కప్పం కాసులవాడు.. ఈ శ్రీనివాసుడు!
- NVS PRASAD
- Aug 8
- 3 min read
కట్టాల్సిందే కప్పం.. లేదంటే తప్పదు నరకం!
గిరిజన సంక్షేమ శాఖలోనే రికార్డుస్థాయిలో వసూళ్ల దందా
కాంట్రాక్టర్లతో తెరవెనుక వ్యాపార భాగస్వామ్యం
ఆ విభేదాల నేపథ్యంలోనే లంచం పేరుతో ఏసీబీకి ఉప్పు
మామూళ్ల కోసం సొంత సిబ్బందినే వేధించిన ఈఎన్‌సీ
ఈ కేసులో తామెక్కడ దొరికిపోతామేమోనని వారి ఆందోళన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్ర చరిత్రలోనే ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఏకంగా రూ.25 లక్షలు లంచంగా తీసుకుంటూ ఒక చీఫ్ ఇంజినీర్ దొరికిపోవడం ఒక సంచలనమైతే.. అయ్యగారు దొరికిపోవడం ఆయన కింద పనిచేసే ఇంజినీరింగ్ అధికారులను బెంబేలెత్తిస్తుండటం విశేషం. గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) సబ్బవరపు శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసు ఆ శాఖలోని పలువురు ఇంజినీరింగ్ ఉద్యోగుల్లో కలవరం రేపుతోంది. తన కిందిస్థాయి ఇంజినీరింగ్ సిబ్బంది ఎవరైనా.. ఎప్పుడు విధుల్లో చేరినా.. ఏమాత్రం మొహమాటం లేకుండా ఫలానా మొత్తం వసూలు చేసి తనకు కప్పం కట్టాలని ఆదేశించడం.. దాన్ని పాటించని వారిని వేధించి, చిత్రవధ చేసిన ఈఎన్‌సీ సబ్బవరపు శ్రీనివాస్ ఒక కాంట్రాక్టర్‌కు రూ.35.5 కోట్ల బిల్లు చెల్లింపునకు రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. అడ్వాన్స్‌గా రూ.25 లక్షలు తీసుకుంటూ దొరికిపోవడంతో ఈఎన్‌సీ కోసం కాంట్రాక్టర్ల వద్ద ముక్కుపిండి మరీ వసూలుచేసిన ఇంజినీరింగ్ సిబ్బందికి దడ పట్టుకుంది. ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖలో పెద్ద సంచలనమైంది. విశాఖకు చెందిన సత్యసాయి కన్‌స్ట్రక్షన్స్ నిర్వాహకుడు చెరుకూరి కృష్ణంరాజు ఏడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను కాంట్రాక్టు పద్ధతిలో నిర్మించారు. దీనికి సంబంధించి రూ.35.5 కోట్ల వరకు బిల్లులు ఆయనకు రావాల్సి ఉంది. ఈ బిల్లు మంజూరు చేయాలని ఈఎన్‌సీని కోరగా రూ.5 కోట్ల ముడుపు కడితేనే బిల్లు ఓకే చేస్తానని ఆయన భీష్మించుకు కూర్చున్నారు. దాంతో కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఏసీబీని ఆశ్రయించి లంచం తీసుకుంటుండగా ఈఎన్‌సీ శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించారు.
లంచంతోపాటు వ్యాపార లాభం
పేరులో గిరిజనాన్ని పెట్టుకున్న సంక్షేమ శాఖలో రూ.35.5 కోట్ల బిల్లులకు రూ.5 కోట్ల లంచమా అని రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ అధికారులు నోరెళ్లబెడుతున్నారు. ఈ స్థాయిలో లంచాలుంటాయని తెలియక అనవసరంగా తక్కువ డబ్బులకే బిల్లులు చేసేస్తున్నామని కొన్ని డిపార్ట్‌మెంట్ల సిబ్బంది తెగ బాధపడిపోతున్నారు ఫీలవుతున్నారు కూడా. వాస్తవానికి ఈఎన్‌సీ శ్రీనివాస్ డిమాండ్ చేసిన రూ.5 కోట్ల మొత్తం ఒక్క లంచానికి సంబంధించినది మాత్రమే కాదని తెలిసింది. ఆయన్ను పట్టించిన సత్యసాయి కన్‌స్ట్రక్షన్స్ నిర్వాహకులతో ఈఎన్‌సీ శ్రీనివాస్‌కు తెరవెనుక వ్యాపార భాగస్వామ్యాలు ఉన్నాయని ఎప్పట్నుంచో ఓ టాక్ ఉంది. ఈ సంస్థ ద్వారా శ్రీనివాస్ గిరిజన సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్‌లు చేయడంతో పాటు విశాఖపట్నం వంటి సిటీల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నారని భోగట్టా. ఇప్పుడు ఏకలవ్య మోడల్ స్కూల్ భవనాలకు సంబంధించి తాను తెర వెనుక పెట్టిన పెట్టుబడులపై లాభంతో పాటు బిల్లులు చెల్లించడానికి ఈఎన్‌సీ హోదాలో లంచంతో కలుపుకొని రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈఎన్‌సీ శ్రీనివాస్ స్వభావమే ఇందుకు కారణం.
