింది. అందువల్ల కేశవరావును బదిలీ చేయడం ఎలా చూసినా చెల్లదు.
గత ఏడాదీ విఫలయత్నం
ఇప్పుడే కాదు.. గత ఏడాది కూడా కేశవరావును తహసీల్దార్ కార్యాలయం నుంచే పంపేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో అతన్ని శ్రీకాకుళం ఆర్డీవో కార్యాలయానికి బదిలీ చేశారు. అయితే ఉన్నతాధికారులు అతని పరిస్థతి చూసి బదిలీని రద్దు చేసి శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయానికి తిరిగి పంపించేశారు. అయినా మళ్లీ ఆయన్ను బలవంతంగా సాగనంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయం తెలిసి కేశవరావు కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ వద్దకు వెళ్తే చూస్తానంటూ భరోసా ఇచ్చారు. ఆ తర్వాత కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తే స్థాన చలనం చేయబోమని మాటిచ్చారు. తహసీల్దారు కూడా అదే హామీ ఇచ్చారు. కానీ కొందరు ఉద్యోగులు అదే పనిగా ప్రయత్నాలు చేసి స్థానిక ఎమ్మెల్యే నుంచి వేరే వారి కోసం సిఫార్సు లేఖ తీసుకున్నట్టు భోగట్టా. లేఖ ఎవరికిచ్చారో, ఎందుకోసమిచ్చారన్న విషయం ఎమ్మెల్యేకు తెలియకపోవచ్చు. కనీసం ఈ కథనం చదివిన తర్వాతైనా ఒక దివ్యాంగుడి స్థానంలో వేరేవారు రావడం కోసం ప్రయత్నిస్తున్నారని గ్రహించి న్యాయం చేస్తే అంతే చాలు.










Comments