top of page

కళింగ ప్రాభవ ప్రతీక.. బాలియాత్ర

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 17, 2025
  • 4 min read
  • ఒకనాటి కళింగ మహాసామ్రాజ్యంలో విలసిల్లిన సంప్రదాయం

  • కాలక్రమంలో రాజ్యంతోపాటు మరుగున పడిన ఆచారం

  • మూడు దశాబ్దాల క్రితం కటక్‌లో పునఃప్రారంభం

  • గత ఏడాది నుంచి శ్రీముఖలింగ క్షేత్రంలో నిర్వహణ

  • ఈ ఏడాది నవంబర్‌ 9న యాత్రకు సన్నాహాలు

ప్రపంచంలోనే అతిగొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన దేశం మనది. భిన్నమతాలు ఉన్నా.. అన్నింటినీ సమానంగా గౌరవించే గొప్ప వారసత్వం మనది. ఈ క్రమంలో మతాలు, ప్రాంతాలు, జాతుల వారీగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉత్సవాలు, యాత్రలు, పండుగలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని సనాతన కాలం నుంచీ కొనసాగుతూ వస్తున్నా.. చాలావరకు కాలగర్భంలో కలిసిపోవడంతో జనం మర్చిపోయారు. ఇంకొన్నింటిని చరిత్ర పుటల నుంచి బయటకు తీసుకొచ్చి వాటికి పునర్‌వైభవం కల్పించడానికి చాలాచోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రయత్నాల ఫలితంగా వేల సంవత్సరాల క్రితం కళింగ సామ్రాజ్య సంప్రదాయంగా విలసిల్లిన ఒక యాత్ర ఏడాది క్రితం మళ్లీ పురుడు పోసుకుంది. దాన్నే బాలియాత్ర లేదా బలియాత్ర అంటారు. ఒడిశాలో దాదాపు మూడు దశాబ్దాల క్రితమై పున:ప్రారంభమైన ఈ సాంస్కృతిక పండుగను మన శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీముఖలింగంలో వరుసగా రెండో ఏడాది నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒడిశాకు చెందిన ఈ యాత్రను ఆంధ్ర ప్రాంతంలో నిర్వహించడం ఏమిటి? అసలు బాలియాత్ర అంటే ఏమిటి?? కళింగులకు, ఒకనాటి కళింగ రాజ్యానికి, ఇప్పటి ఆంధ్ర ప్రాంతాలకు దీనితో ఉన్న సంబంధం ఏమిటి??? వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సిందే.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంస్థానాల విలీనం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల మన దేశం ప్రస్తుత భౌగోళిక, నైసర్గిక స్వరూపం సంతరించుకుంది. కానీ పూర్వకాలం అఖండ భారతదేశం అనేక రాజ్యాలు, సంస్థానాలతో చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి ఉండేది. ఎన్నో గొప్ప సామ్రాజ్యాలు దేశంలోని ఆయా ప్రాంతాలను పాలించి తమదైన ప్రత్యేక ముద్ర వేశాయి. అటువంటి వాటిలో పేరెన్నికగన్నది కళింగ సామ్రాజ్యం. వేల సంవత్సరాల క్రితమే పరిఢవిల్లిన ఈ సామ్రాజ్యం అటు కటక్‌ నుంచి ఇటు రాజమహేంద్రవరం వరకు విస్తరించి ఉండేది. అంటే తూర్పున మహానది నుంచి దక్షిణాన గోదావరి వరకు ఉన్న ప్రాంతాలు కళింగ సామ్రాజ్యంగా ఉండేవన్నమాట. కళింగరాజ్య ఆనవాళ్ల గురించి పక్కాగా ఎక్కడ లేకపోయినా మహాభారతంలో ఉన్న ఒక కథ ప్రకారం వాలి అనే రాజు, సేధేష్ణాదేవి దంపతులకు దర్ఘతమనుడు అనే ముని వరప్రసాదం వల్ల పుండ్ర, సుష్మ, కళింగ తదితర ఐదుగురు కుమారులు జన్మించారు. వారిలో మధ్యముడైన కళింగుడు పరిపాలించిన రాజ్యం కనుక ఈ సామ్రాజ్యానికి కళింగ రాజ్యమని పేరు వచ్చిందంటారు. ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కళింగులుగానే వ్యవహరించేవారు. కానీ ప్రస్తుతం కళింగ పేరుతో ఒక కులం ఉంది. వారినే కళింగులుగా భావిస్తున్నారు. అది కరెక్టు కాదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక ఒడియా భాషలో ‘వ’ అక్షరం పలకదు. ఆ ఆక్షరాన్ని ‘బ’ అని ఉచ్ఛరిస్తారు. ఆ విధంగా కళింగ రాజ్య మొదటి రాజుగా భావిస్తున్న వాలి పేరు కళింగుల నోళ్లలో పడి బలి లేదా బాలిగా మారిపోయిందని అంటారు. ఆ బలి రాజు వారసులైన కళింగులు చేస్తున్న యాత్రనే బాలియాత్రగా చెబుతున్నారు. దీన్ని నాటి కళింగ సామ్రాజ్య వారసత్వ సంప్రదాయంగా పరిగణిస్తున్నారు. పితృతర్పణ క్రతువుగా దీన్ని పరిగణిస్తున్నారు.

