top of page

కలిసి ఉంటేనే కలిమి కలిగేదేమో!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 10, 2025
  • 3 min read
  • నాటి భారత విభజనపై పాక్‌ యువత ఆగ్రహం

  • అస్థిర రాజకీయ, ఆర్థిక విధానాలతో దేశం నాశనం

  • భారత్‌ ఎదుగుతుంటే.. మేం తిరోగిస్తున్నామని ఆవేదన

  • పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగ్లా పరిణామాలే పునరావృతం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

‘దేశ విభజన జరగకుండా ఉంటే.. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో భాగంగా ఉండేవారం.. అభివృద్ధి ఫలాలు అందుకోగలిగేవారం. మా పూర్వీకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, చర్యలు ఇప్పుడు మా భవిష్యత్తును బలి తీసుకుంటున్నాయి’..

..ఇదీ మన దాయాది పాకిస్తాన్‌కు చెందిన జెన్‌ జెడ్‌ అంటే యువతరం మథనపడుతున్న తీరు.. బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు.. ఆ దేశ ప్రజల్లో పెరుగుతున్న నిరాశా నిస్పృహలకు దర్పణం పడుతున్నాయి. స్థిరత్వం లేని ప్రభుత్వాలు, తరచూ జరుగుతున్న సైనిక, రాజకీయ సంఘర్షణలు, ముందుచూపు లేని ఆర్థిక విధానాలు పాకిస్తాన్‌ను అప్పుల ఊబిలో ముంచేసి పాతాళానికి నెట్టేశాయి. ఉపాధి అవకాశాలు మృగ్యమై లక్షలాది యువత భవిష్యత్తుపై బెంగతో తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు. ఆ అసంతృప్తే అశాంతిగా మారి జాతీయ ప్రభుత్వంపై తిరుగుబాటు రూపం సంతరించుకుంది. ఆమధ్య పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో చెలరేగిన విద్యావ్యవస్థలో లోపాలపై నిరసనల పేరుతో మొగ్గ తొడిగిన ఉద్యమం దేశం మొత్తానికి పాకుతోంది. పీవోకేలోని ముజఫరాబాద్‌ విశ్వవిద్యాలయంలో తొలుత ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా విద్యార్థులు గళమెత్తారు. ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్‌, పీవోకే ప్రభుత్వం ప్రయత్నించడంతో యువత మరింత ఆగ్రహానికి గురై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వేలాది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన జ్వాలలు రేపారు. దేశంలో శాంతిభద్రతల సమస్యగా మారిన యువత అసంతృప్తికి కారణాలు ఒకేసారి స్వాతంత్య్రం పొందిన రెండు దేశాల్లో భారత్‌ ప్రజాస్వామ్య పంథాలు దూసుకుపోయి అద్భుత ప్రగతి సాధిస్తే.. పాకిస్తాన్‌ మాత్రం సైనిక కుట్రలు, రాజకీయ అస్థిరత, అపసవ్యమైన విధానాల వల్ల బాగా వెనుకబడిపోవడం యువతరం పాలిట అశనిపాతంగా మారింది.

