top of page

కళింగ కోమట్లలో ఎన్నికల కుంపటి!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Aug 6
  • 3 min read
  • మొన్నటి వరకు హరిగోపాల్‌దే బలం

  • అనూహ్యంగా తెరపైకి ఊణ్ణ సర్వేశ్వరరావు

  • నగర అధ్యక్ష పదవి కోసం రసవత్తర పోరు

  • ఎవరికి జైకొట్టాలో అర్థంకాక ఆపసోపాలు

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో కళింగకోమటి సామాజికవర్గ ఓటర్ల సంఖ్య ఎంతనేది ఇప్పటికీ ఇదమిద్ధంగా తెలియదు. అసలు జిల్లా జనాభాలో వీరి శాతం ఎంతనే అంచనా కూడా లేదు. కానీ వెలమ, కాళింగ, కాపు, ఎస్సీ, శ్రీశయన కులాలు మినహా మిగిలిన మైనార్టీలందరికంటే కళింగకోమట్లు ఎక్కువగా ఉంటారనేది ఓ అంచనా. 2024 ఎన్నికలకు ముందు శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ధర్మాన ప్రసాదరావు చేయించిన సర్వేలో ఇదే ప్రతిఫలించింది. అయితే ఇది సాధికారికం కాదు. అయితే మైనార్టీ కులాల్లో కళింగకోమట్ల ప్రాబల్యం ఎక్కువని ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే.. వ్యాపారమే వృత్తిగా ఉన్న ఈ సామాజికవర్గం సోషల్‌ మీడియా పుట్టకముందు నుంచీ ప్రచారం(మౌత్‌టాక్‌)లో టాప్‌. అందుకే ధర్మాన, ఎర్రన్నాయుడు లాంటి రాజకీయ ఉద్ధండులు కూడా కళింగకోమట్లకు సముచిత స్థానం కల్పిస్తూ వచ్చారు. బహుశా అందుకేనేమో జిల్లాలో ఏ సామాజికవర్గ సంఘానికి ఎన్నిక జరిగినా రాని కాంట్రవర్సీ, ప్రచారం ఈ కుల సంఘం విషయంలో ఏర్పడుతుంది. అలాగే దీనికి అధ్యక్షునిగా ఎన్నికైనవారికి కూడా ఆ స్థాయి ప్రోటోకాల్‌ దక్కుతుంది. అందువల్ల ఈ కుల సంఘ పదవులకు పోటీ తీవ్రస్థాయిలోనే ఉంటుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సానుభూతిపరులే జిల్లా, రాష్ట్ర, నగర పార్టీ అధ్యక్షులుగా ఉండాలన్నంత స్థాయిలో ఉంటుంది.

