top of page

కదలడు.. వదలడు!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Aug 5, 2025
  • 2 min read
  • రెండు నెలలైనా కొత్త పోస్టులో చేరని ఉద్యోగి

  • షాడో ఏవోగా కార్యాలయంలో పెత్తనం

  • వసూళ్లు వస్తాయనే ఉన్న సీటుపై తరగని మోజు

  • రిటైర్డ్‌ ఉద్యోగుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులన్నీ పెండిరగ్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ప్రభుత్వ శాఖల్లో సాధారణ బదిలీలు జరిగి రెండు నెలలైంది. బదిలీ అయిన వారందరూ దాదాపుగా కొత్త పోస్టుల్లో చేరిపోయారు. కానీ వైద్య ఆరోగ్యశాఖలో ఒక్క ఉద్యోగి మాత్రం ఇంకా పాత సీటును పట్టుకుని వేలాడుతున్నాడు. ఏ దూరప్రాంతానికో.. వేరే ఊరికో బదిలీ అయినందున.. ఇష్టం లేకో, ఇబ్బందులతోనో కొత్త పోస్టులో చేరలేదనుకుంటే పొరపాటు. ఒకే కార్యాలయ భవనంలో కింద ఫ్లోర్‌ నుంచి పై అంతస్తుకు బదిలీ అయ్యాడంతే! మరెందుకు కొత్త పోస్టులో చేరడం లేదంటే.. ప్రస్తుతం పని చేస్తున్న కింద ఫ్లోర్‌లో ఆయనకో కోటరీ ఉంది. పై సంపాదనకు మంచి సోర్స్‌ ఉంది. మేడ పైకి వెళ్లిపోతే అదంతా పోతుందన్నదే ఆయనగారి బాధ. దాంతో తన కోటరీ హెడ్‌ అయిన ఏవో సహాయంతో ఇక్కడే తిష్ట వేయాలని ప్రయత్నిస్తున్నాడు. రిలీవర్‌ రానందువల్లే తాను కొత్త పోస్టులో చేరలేకపోతున్నానని సాకులు చెబుతున్నాడు.

కుమ్మక్కు వ్యవహారాలు

ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని పరిపాలన విభాగం(ఏవో)లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉదయ్‌కుమార్‌కు జూన్‌ 23న అదే కార్యాలయంలోని పై అంతస్తులో ఉన్న టీడీ ఐడీ కార్యాలయానికి బదిలీ అయ్యింది. ఇప్పటివరకు ఆయన పని చేసిన సీటులో సీతంపేట ఏజెన్సీ ప్రాంతం నుంచి వేరే ఉద్యోగి వచ్చి చేరాల్సి ఉంది. కానీ ఏజెన్సీ ప్రాంతానికి వర్తించే నిబంధనల ప్రకారం అక్కడ కొత్త ఉద్యోగి వచ్చి చేరే వరకు బదిలీ అయిన ఉద్యోగిని రిలీవ్‌ చేయడానికి లేదు. ఆ మేరకు కొత్త ఉద్యోగి రాకపోవడంతో అక్కడి నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయంలోని ఉదయ్‌కుమార్‌ సీటులో చేరాల్సిన ఉద్యోగి రాలేదు. మైదాన ప్రాంతాలకు ఈ నిబంధన వర్తించదు. తన స్థానంలో కొత్త ఉద్యోగి వచ్చినా రాకపోయినా బదిలీ అయిన ఉద్యోగి కొత్త పోస్టులోకి వెళ్లిపోవాల్సిందే. కానీ దీన్నే సాకుగా చూపుతూ ఉదయ్‌కుమార్‌ బదిలీ స్థానమైన టీబీ ఐడీ కార్యాలయంలో జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చేసినా.. అక్కడ విధులు నిర్వర్తించకుండా కింది అంతస్తులోని పాత సీటులోనే కాలక్షేపం చేస్తున్నాడు. ఏవో అండదండలతో పాత సీట్లోనే కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోనీ పాత సీట్లో అయినా పని చేస్తున్నాడా అంటే.. అదీ లేదు. రిటైర్డ్‌ ఉద్యోగుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు క్లియర్‌ చేయడం, సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా వచ్చే దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వడం వంటి పనులను ఏవో కార్యాలయంలోని జూనియర్‌ అసిస్టెంట్‌ విధుల్లో భాగంగా బదిలీకి ముందు వరకు అదే పోస్టులో ఉన్నా, బదిలీ అయినా దాన్నే పట్టుకుని వేలాడుతున్నా కూడా ఉదయ్‌కుమార్‌ ఆ విధులు మాత్రం నిర్వర్తించడంలేదు. ఫలితంగా గత రెండు నెలల నుంచి బిల్లులన్నీ పెండిరగులో ఉండిపోయి రిటైర్డ్‌ ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. ఆర్టీఐ దరఖాస్తులు కూడా పరిష్కారానికి నోచుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వసూళ్లు.. పెత్తనాలు..

జస్ట్‌.. మేడ మెట్లెక్కి పైకి వెళ్లి కొత్త సీటులో కూర్చొనే అవకాశాన్ని కూడా కాదనుకుని ఉదయ్‌కుమార్‌ పాత సీటులోనే కొనసాగాలని ప్రయత్నించడం, ఏవో కూడా బదిలీ అయిన ఉదయ్‌కుమార్‌ సీటు బాధ్యతలను కొత్తవారు వచ్చే వరకు వేరొకరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించకుండా కాలక్షేపం చేస్తుండటం వెనుక కుమ్మక్కు వ్యవహారాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఎంహెచ్‌వో కార్యాలయంలో సూపరింటెండెంట్‌, ఏవో, జూనియర్‌ అసిస్టెంట్‌ (ఉదయ్‌కుమార్‌) ఒక కోటరీగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. డీఎంహెచ్‌వో పేరుతో అనవసర పెత్తనాలకు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. ఉదయ్‌కుమార్‌ ఏవోకు షాడోగా వ్యవహరిస్తూ తోటి ఉద్యోగులపై పెత్తనం చేస్తున్నాడని.. పనులపై వచ్చే వారినుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. తోటి ఉద్యోగులపై ఏవోకు, డీఎంహెచ్‌వోకు చాడీలు చెబుతూ ఇబ్బందిపెడుతున్నాడని తెలిసింది. డీఎంహెచ్‌వోకు ఇవ్వాలంటూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఉదయ్‌కుమార్‌ ఆగడాలపై తోటి ఉద్యోగులు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు చర్యలు తీసుకోకపోవడంతో వారికీ వాటాలు ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఎట్టకేలకు బదిలీ అయ్యాడనుకుంటే.. కొత్త పోస్టులో చేరకుండా ఇక్కడే తిష్ట వేశాడని డీఎంహెచ్‌వో కార్యాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page