top of page

కలెక్టర్‌నే బెత్తం పట్టించిన బది‘లీలలు’!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jul 23, 2025
  • 4 min read

  • జిల్లాలో సీరియల్‌ సాగుతున్న ప్రహసనం

  • ఒకే పోస్టుకు ఇద్దరిద్దరికి పోస్టింగ్‌

  • అప్పటికే ఉద్యోగి ఉన్న పోస్టుకు మరొకరి ట్రాన్స్‌ఫర్‌

  • ఎమ్మెల్యేల సిఫార్సులు బుట్టదాఖలు.. మామూళ్లకే అగ్రాసనం

  • వైద్య, సంక్షేమ, బీసీ, సర్వే శాఖలో భారీ అక్రమాలు

  • వైద్య ఆరోగ్య శాఖపై కలెక్టర్‌ యమ సీరియస్‌

రాజాం మండలం బొద్దాంలో ఒక ఏఎన్‌ఎం పోస్టు ఉంటే ఇద్దరిని అక్కడికి బదిలీ చేశారు. వారిలో విమలకుమార్‌ అనే ఆమె సినియర్‌ కాగా మరో ఏఎన్‌ఎం జూనియర్‌. కానీ జూనియర్‌ ఏఎన్‌ఎం ముందుగా వెళ్లి బొద్దాంలో జాయిన్‌ అయిపోయారు. కొర్లకోటకు చెందిన విమలకుమారి ఆమదలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సిఫార్సు లేఖను తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. ఇదే విషయాన్ని ఆమె డీఎంహెచ్‌వో వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నా.. ఇప్పుడేమీ చేయలేమని తేల్చేశారు. కార్యాలయ సూపరింటెండెంట్‌ భాస్కర్‌ కుమార్‌ మాత్రం అటెండర్‌ దుర్గారావు ద్వారా మూడు జీడిపప్పు ప్యాకెట్లు, రూ.15 వేల తీసుకుని అభయహస్తం ఇచ్చి కూడా ఎగవేశారు. దాంతో ఆమె కలెక్టర్‌ సమక్షంలోనే మొత్తం విషయం బయటపెట్టేశారు.

బదిలీ ప్రక్రియ పూర్తి అయినా జిల్లాలో 34 మంది ఏఎన్‌ఎంలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రిలీవ్‌ చేయలేదు. బదిలీల వివరాలను కూడా హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయలేదు. దాంతో ఏకంగా ప్రభత్వ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. 34 మంది ఏఎన్‌ఎంలు ఏమయ్యారని జిల్లా కలెక్టర్‌ను ఆరా తీశారు. ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ బాధ్యతను ఎవరికి అప్పగించాని ప్రశ్నించారు. తత్ఫలితంగానే కలెక్టర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. డీఎంహెచ్‌వో అధికారులను పిలిపించి చెడుగుడు ఆడేశారు.

ఒక్క ఈ శాఖలోనే కాదు జిల్లాలోని మరికొన్ని శాఖల్లోనూ బదిలీలు అవినీతి అక్రమాలతో ప్రహసనంగా మారాయి.