మెరుగైన స్థితి నుంచి పాతాళానికి

బ్రిటీష్‌ వలస పాలన నుంచి విముక్తి పొందడానికి కాస్త ముందే బ్రిటీష్‌ పాలకులు, మహమ్మదాలి జిన్నా వంటి కొందరు నేతల కారణంగా సమైక్య భారతదేశం విభజనకు గురైంది. ఆ సమయంలో భారత్‌ కంటే పాకిస్తాన్‌ ఆర్థిక పరిస్థితే మెరుగ్గా ఉండేది. జనాభా కూడా భారత్‌ కంటే చాలా తక్కువే. దానివల్ల 1960 ప్రాంతంలో భారత్‌ తలసరి జీడీపీ కంటే పాకిస్తాన్‌ తలసరి జీడీపీయే ఎక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత నుంచి పరిస్థితి మారిపోయింది. పాక్‌ అభివృద్ధి తిరోగమిస్తుంటే.. భారత అభివృద్ది పురోగమించడం ప్రారంభించింది. ప్రస్తుతం సగటు భారతీయుడు ఒక పాకిస్తానీ కంటే 70 రెట్లు అధికాదాయం సంపాదిస్తున్నాడు. ఆర్థిక, అభివృద్ధి కొలమానాల్లో భారత్‌ పోలిస్తే పాక్‌ పరిస్థితి చాలా దారుణంగా ఉందని అక్కడి యువతరం భావిస్తోంది. ప్రపంచబ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల సమాచారం కూడా ఈ వ్యత్యాసాలను ధృవీకరిస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2012`2022 మధ్య పదేళ్లలో ఇండియాలో 269 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారు. పాకిస్తాన్‌ మొత్తం జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. అదే సమయంలో పాకిస్తాన్‌లో తీవ్ర పేదరికం స్థాయి 4.9 శాతం నుంచి 16.5 శాతానికి పెరిగింది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. కానీ పాకిస్తాన్‌ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఇండియా కంటే పది రెట్లు తక్కువగా ఉంది. పాకిస్తాన్‌ జనాభా సుమారు 24 కోట్లు కాగా.. అందులో 64 శాతం మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారే. కానీ వీరిలో సుమారు 31 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు. విద్య, ఉపాధి అవకాశాల్లోనే కాదు.. భవిష్యత్తుపైనే నమ్మకం లేకపోవడానికి వ్యవస్థాగత నిర్లక్ష్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థ పతనం

పాకిస్తాన్‌ నిరంతరం యూరప్‌ దేశాల ఆర్థిక సహాయంపై ఆధారపడుతున్న పరిస్థితిని యువజనులు ప్రస్తావిస్తున్నారు. ‘మేం బిచ్చం అడుగుతున్నాం’ అనే వ్యాఖ్యలతో తమ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నిటి విభజన విధానం సరికాదని పలువురు యువ మేథావులు అభిప్రాయపడుతున్నారు. దేశ విభజన వనరులను వృథా చేసిందని, రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచిందని, ఆర్థిక వృద్ధిని అడ్డుకుందని వారు విమర్శిస్తున్నారు. ఉపాధి అవకాశాలు, మెరుగైన భవిష్యత్తును వెతుక్కుంటూ 2022లో సుమారు 1.5 మిలియన్ల పాకిస్తానీయులు దేశాన్ని విడిచిపెట్టారు. ఇది పాక్‌ ప్రభుత్వంపై యువతలో నెలకొన్న అవిశ్వాసాన్ని సూచిస్తోంది. ఈ దుస్థితికి ప్రభుత్వాల లోపభూయిష్ట ఆర్థిక విధానాలు, స్వార్థ రాజకీయాలు, మితిమీరిన అవినీతే కారణమని అంటున్నారు. భారత్‌ సహా పలు ఆసియా దేశాలు యువతలో నైపుణ్యాలను పెంచి ఉపాధి అవకాశాలను పెంచే ప్రణాళికలు అమలు చేస్తుంటే తమ ప్రభుత్వాలు ఈ సవాళ్లపై దృష్టి సారించడంలో విఫలమైందని ఆరోపిస్తున్నారు. యువతరంలో రేగుతున్న ఈ ఆగ్రహం, అశాంతి భవిష్యత్తులో ఒక పెద్ద రాజకీయ, సామాజిక విస్ఫోటనంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. లోపాలను సరిదిద్దుకోవాల్సిన పాక్‌, పీవోకే ప్రభుత్వాలు ఉద్యమాలను బలప్రయోగంతో అణచివేయాలని చూస్తోంది. రిజర్వేషన్ల పేరుతో బంగ్లాదేశ్‌లో మొదలైన విద్యార్థి ఉద్యమం సైనిక, పోలీస్‌ అణచివేతలతో మరింత తీవ్రరూపం దాల్చి ప్రభుత్వ వ్యతిరేకంగా ఉద్యమంగా, తిరుగుబాటుగా మారింది. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు రాజధాని ఢాకా నగరానికి వచ్చి ప్రభుత్వాధినేతల నివాసాలు, కార్యాలయాలు, పార్లమెంటుపై దాడులకు పాల్పడ్డాయి. చివరికి దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం వదిలి పారిపోయి భారత్‌లో రాజకీయ ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్‌ యువతలో నెలకొన్న అశాంతి, ఆగ్రహావేశాలు చూస్తుంటే బంగ్లా పరిణామాలు పాక్‌లో పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page