రాజకీయంగానూ బలవంతుడే
ఎమ్మెల్యేలంటే ఈఎన్‌సీ శ్రీనివాస్‌కు ఏమాత్రం ఖాతరు లేదు. కేబినెట్‌లో ఉన్నవారి అండదండలు తనకు ఉన్నాయన్న ధైర్యంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎమ్మెల్యేల ప్రతిపాదనలను ఆయన ఏరోజూ పట్టించుకోలేదు. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లోనే వందకు పైగా పనులు మధ్యలో ఆగిపోవడమే దీనికి నిదర్శనం. తనకు వాటాలు అందని ప్రతి పనిని ఆయన మధ్యలోనే నిలిపేశారు. దీనివల్ల ప్రజాప్రతినిధులుగా తమకు చెడ్డపేరు వస్తుందని, పనులు కొనసాగించాలని ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు మొత్తుకున్నా శ్రీనివాస్ ఎన్నడూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో గానీ, గత ప్రభుత్వంలో గానీ ఆయన పంపిన డబ్బులు తిన్న ఎమ్మెల్యేలు గమ్మున కూర్చుంటే.. ఈయన అరాచకాన్ని తట్టుకోలేనివారు ఫిర్యాదులు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. పోస్టులు కూడా అప్పనంగా దక్కించుకున్నారు. ఈఈగా ఉంటూనే పూర్తి అదనపు బాధ్యతలతో ఎస్‌ఈ పోస్టు చూశారు. ఎస్‌ఈగా ఉంటూనే పూర్తి అదనపు బాధ్యతలతో ఈఎన్‌సీగా వెలగబెడుతున్నారంటే ఆయన రాజకీయంగా ఎంత బలవంతుడో అర్థం చేసుకోవచ్చు. నెల రోజుల క్రితమే ఆయన రెగ్యులర్ ఈఎన్‌సీ అయ్యారు. ఏ పోస్టులో ఉన్నా కాంట్రాక్టర్లతో పాటు సొంత డిపార్ట్‌మెంట్‌లోని వారికి వేధింపులు తప్పేవికావని ఏసీబీ ట్రాప్ తర్వాత సిబ్బంది బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
వసూళ్ల కోసమే రివర్షన్లు
సీతంపేట ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం ఈఈగా గతంలో పనిచేసిన రమాదేవి అక్కడి ఇంజినీరింగ్ వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టారు. అదే సమయంలో ఇక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి రూ.70 లక్షలు తనకు పంపించాలని ఆమెను శ్రీనివాస్ డిమాండ్ చేశారని తెలిసింది. అయితే అది తనవల్ల కాదని తెగేసి చెప్పడంతో ఆమెను ఆకస్మికంగా నెల్లూరుకు బదిలీ కొట్టారు. కానీ కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుని రమాదేవి సీతంపేట ఈఈగా వచ్చి కూర్చున్నారు. అలాగే అల్లూరి మన్యం జిల్లా (పాడేరు) ఈఈగా పని చేస్తున్న డేవిడ్‌రాజుకు శ్రీనివాస్ నరకం చూపించారు. ఫోకల్ సీటులో కి పంపాలంటే తనకు కప్పం కట్టాలంటూ ప్రమోషన్లను తారుమారు చేసిన ఘనత శ్రీనివాస్‌దే. డీఈలను జేఈలుగాను, ఈఈలను డీఈలుగాను రివర్షన్లు ఇచ్చేసి మళ్లీ సేమ్ పోస్టు కావాలంటే సొమ్ములివ్వాలని డిమాండ్ చేసేవారని తెలిసింది. ఇప్పుడు సత్యసాయి కన్‌స్ట్రక్షన్స్‌లో ఈఎన్‌సీ తెరవెనుక పార్టనర్‌గా కొనసాగుతున్నారనే ఆరోపణలుండగా, మరో కన్‌స్ట్రక్షన్ కంపెనీ దత్తసాయితో ఈయనకు తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయి. కురపాం, భామిని మండలాల్లో చేసిన పనులకు వారికి బిల్లులు చెల్లించకపోగా తిరిగి వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. దాంతో సదరు కంపెనీ కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. గిరిజన సంక్షేమ శాఖలో ఇంత భారీ స్థాయిలో అవినీతి జరగడానికి ప్రధాన కారకుడు శ్రీనివాసేనని చెప్పుకుంటున్నారు. గతంలో ఆయన శ్రీకాకుళం ఈఈగా పని చేసినప్పుడు ఐటీడీఏ కార్యాలయంలో గొండు సోమేశ్వరరావు అనే జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. అలాగే 2001లో ఈయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏసీబీ నమోదు చేసింది. అసలు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పూర్తిగా పనులు చేయకుండానే బిల్లులు పెడుతున్నారా? లేక ఈఎన్‌సీకి భయపడి అంత మొత్తంలో లంచాలు చెల్లించుకుంటున్నారా? తేల్చడానికి ప్రభుత్వం సిద్ధపడుతోంది.
Comentários