అధికారంలో ఉండే పార్టీ వారిదే పెత్తనం

సాధారణంగా కులసంఘాలకు కాలపరిమితి తప్ప పాలకులతో పనిలేదు. కానీ అధికార పార్టీలో ఉన్నవారే స్థానికంగానూ పదవుల్లో ఉండాలని గత ప్రభుత్వ హయాంలో వైకాపా నేతలే తీర్మానించారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కోణార్క్‌ శ్రీను రాష్ట్ర కళింగకోమటి అధ్యక్షుడిగా ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బోయిన గోవిందరాజులు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు జిల్లా సంఘానికి, శ్రీకాకుళం నగర సంఘానికి కొత్త కార్యవర్గం కావాలి. సరిగ్గా ఇదే ఇప్పుడు కులపెద్దలకు పెద్ద జంరaాటంగా మారింది. ప్రస్తుతం నగర కళింగకోమటి సంఘ అధ్యక్షుడిగా ఉన్న ఊణ్ణ నాగరాజు పదవీకాలం 2026 వరకు ఉంది. కానీ 2024లో కూటమి ప్రభుత్వం రావడం వల్ల గతంలో చేసుకున్న తీర్మానం మేరకు కొద్ది రోజుల క్రితం నాగరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త నగర అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. నగరంలో కళింగకోమట్ల ప్రాబల్యం ఎక్కువ. అలాగని సంఖ్యాపరంగా అందరికంటే వీరు ముందువరుసలో ఉన్నారని కాదు. నలుగురు కోమట్లు ఒకచోట ఉంటే చాలు మిగిలిన సామాజికవర్గాలకు చెందిన పాతిక మందితో సమానమన్న నానుడి ఉంది. ఇంత పట్టున్న నగర అధ్యక్ష పదవి కోసం గత కొన్ని నెలలుగా కళింగకోమట్లు కుస్తీలు పడుతున్నారు. వైకాపా నుంచి ఎటువంటి పోటీ లేకపోవడంతో తెలుగుదేశంలో ఉన్న నేతలే నగర అధ్యక్ష, కార్యదర్శి పదవులు దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఏకాభిప్రాయ సాధనకు పలుమార్లు సమావేశమవుతున్నా కుదరక అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎందుకంటే.. ఎన్నిక ప్రక్రియకు ఇక్కడ అవకాశం లేదు. ఎంతమంది సభ్యులున్నారు? ఎంతమంది ఓటర్లవుతారు? అనే లెక్కలు సాధారణంగా కులసంఘాల వద్ద ఉండవు. కొందరు పెద్దలు ఎవరికి బొట్టు పెడితే వారే అధ్యక్ష, కార్యదర్శి, ట్రెజరర్లు అవుతుంటారు. ఏ కులసంఘంలోనైనా దాదాపు ఇదే తంతు ఉంటుంది. కానీ కళింగకోమటి సంఘం దగ్గరికి వచ్చేసరికి ఎన్నిక తప్ప, ఎంపిక ప్రక్రియ కుదిరేలా కనిపించడం లేదు. శ్రీకాకుళం నగర నడిబొడ్డులో కళింగవైశ్యుల పేరిట ఒక కల్యాణ మండపం, దాని ఖాతాలో లక్షలాది రూపాయల సొమ్ము, అదే స్థాయిలో ఛారిటబుల్‌ ట్రస్ట్‌, దాని అకౌంట్‌లో మరికొంత సొమ్ము ఉండటం వల్ల ఇది డబ్బున్న సంఘం అయ్యింది. అందువల్ల ఈ సంఘానికి డబ్బున్నోళ్లే అధ్యక్ష, కార్యదర్శులు కావాలనే నినాదం ఒకటి తెరమీదకు వచ్చింది. కళింగకోమటి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, కార్తీక వనభోజనాలు, సామూహిక ఉపనయనాలు వంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టే కళింగకోమటి సంఘం జిల్లా, నగర అధ్యక్ష పదవులు ఇప్పుడు ప్రోటోకాల్‌ పోస్టులుగా మారిపోయాయి.

నిన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క

రెండు రోజుల క్రితం వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడు కోరాడ హరిగోపాల్‌, కోరాడ రమేష్‌ల పేర్లు మాత్రమే తెర మీద కనిపించాయి. హరిగోపాల్‌కు నగరంలో అనేక ప్రాంతాల్లో ఉన్న కుల సంఘం పెద్దల మద్దతు ఉందని, రమేష్‌ ఈ మేరకు మనుషులను కూడగట్టాల్సి వస్తుందనే ప్రచారం జరిగింది. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అంధవరపు వరహానరసింహం కుమారుల్లో ఎవరో ఒకరు నగర బాధ్యతలు చేపట్టాలనే ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే కళింగకోమట్లలో ట్రస్ట్‌ ప్రతిష్టాత్మకమైనది కాబట్టి ఆ పదవి తీసుకోమని వరం పెద్దకుమారుడు ప్రసాద్‌ను కోరే అవకాశాలు ఉన్నందున నగర సంఘం అధ్యక్షుడిగా కోరాడ హరిగోపాల్‌, కార్యదర్శిగా కిల్లంశెట్టి రమేష్‌లతో కూడిన బృందం పగ్గాలు చేపడుతుందని, కోరాడ రమేష్‌ను ఏదో రకంగా బుజ్జగిస్తారని ప్రచారం జరిగింది. కానీ అకస్మాత్తుగా కళింగకోమట్లలో ఎవరు చెబితే అన్ని తరాల నాయకులూ తలూపుతారో, ఎవరు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారో, ఎవరికి పార్టీలకు అతీతంగా అందరి అండదండలూ ఉన్నాయో.. అటువంటి ఊణ్ణ సర్వేశ్వరరావు తాను నగర కళింగకోమటి సంఘం అధ్యక్షుడిగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలు పంపారట. రెండు రోజులుగా మార్కెట్‌లో ఇదే టాక్‌. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలో బిజీగా ఉండే సర్వేశ్వరరావు ఇంతవరకు కుల రాజకీయాల్లోకి రాలేదు. ఆయనకు పార్టీల అఫీలియేషన్‌ కూడా లేదు. అప్పటి రెవెన్యూ మంత్రి నుంచి ఇప్పటి వ్యవసాయ శాఖ మంత్రి వరకు అందరితోనూ వ్యాపార రీత్యా ఆయనకు పరిచయాలున్నాయి. గతంలో అనేకమార్లు ధర్మాన ప్రసాదరావు తమ పార్టీలోకి రావాలని సర్వేశ్వరరావును ఆహ్వానించడం, ఆయన కాదనడం కళింగకోమట్లకు తెలుసు. కాకపోతే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా, అప్పటి కళింగకోమటి రాష్ట్ర అధ్యక్షుడు కోణార్క్‌ శ్రీను చేసిన ఓ పని ఇప్పుడు కోరాడ సర్వేశ్వరరావు వైకాపా మనిషి కదా.. అన్న ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు కళింగకోమట్లలో ఎంపిక చేసిన కొన్ని ఇళ్లకు వెళ్లడం, అక్కడ అల్పాహారం తీసుకొని ప్రచారం చేయడం ధర్మానకు ఆనవాయితీ. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రకే పరిమితమైన కళింగకోమట్లకు బీసీ హోదాను రాష్ట్రంలో 24 జిల్లాలకూ వర్తింపజేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఊణ్ణ సర్వేశ్వరరావు ఇంటిలో బ్రేక్‌ఫాస్ట్‌ సందర్భంగా ప్రకటించాలని కోణార్క్‌ శ్రీను చేసిన ప్రతిపాదనను కులం కోణంలో సర్వేశ్వరరావు కాదనలేకపోయారు. ఆ తర్వాత కాలంలో ధర్మాన కూడా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి రావడంతో సర్వేశ్వరరావు సహాయ సహకారాలు తీసుకున్నారు కాబట్టి ఆయన వైకాపా మనిషేనని ఇప్పుడు కళింగకోమట్లలోని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అయితే సర్వేశ్వరరావుకు ఎక్కడా సభ్యత్వం లేదు.

