కన్నీరు పెట్టుకున్న కళా
- SATYAM DAILY
- Jan 13
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
తన చిరకాల మిత్రుడు, రాజకీయ సహచరుడు తుదికంటూ తనతోనే ఉన్న మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణ పార్ధివ దేహాన్ని చూసి చీపురుపల్లి ఎమ్మెల్యే, మాజీమంత్రి కళా వెంకట్రావు కన్నీరు పెట్టుకున్నారు. మంగళవారం అప్పలసూర్యనారాయణ కడచూపునకు వచ్చిన కళా తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. గుండ తనయుడు శివగంగాధర్ కళాను ఓదార్చాల్సివచ్చింది. అప్పలసూర్యనారాయణ, కళా వెంకట్రావుల కాంబినేషన్ జిల్లాలో ప్రత్యామ్నాయ శక్తులుగా టీడీపీలో బలంగా ఉండేది. అప్పలసూర్యనారాయణ నమ్మితే ఒక వ్యక్తి కోసం ఎంతలా నిలబడతారనడానికి 1995లో జరిగిన జిల్లాపరిషత్ ఎన్నికలే సాక్ష్యం. 1994లో రాష్ట్రవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఉత్తరాంధ్రలో కళా వెంకట్రావు ఉణుకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పాలవలస రాజశేఖరం చేతిలో ఓడిపోయారు. మిగిలినవారంతా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్లారు. జిల్లాలో కళా లేకపోవడం వల్ల ఆయన పట్టు సడలుతుందని భావించిన అప్పలసూర్యనారాయణ కళా వెంకట్రావు ప్రతిపాదన మేరకు ఆయన తమ్ముడు భార్య డాక్టర్ కిమిడి మృణాళినికి జెడ్పీ చైర్మన్‌గా ప్రతిపాదించే అంశంలో ఆయనే ముందు సంతకం చేశారు. అప్పటి పరిస్థితుల్లో జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనను అంగీకరించలేదు. కానీ అప్పలసూర్యనారాయణ తన మిత్రుడు కళా వెంకట్రావుకు జిల్లాలో పట్టు దొరకాలని మృణాళినిని చైర్మన్‌గా ఎంపిక చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్నుంచీ కొనసాగుతున్న వీరి బంధం అప్పలసూర్యనారాయణ మృతితో ముగిసిపోయింది.










Comments