కరడుగట్టిన నేరస్తుడు దున్న కృష్ణ అరెస్టు
- BAGADI NARAYANARAO

- 2 days ago
- 2 min read
33 ఏళ్లలో 218 నేరాలు
కోల్‌కతాలో మకాంపెట్టి జిల్లాలో చోరీ
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 218 కేసులు నిందితుడిగా ఉన్న మెళియాపుట్టి మండలం, చాపురం గ్రామానికి చెందిన కోల్‌కతాలోని బాటానగర్‌లో నివాసముంటున్న కరడుగట్టిన నేరస్తుడు దున్న కృష్ణను అరెస్టు చేసినట్టు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో 25 గ్రాముల వెండి పోయిందని రూరల్ పోలీస్ స్టేషన్‌లో నగరంలోని ఎస్‌బీఐ స్టాఫ్ కాలనీకి చెందిన ఎతురాజుల భవాని సెప్టంబర్ 13న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో అరెస్టు చేసి విచారించగా, శ్రీకాకుళం రూరల్ పరిధిలో 14, శ్రీకాకుళం రెండో పట్టణ పరిధిలో 3, ఒకటో పట్టణ పరిధిలో ఒక దొంగతనం చేసినట్టు తేలిందన్నారు. నమోదు కాబడిన మొత్తం 18 రాత్రి దొంగతనాల కేసులో చోరీ చేసింది 362.4 గ్రాముల బంగారం, 1443 గ్రాముల వెండి అభరణాలు, వస్తువులు, నగదు రూ.7.03 లక్షలని తెలిపారు. ఇప్పటి వరకు నిందితుడు దున్న కృష్ణ నుంచి 237 గ్రాముల బంగారం, 1391 గ్రాముల వెండి, నగదు రూ.1.50 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 55 ఏళ్ల దున్న కృష్ణ 33 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 218 ఇళ్లలో నేరాలు చేసినట్టు తెలిపారు. వీటిలో సుమారు 60 కేసుల్లో శిక్ష పడిరదన్నారు. దున్న కృష్ణ జీవితంలో సగం జైలు జీవితం అనుభవించినట్టు తెలిపారు. దున్న కృష్ణ ఆయన కుటుంబంతో కోల్‌కతాలోని బాటానగర్‌లో నివాసముంటూ జిల్లాకు వచ్చి నేరాలు చేసి వెళ్లిపోతుంటాడని వివరించారు. వ్యక్తిగత గుర్తింపు కార్డు ఉంటే పోలీసులకు పట్టుబడతానని ఆధార్, ఓటరు కార్డు తీసుకోలేదని, సెల్‌ఫోన్ వాడడం లేదని తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉన్న ఇళ్లను తాళాలను పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదు దొంగలించడం ప్రవృత్తిగా మార్చుకున్నాడని తెలిపారు. 2024 జనవరి 13న జైలు నుంచి బయటకు వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు శ్రీకాకుళం నగరం పరిధిలో 18 నేరాలు చేసినట్టు తెలిపారు. దున్న కృష్ణతో బ్రోతల్ కేసులో అరెస్ట్ అయిన గూనపాలెంకు చెందిన సయ్యద్ రఫీ˜కి జైల్లో పరిచయం ఏర్పడిరదన్నారు. దున్న కృష్ణ చోరీచేసిన సొత్తును రఫీకి ఇచ్చి దాన్ని విక్రయించి ఇద్దరు వాటాలు పంచుకొనేవారిని తెలిపారు. అదేవిధంగా కోల్‌కతా, సోనాపూర్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులకు దున్న కృష్ణ చేసిన చోరీ సొత్తును వారికి ఇచ్చినట్టు విచారణలో తేలిందన్నారు. వారిని అరెస్ట్ చేయవలసింది ఉందని తెలిపారు. ఈ కేసుల్లో దున్న కృష్ణతో పాటు సయ్యద్ రఫీని అరెస్టు చేసినట్టు తెలిపారు.

ఆ ఇద్దరిపై చర్యలు
నగరం పరిధిలో నమోదైన 18 కేసుల్లో ఇద్దరు ఫిర్యాదుదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. బంగారం పోకుండానే 46 గ్రాముల బంగారం పోయినట్టు ఒకరు ఫిర్యాదు చేశారని ఎస్పీ తెలిపారు. మరో కేసులో కేవలం 15 గ్రాముల బంగారం పోతే, 71 గ్రాములు బంగారం పోయినట్టు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తప్పుగా ఫిర్యాదు చేసినందుకు ఇరువురుపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రతిభకు ప్రశంస
నిందితుడిని అదుపులోకి తీసుకోవడం, చోరీ అయిన బంగారం, వెండి అభరణాలు, నగదు రికవరీ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించి కేసును చేధించడంలో ప్రతిభ కనబర్చినవారికి ఎస్పీ ప్రశంసించి అభినందించారు. అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో, డీఎస్పీ సీహెచ్ వివేకానంద సూచనలతో రూరల్ సర్కిల్ సీఐ కె.పైడిపునాయుడు, సీసీఎస్ సీఐ చంద్రమౌళి, సీసీఎస్ ఎస్సైలు రాజేష్, గణేష్, రూరల్ ఎస్సై కె.రాము, సిబ్బందిని ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించినారు.










Comments