ధర్మసంకటంలో పెద్దలు

పెద్దమార్కెట్‌ వర్తక సంఘం నేతగా కోరాడ హరిగోపాల్‌ అనేకమార్లు సమర్ధవంతంగా పని చేశారని రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో పెద్దమార్కెట్‌కు బహునాయకత్వాన్ని వైకాపా నేతలు ఇచ్చిన తర్వాత అంతకు ముందు పని చేసిన హరిగోపాల్‌ ఎంత సమర్ధుడో వర్తకులకు అర్థమైంది. నగర కళింగకోమటి సంఘంలో యాక్టివ్‌గా ఉన్న సభ్యులు కూడా వర్తకులే. కాబట్టి హరిగోపాల్‌ ఎన్నిక లాంఛనమేనని అంతా భావించారు. వరం చిన్నకొడుకు అంధవరపు సంతోష్‌ కూడా తెర వెనుక హరిగోపాల్‌కే మద్దతు ఇస్తున్నారని తేలడంతో ఈ నెల 17న జరిగే సమావేశంలో హరిగోపాల్‌ పేరును ప్రతిపాదిస్తే పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని భావించారు. అనూహ్యంగా ఇప్పుడు ఊణ్ణ సర్వేశ్వరరావు కూడా బరిలో ఉండటం వల్ల కళింగకోమటి పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. స్వయంగా సర్వేశ్వరరావే తాను అధ్యక్షుడు కావాలనుకుంటున్నానంటే వద్దనడం అంత సులువు కాదని కళింగకోమటి పెద్దలకు తెలుసు. ఎందుకంటే.. ఈ సామాజికవర్గంలో ఎటువంటి కుటుంబ కలహాలు ఉన్నా, వ్యాపార భాగస్వాముల మధ్య తేడాలు వచ్చినా పంచాయితీ తేల్చేది సర్వేశ్వరరావే. ఇప్పుడు ఆయన్ను ఎదురుగా పెట్టుకొని ఎన్నికా? ఎంపికా? అంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. జిల్లా సంఘం అధ్యక్షుడి ఎన్నిక విషయంలోనూ ఇంతకుముందే పితలాటకమే ఎదురైంది. ఇప్పుడు నగర సంఘ అధ్యక్షుడి ఎన్నికలో కూడా కీలక మలుపు చోటుచేసుకుంది. పార్టీలుగా వేరైనా సామాజికవర్గపరంగా ఒక్కటిగా ఉన్న సీనియర్లు ఇప్పుడు ఈ గడ్డు పరిస్థితిని ఎలా ఒడ్డెక్కిస్తారో చూడాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page