బాలియాత్ర అంటే ఏమిటి?

ఒడిశాలో దీన్ని బలియాత్ర, బలిజత్రా, బొయితా బంధన్‌ అని పలు పేర్లతో పిలిచినప్పటికీ బాలియాత్రగానే ఇది ప్రసిద్ధి చెందింది. ఈ యాత్ర ఉద్దేశం ఏమిటి, ఎలా.. ఎప్పుడు మొదలైందన్న దానికి చరిత్రలో స్పష్టమైన ఆధారాలు లేకపోయినా.. భిన్న కథనాలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం.. ఖారవేలుడు చక్రవర్తిగా ఉన్న సమయంలో కళింగ సామ్రాజ్యం బలవంతమైనదిగా, పటిష్టమైనదిగా పేరొందింది. ఆ సమయంలో మగధ రాజ్యాన్ని పాలిస్తున్న మౌర్య వంశ చక్రవర్తులు కళింగ రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే అశోకుడు మగధ చక్రవర్తి అయిన తర్వాత మళ్లీ కళింగ దేశంపై దండెత్తాడు. దాంతో క్రీ.పూ. 261లో మగధ, కళింగ సేనల మధ్య జరిగిన భీకర యుద్ధమే కళింగ యుద్ధంగా చరిత్రకెక్కింది. ఆ మహాయుద్ధంలో మొదట అశోకుడు గెలవలేదు. కళింగ సేనల ధాటికి తట్టుకోలేక వెనుదిరిగి అదను కోసం వేచి చూశాడు. యుద్ధం ముగిసిందన్న భావనతో కళింగ వీరులంతా వెనుదిరిగి కార్తీక పౌర్ణమి రోజున తమ పూర్వీకుల ఆచారమైన బాలియాత్రకు వెళ్లారు. ఇదే అదనుగా ఆశోకుడి సేనలు కళింగపై మళ్లీ దండెత్తాయి. ఈ యుద్ధంలో సుమారు లక్ష మంది కళింగ సైనికులు, ప్రజలు మరణించగా, దాదాపు అంతే సంఖ్యలో మగధ సేనలకు నష్టం వాటిల్లింది. ఆ విధంగా కళింగ యుద్ధంతో బాలియాత్రకు చారిత్రక సంబంధం ఉందంటారు.

మరో కథనం ప్రకారం..

పురాతన భారత ఉపఖండంలో కళింగ సామ్రాజ్యంలో ప్రజలు వ్యవసాయం, నౌకా నిర్మాణంతోపాటు, నౌకాయానం, సముద్ర మార్గంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేయడంలో సిద్ధహస్తులుగా పేరొందారు. సముద్ర యానం గురించి ప్రపంచానికి పెద్దగా తెలియని రోజుల్లోనే సొంతంగా నౌకలు నిర్మించి, వాటిలోనే అనేక ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసేవారు. అప్పటి కళింగ సామ్రాజ్య రాజధాని అయిన శ్రీముఖలింగ క్షేత్రం వద్ద వంశధార నదిలో తమ నావలపై బియ్యం, సుగంధ ద్రవ్యాలు, ఏనుగు దంతాలు, ఇతర వస్తుసామగ్రిని ఎక్కించుకుని సముద్ర మార్గంలో ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి మొదట చేరుకున్నారు. తర్వాత అక్కడి నుంచి ఆగ్నేయాసియా దేశాలైన సుమిత్ర, మలయా(మలేషియా), జావా, సింగపూర్‌, సిలోన్‌(శ్రీలంక) తదితర దేశాల్లో వర్తకం చేసి తిరిగి శివరాత్రి నాటికి స్వస్థలానికి చేరుకునేవారు. అలా వారు వ్యాపారం కోసం మొదట వెళ్లిన ద్వీపం పేరు కూడా కళింగ రాజు ‘బలి’ పేరుతోనే బాలిగా స్థిరపడిరదని చరిత్ర ద్వారా తెలుస్తోంది. బాలి ద్వీపంలో కళింగ పేరుకు దగ్గరగా ఉండే కెలింగ్‌ అనే ఆదిమ జాతి జీవనం సాగిస్తోంది. కాగా సముద్ర యానం ఒక సాహస యాత్ర. ఎప్పుడు ఎలాంటి విపత్తు ఎదురవుతుందో తెలియదు. సముద్ర జీవుల దాడులు, తుపానుల వల్ల ప్రయాణంలోనే ఎంతోమంది కళింగ నావికులు మృత్యువాత పడేవారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సముద్రతీర దేశాల్లో వ్యాపారానికి వెళ్లే తమ కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబాల్లోని మహిళలు ఏటా కార్తీక పౌర్ణమి రోజున వంశధార తీరం పొడవునా దీపాలతో దీపోత్సవం, తెప్పోత్సవాలు నిర్వహించేవారు. సుమారు ఐదువేల ఏళ్లకు క్రితం నుంచే ఈ సంప్రదాయం ఉందంటారు. ఇలా చేయడం వల్ల ఇప్పుడు మృతి చెందినవారితోపాటు పూర్వీకుల ఆత్మలు శాంతించి, వారి ఆశ్వీర్వాదం లభిస్తుందన్నది కళింగుల నమ్మకం.

