top of page

కలెక్టర్ ఉదారత్వం.. పేదింట సంతోష ‘సమీర’O

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 23
  • 2 min read
  • చదువుల తల్లికి బోన్‌మ్యారో క్యాన్సర్

  • కాళ్లు పనిచేయక చక్రాల కుర్చీకి పరిమితం

  • తాత్కాలిక వైకల్య సర్టిఫికెట్ జారీతో అందని పెన్షన్

  • వైకాపా సమన్వయకర్త చొరవతో కలెక్టర్ దృష్టికి సమస్య

  • పెన్షన్ బదులు పూర్తిస్థాయి చికిత్సకు స్వప్నిల్ దినకర్ చర్యలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

రొట్టె విరిగి నేతిలో పడటమంటే బహుశా ఇదేనేమో! శారీరక వైకల్యంతో బాధపడుతున్న బాలిక ఆర్థిక అండ కోసం వెళితే సమస్యకు శాశ్వత పరిష్కారమే సూచించే విధంగా జిల్లా ఉన్నతాధికారి చొరవ తీసుకోవడం విశేషం. ఇచ్ఛాపురం మండలం తీరగ్రామమైన డొంకూరుకు చెందిన దున్న సమీర సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కృపకు పాత్రురాలై.. తన శారీరక రుగ్మతకు శాశ్వత చికిత్స పొందే భాగ్యాన్ని అందుకుంది. సమీర దుస్థితి తెలుసుకున్న ఇచ్ఛాపురం నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి చొరవ తీసుకుని ఆమెను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్‌కర్ వద్దకు తీసుకెళ్లి దీర్ఘకాలిక రోగులకు ఇచ్చే పెన్షన్ మంజూరు చేయాలని కోరగా.. కలెక్టర్ అంతకుమించి స్పందించి బాధితురాలి వైకల్యానికి శాశ్వత చికిత్స చేయించే మార్గమే చూపించి ఉదారత చాటుకున్నారు. దాంతో కూతురి దీనస్థితిని చూస్తూ కుమిలిపోతున్న ఆ పేద కుటుంబం పెద్ద పెన్నిధి లభించినట్లుగా సంబరపడిపోతున్నది.

చదువుల సరస్వతికి పెద్ద కష్టం

ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామానికి చెందిన దున్న మాధవరావుది నిరుపేద కుటుంబం. దంపతులిద్దరూ వలస జీవనంలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. వారి కుమార్తె సమీర. పదిహేనేళ్ల ఈ బాలిక చదువులో దిట్ట. ప్రభుత్వ పాఠశాలలో చుదువుకుని పదో తరగతిలో సుమారు 75 శాతం మార్కులతో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. కానీ చదువుల సరస్వతి కటాక్షం ఉన్న ఆమెను విధి మాత్రం వెక్కిరించింది. ఆమెకు బోన్‌మ్యారో క్యాన్సర్ సోకినట్లు వెల్లడైంది. పెద్ద ఆస్పత్రులకు తిప్పి, లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో క్యాన్సర్ ముదిరి నరాలు బలహీనపడి రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఫలితంగా సమీర చక్రాల కుర్చీకే పరిమితమైంది. ఆ బాలిక చికిత్సకు నెలనెలా పెద్దమొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం దీర్ఘకాలిక రోగులకు ఇచ్చే పెన్షన్ కోసం తల్లిదండ్రులు ప్రయత్నించారు. దానికి అవసరమైన వైకల్య సర్టిఫికెట్ కోసం టెక్కలిలోని జిల్లా ఆస్పత్రి మెడికల్ బోర్డుకు వెళ్లగా అక్కడ టెస్టులు నిర్వహించి 88 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్థారించి గత ఏడాది అక్టోబర్‌లో సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ రెండేళ్ల పరిమితికి తాత్కాలిక వైకల్య సరిఫికెట్ ఇవ్వడం, ఆ తర్వాతే శాశ్వత ధ్రువపత్రం ఇస్తామని చెప్పడంతో సమీర దీర్ఘకాలిక రోగుల పెన్షన్‌కు అర్హత సాధించలేకపోయింది.

శ్యాంప్రసాద్‌రెడ్డి చొరవ

ఈ విషయం ఇచ్ఛాపురం నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జి సాడి శ్యాంప్రసాద్‌రెడ్డి దృష్టి రావడంతో సమీర కష్టాలకు పరిష్కారం మార్గం తెరుచుకుంది. డొంకూరులోని ఇంటికి వెళ్లి బాలిక కష్టాలు, వివరాలు తెలుసుకున్న ఆయన ప్రభుత్వ పెన్షన్ మంజూరయ్యే వరకు తన తరఫున రూ.2500 ప్రతినెలా పెన్షన్‌గా ఇస్తానని చెప్పి.. ఈ నెల మొత్తం కూడా అందజేశారు. అయితే అక్కడితో ఆగకుండా విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ తన ప్రత్యేకాధికారాల పరిధిలో ఉన్న కోటా నుంచి సమీరకు పెన్షన్ మంజూరు చేయించేందుకు ఒక ప్రయత్నం చేయించాలని భావించారు. ఆ మేరకు సమీరను సోమవారం జరిగే జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు తీసుకొచ్చారు. కలెక్టర్ రాకముందు అక్కడే ఉన్న సంబంధిత అధికారులతో సమస్యను ప్రస్తావిస్తూ 88 శాతం వైకల్యం అని నిర్థారణ అయిన తర్వాత తాత్కాలిక వైకల్య సర్టిఫికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దానికి అధికారులు స్పందిస్తూ ‘అయ్యిందేదో అయిపోయింది.. ఇప్పటికే సుమారు ఏడాది సమయం గడిచింది.. మరో ఏడాది మాత్రమే ఉందని, ఆ తర్వాత శాశ్వత సర్టిఫికెట్ ఇస్తాం’ అంటూ నిర్లిప్తంగా మాట్లాడారు. దీనిపై వారి మధ్య కొంత చర్చ జరిగింది.

కలెక్టర్ అనూహ్య స్పందన

ఇంతలో గ్రీవెన్స్ సెల్‌కు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చేరుకున్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి సమీరను ఆయన వద్దకు తీసుకెళ్లి పరిస్థితిని వివరించి ప్రత్యేక కోటా పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే కలెక్టర్ మరోవిధంగా స్పందించారు. తాత్కాలికంగా కొంత ఆర్థిక భరోసా ఇచ్చే పెన్షన్ కావాలా? శాశ్వతంగా వైకల్యాన్ని రూపుమాపే చికిత్స కావాలా?? అని శ్యాంప్రసాద్‌రెడ్డిని, సమీర కుటుంబ సభ్యులను ప్రశ్నించి వారి స్పందన మేరకు శాశ్వత చికిత్స కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్న వెంటనే ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వైద్యాధికారుల ద్వారా శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్‌లోని క్యాన్సర్ ఆస్పత్రి నిర్వాహకులతో మాట్లాడి బాధిత బాలికను ఆ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు టెస్టులు చేసి సమస్యను నిర్థారించి.. ఎటువంటి చికిత్స చేయాలో నిర్ణయించే పనిలో క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు ఉన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page