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ముగిసి నెల రోజులు దాటినా జిల్లాలో మాత్రం తెలుగు సీరియల్‌ మాదిరిగా.. జీడిపాకంలా ఈ తతంగం ఇంకా సాగుతునే ఉంది. ఆయా శాఖల జిల్లా అధికారులు సవ్యంగా లేకపోవడం.. ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సుతో జిల్లా క్యాడర్‌ ఉద్యోగాలు వెలగబెట్టడం వల్ల తలెత్తిన ఉపద్రవమే ఈ బదిలీల జీడిపాకం సీరియల్‌. వైద్య ఆరోగ్యశాఖ, బీసీ సంక్షేమ శాఖ, సోషల్‌ వెల్ఫేర్‌, సర్వే డిపార్ట్‌మెంట్లలో ఎన్ని బదిలీలు చేశారు? ఎక్కడికి చేశారు? ఎవరు విధుల్లో చేరారు? అన్న వివరాలను ఇప్పటికీ ప్రభుత్వానికి సమర్పించలేకపోయారు. దీంతో హోంవర్క్‌ చేయని విద్యార్థికి క్లాసులు అయిపోయిన తర్వాత అదనపు గంటలు కూర్చోబెట్టి రాయించినట్లు స్వయంగా జిల్లా కలెక్టర్‌ దినకర్‌ పుండ్కరే కలెక్టరేట్‌లో గతంలో గ్రీవెన్స్‌ నిర్వహించిన చోట ఈ నాలుగు శాఖల ఉద్యోగులను కూర్చోబెట్టి బదిలీల వివరాలను అప్‌లోడ్‌ చేయించాల్సి వస్తోంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో పాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీ అవకాశం కల్పించింది. దాంతో జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రులు.. స్థానిక నేతలు, ఇతర వర్గాల నుంచి అందిన ఆబ్లిగేషన్‌ మేరకు సిఫార్సు లేఖలిచ్చారు. కానీ పైన పేర్కొన్న డిపార్ట్‌మెంట్లలో ఈ లేఖలను పట్టించుకోలేదు. ఒక ఎమ్మెల్యే రెండు సిఫార్సులిస్తే ఒకటి చేశాం.. మరొకటి చేయలేకపోయామని చెప్పడానికి కూడా మొహమాటపడకుండా సిఫార్సులేఖలను బుట్టదాఖలు చేసేశారు. బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తీసుకున్నవారు తమకు న్యాయం జరగలేదని, రోస్టర్‌ ప్రకారం చేసినా తాము కోరుకున్న ప్రాంతానికి బదిలీ అయ్యేవారమని, ఎమ్మెల్యేలు లేఖలివ్వడం వల్ల మొత్తంగా బలై పోయామంటూ గగ్గోలు పెట్టారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖలో ఏమాత్రం రూల్‌ పొజిషన్‌ను చూడకుండా, ప్రభుత్వ జీవోను పరిశీలించకుండా డబ్బులు దండుకొని బదిలీలు చేసేశారు. తీరా రిలీవింగ్‌ ఆర్డర్‌ తీసుకొని కొత్త పోస్టులో జాయిన్‌ కావడానికి వెళ్తే.. అప్పటికే అదే సీటుకు మరో ఇద్దరికి బదిలీ చేసినట్టు తేలిన ఘటనలు వైద్య ఆరోగ్యశాఖóలో చోటుచేసుకున్నాయి. అంటే లెక్కాపత్రం లేకుండా వేలం పాట ద్వారా సొమ్ము తీసుకొని ఇష్టారాజ్యంగా బదిలీలు చేసేశారన్న మాట. ఇది ఆరోపణ మాత్రమే కాదు. బదిలీలు జరుగుతున్నప్పుడు గ్రేడ్‌`3 ఏఎన్‌ఎంలు నిరసన తెలుపుతూ డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. ఆ తర్వాత జిల్లా ఉద్యోగుల జేఏసీ నాయకుడు హనుమంతు సాయిరామ్‌ను తీసుకొని జిల్లా కలెక్టర్‌ను కలిసి సొమ్ము తీసుకొని బదిలీలు చేశారని, అవి కూడా సవ్యంగా జరగలేదని ఏఎన్‌ఎంలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా వైద్యఆరోగ్యశాఖ అధికారులు తమ తప్పు దిద్దుకోలేదు. తాజాగా ఒక్కో ప్లేస్‌కు ఇద్దరిద్దరికి పోస్టింగ్‌ ఇచ్చారని తేలడంతో చాలామంది జాయినవ్వలేకపోయారు.