1992లో కటక్‌లో పునఃప్రారంభం

కళింగ రాజ్య విస్తరణ జరిగిన క్రమంలో రాజధానిని శ్రీముఖలింగం నుంచి ధాన్య కటకానికి(కటక్‌) మార్చిన తర్వాత కొన్నేళ్లు పర్లాకిమిడి గజపతి రాజులు పాలించారు. అయినా నిరాఘాటంగా కొనసాగిన బాలియాత్ర బిట్రీష్‌ కాలంలో చోటుచేసుకున్న పరిణామాల కారణంగా నిలిచిపోయింది. కాగా ఒక ముని శాపం వల్ల కళింగులు తమ వైభవం కోల్పోయి, తమలో తామే కొట్టుకుని బలహీనపడి ప్రాభవం కోల్పోయారని చైనా యాత్రికుడు హుయన్‌ త్సాంగ్‌ రాసిన పుస్తకం ద్వారా తెలుస్తోంది. అయితే సుదీర్ఘకాలంగా తెరమరుగైన ఈ సంప్రదాయాన్ని నాటి కళింగ సామ్రాజ్య రాజధాని, ఇప్పటి ఒడిశా పాత రాజధాని అయిన కటక్‌ ప్రజలు మళ్లీ వెలుగులోకి తెచ్చారు. సుమారు మూడు దశాబ్దాల క్రితం 1992లో ఆనాటి ఒడిశా ముఖ్యమంత్రి దివంగత బిజూ పట్నాయక్‌ ఆధునిక బాలియాత్రను ప్రారంభించారు. కరోనా కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో బ్రేక్‌ పడినా, ఆ తర్వాత మళ్లీ యధావిధిగా చేస్తున్నారు. ఆ ఉత్సవంలో భాగంగా మహానదితోపాటు అందుబాటులో ఉన్న చెరువులు, కాలువలు, ఇతర నీటి వనరుల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో పూర్వీకులకు తర్పణాలు విడిచి అరటి డొప్పలు, చిన్న చిన్న కాగితపు పడవల్లో కార్తీక పౌర్ణమి రాత్రి దీపాలు వదలుతున్నారు. కార్తీక పౌర్ణమి నుంచి ప్రథమ అష్టమి వరకు తొమ్మిది రోజులపాటు జరిగే ఈ యాత్రలో భాగంగా భారీ వాణిజ్య ప్రదర్శన (ట్రెడ్‌ ఫెయిర్‌) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అసియాలో అతిపెద్ద ప్రదర్శనగా దీనికి పేరుంది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వమే బాలియాత్రను అధికారికంగా నిర్వహిస్తోంది.

గత ఏడాది నుంచి శ్రీముఖలింగంలో..

ఒకప్పటి కళింగ సామ్రాజ్యానికి తొలి రాజధానిగా విలసిల్లిన మన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగంలోనూ గత ఏడాది నుంచి బాలియాత్ర జరపడం ప్రారంభించారు. కటక్‌ స్ఫూర్తితో మొదలైన ఈ యాత్రను ఇక్కడ మూడు రోజులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది కార్తీక పౌర్ణమి తిథి అయిన నవంబర్‌ తొమ్మిదో తేదీన బాలియాత్రను ఘనంగా జరపాలని నిర్వాహక కమిటీ ఇటీవల జరిపిన సమావేశంలో నిర్ణయించింది. ఇది ప్రధానంగా మహిళల పండుగ. ఆ రోజే సన్నిగొడ్డను మహిళలు వీధిలో పెట్టి కార్తీక నోము నోస్తారు. సన్ని అనేది భార్య, గొడ్డ అనేది భర్తగా భావిస్తారు. వ్యాపారానికి సముద్రంపైకి వెళ్లిన తమ భర్తలు క్షేమంగా తిరిగి రావాలని, తాము సుమంగళిగా ఉండాలని కోరుకుంటూ ఈ నోము చేస్తారు. బాలియాత్రలోనూ పాల్గొంటారు. ఈ ఏడాది కూడా దీన్ని సంప్రదాయబద్ధంగా, ఘనంగా నిర్వహించి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుందామని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page