ఒకే పోస్టు.. ఇద్దరు ఏఎన్‌ఎంలు

దీంతో కలెక్టర్‌ డీఎంహెచ్‌వో ఆఫీస్‌ కంప్యూటర్‌తో సహా అక్కడి సిబ్బందిని కలెక్టరేట్‌కు రప్పించి ఇంతవరకు బదిలీల జాబితా ఎందుకు అప్‌లోడ్‌ చేయలేదని ప్రశ్నించారు. దీనికి ఎవరి వద్దా సమాధానం లేదు. అదే సమయంలో ఆమదాలవలస మండలం కొర్లకోటకు చెందిన ఏఎన్‌ఎం విమలకుమారి అక్కడికి చేరుకొని జీడిపప్పుతో పాటు రూ.15వేలు ముట్టజెప్పినా తనకు న్యాయం చేయలేదంటూ ఉద్యోగుల ఎదురుగానే కలెక్టర్‌కు చెప్పారు. జీడిపప్పు ఇచ్చిన మాట వాస్తవమే గానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదంటూ దాబాయించిన సిబ్బంది.. కలెక్టర్‌ వెళ్లిపోయిన తర్వాత విమలకుమారికి చెందిన ఫోన్‌ తీసుకొని మీడియాకు చెప్పకుండా అక్కడే కూర్చోబెట్టి న్యాయం చేస్తామంటూ ఆమెతో కాళ్లబేరానికి వచ్చినట్టు తెలిసింది. కాగా కారుణ్య నియామకం కింద 2023లో తులసమ్మ అనే గ్రేడ్‌`3 ఏఎన్‌ఎంకు పోస్టింగ్‌ ఇచ్చారు. ఆర్డర్‌లో ఈమెకు మురపాక కేటాయించినట్టు చూపిస్తునే కంచిలి మండలం మాణిక్యపురానికి డిప్యూటేషన్‌పై పంపించారు. తాజా బదిలీల్లో స్థానం మారడానికి ఆమెకు అవకాశం లేదు. ఎందుకంటే.. విధుల్లో చేరి రెండేళ్లే అయింది. సచివాలయ ఏఎన్‌ఎంలు ఐదేళ్లు దాటితేనే బదిలీకి అర్హత సాధించారు. కానీ ఈమె వచ్చి రెండేళ్లే అయింది. ఆ సంగతి అలా ఉంటే.. ఖాళీ ఉందా? లేదా? అని చూడకుండా ఇటు మాణిక్యపురానికి, అటు మురపాకకు రెండిరటికీ ఇద్దరు ఏఎన్‌ఎంలను బదిలీ చేసేశారు. ఇప్పుడు తులసమ్మకు ఎక్కడికి పోవాలో అర్థం కావడంలేదు. న్యాయంగా తన పోస్టింగ్‌ మురపాకలో అక్కడ ఉంచలేదు. పోనీ డిప్యూటేషన్‌లో ఇన్నాళ్లు ఉన్న మాణిక్యపురంలోనైనా ఉంచారా? అంటే అదీ లేదు. దీంతో తన గోడు వినిపించుకోడానికి బుధవారం ఆమె డీఎంహెచ్‌వోను కలవడానికి వెళ్లారు. అక్కడి అధికారులు తమ తప్పిదాన్ని ఒప్పుకోకుండా తిరిగి తులసమ్మనే దబాయించి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి బదిలీ చేస్తామని.. ఇష్టముంటే ఉద్యోగం చేయమని కష్టమైతే మానేయమని కసురుకోవడంతో ఆ ఒంటరి మహిళ కన్నీటిపర్యంతమైంది. దీనికి సరిగ్గా 24 గంటల ముందే కలెక్టర్‌ దినకర్‌ పుండ్కర్‌ డీఎంహెచ్‌వోతో పాటు బదిలీ బోర్డు మొత్తాన్ని కడిగిపారేసినా వారి తీరు ఏమాత్రం మారలేదు.

విధులకు దూరంగా వార్డెన్లు

సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో అయితే మరీ దారుణం. ఈ శాఖ బదిలీ జాబితాపై కలెక్టర్‌ ఆమోదముద్ర వేసినా ఒక్క వార్డెన్‌ కూడా బదిలీ అయిన స్థానాల్లో డ్యూటీలు చేయకపోవడం గమనార్హం. బదిలీ ప్రాంతాల్లో విధుల్లో చేరినట్లు ఫొటోకు ఓ స్టిల్‌ ఇచ్చి.. ఆ తర్వాత ఎంచక్కా విధులకు వెళ్లడం మానేశారు. నాలుగు రోజులు ఆగితే వాతావరణం చల్లబడుతుందని, అప్పుడు కలెక్టర్‌ కళ్లుగప్పి, మీడియాకు ముడుపులిచ్చి మళ్లీ ఎవరి స్థానంలో వారు సర్దుకోవచ్చన్న ధీమాతో వార్డెన్లంతా దన్నుపెట్టి పడుకున్నారు. రణస్థలం వార్డెన్‌ సుజాతకు ఆమదాలవలస, ఆమదాలవలస వార్డెన్‌ నళినీకుమారికి రణస్థలం బదిలీ అయింది. అలాగే నరసన్నపేటలో పని చేస్తున్న సూర్యప్రభకు టెక్కలి, టెక్కలిలో పని చేస్తున్న విజయలక్ష్మికి సోంపేట, సోంపేటలో పని చేస్తున్న విజయలక్ష్మికి నరసన్నపేటకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. వీరెవరూ ఇప్పటికీ విధుల్లో చేరలేదు. అలాగని ఈ మధ్యే బదిలీ అయి.. మళ్లీ బదిలీవేటు పడినవారా? అంటే.. అదీ కాదు. ఇందులో ఒక్కొక్కరు ఏడు నుంచి తొమ్మిది ఏళ్ల వరకు ఒకే చోట పాతుకుపోయినవారే. ఇప్పుడు స్థాన చలనానికి ఏమాత్రం అంగీకరించడంలేదు.

ఈ చేత్తో బదిలీ.. ఆ చేత్తో డిప్యూటేషన్‌

బీసీ సంక్షేమ శాఖలో బదిలీలను రెండు రకాలుగా క్యాష్‌ చేసుకున్నారు. కోరుకున్న చోటికి బదిలీ చేసినందుకు ఒకసారి సొమ్ము తీసుకోగా, ఇప్పుడు బదిలీ అయిన చోటు నుంచి డిప్యూటేషన్‌ మీద వేరే చోటకు వెళ్లడానికి మళ్లీ సొమ్ములు వసూలు చేసేశారు. డబ్బుల మాయలో పడి నిబంధనలను పూర్తిగా విస్మరించేశారు. ప్రస్తుతానికి నిన్నకాక మొన్న బదిలీ అయిన ఆరుగుర్ని అప్పుడే డిప్యూటేషన్‌ మీద నచ్చిన చోటికి పంపించేశారు. పలాసలో కాలేజ్‌ హాస్టల్‌ వార్డెన్‌గా ఉన్న ఉపేంద్రను రణస్థలం కాలేజ్‌ హాస్టల్‌కు బదిలీ చేశారు. ఆ వెంటనే డిప్యూటేషన్‌ మీద మఠంసరియాపల్లి ప్రీమెట్రిక్‌ హాస్టల్‌కు పంపించారు. దీనికి తోడు రాజపురం ప్రీమెట్రిక్‌ హాస్టల్‌ను అదనంగా ఆయనకే అప్పజెప్పారు. కాలేజీ హాస్టల్‌ వార్డెన్‌గా ఉన్న క్యాడర్‌ ఉద్యోగికి ప్రీమెట్రిక్‌ హాస్టల్‌ బాధ్యతలు అప్పగించడానికి నిబంధనలు ఒప్పుకోవు. కానీ దేవుడిచ్చింది.. పూజారి కోరుకున్నదీ ఒకటే కాబట్టి ఉపేంద్ర డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. కవిటి మండలం పెద్ద కర్రివానిపాలెం బాయ్స్‌ హాస్టల్‌ వార్డెన్‌ ఎం.నారాయణ వెన్నుపూస సమస్యతో బాధపడుతున్నారని, ఆయన భార్యకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నందున రణస్థలం మండలం పాతర్లపల్లి హాస్టల్‌కు అతన్ని బదిలీ చేయాలంటూ ఇచ్ఛాపురం ఎమ్మెల్యే డాక్టర్‌ బెందాళం అశోక్‌ డీబీసీడబ్ల్యూవోకు లేఖ ఇచ్చారు. అలాగే ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ కూడా నారాయణను తన నియోజకవర్గ పరిధి పాతర్లపల్లిలో వార్డెన్‌గా నియమిస్తే తనకెటువంటి అభ్యంతరం లేదని కూడా లేఖ ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఉద్యోగి కోసం లేఖ ఇస్తే డీబీసీడబ్ల్యూవో వాటివైపు కన్నెత్తి చూడలేదు. లేని ఆరోగ్య సమస్యలు చూపించడం పరిపాటేనని సర్దిచెప్పుకుందామంటే.. ఎంఎస్‌ పల్లికి డిప్యూటేషన్‌పై పంపిన ఉపేంద్రకు మాత్రం ఇదే గ్రౌండ్‌ను ప్రామాణికంగా ఎలా తీసుకున్నారన్నదే ప్రశ్న. ఉపేంద్ర తల్లిదండ్రులు కాలం చేసి చాలా కాలమైంది. కానీ ఆయన తన వృద్ధ తల్లిదండ్రులను చూసుకోడానికి డిప్యూటేషన్‌ కావాలంటే మాత్రం డీబీసీడబ్ల్యూవో కళ్లు మూసుకొని సంతకం పెట్టారు. ఇది చాలదని త్వరలోనే ఆయనకు అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టు కట్టబెట్టడానికి బేరం కుదుర్చుకున్నట్టు తెలిసింది. అడిగేవాడు లేడని అక్రమాలు చేసుకుంటూపోయారు. కానీ సిఫార్సు లేఖలిచ్చిన ఎమ్మెల్యేలు మాత్రం కలెక్టర్‌ను అడుగుతున్నారు. తమ లేఖలు కొరగాకుండాపోయాయా? అంటూ నిలదీస్తున్నారు. ఎన్‌ఈఆర్‌, బెందాళం అశోక్‌ లాంటి ఎమ్మెల్యేలు ఫోన్‌లో కలెక్టర్‌ను ప్రశ్నిస్తుంటే.. శ్రీకాకుళం ఎమ్మెల్యే ఏకంగా జేసీ, కలెక్టర్లతో తామెందుకున్నామంటూ గొడవపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఇటీవల గొండు శంకర్‌ బదిలీలపై సమీక్షించారు కూడా. ఇక సర్వే డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి గతంలో పని చేసిన అధికారులు ఒకేచోట ఇద్దరు ముగ్గురికి బదిలీలు చేయడం, బదిలీ అయిన కొద్ది రోజులకే మళ్లీ కోరుకున్న చోటకు బదిలీ చేయడం వల్ల ఎవరు బదిలీకి అర్హులు? ఎవరి టెన్యూర్‌ ఐదేళ్లు పూర్తయింది? వంటి లెక్కలు తేల్చడానికే వీరికి కాలమంతా గడిచిపోతుంది. ఇప్పటికీ అర్హుల జాబితా ఇక్కడ తయారవలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page