కళ్లూ.. కన్నీళ్లూ..!
- Guest Writer
- Dec 27, 2025
- 2 min read

చిల్లర ఆటలు అడి గెలిచిన బిగ్‌బాస్ విజేత ఎవరో తెలుసుకోవడానికి చూపిన ఆసక్తి, ప్రపంచ వేదిక మీద హర్డిల్స్ అనే పెరిగెత్తుతూ అడ్డంగా నిలబెట్టిన మంచెని ఎగిరి దాటుకుంటూ బంగారు పతకం గెలిచిన విజేత ఎవరో తెలుసుకోవడానికి మనం చూపించలేదు. బిగ్‌బాస్ విజేత బ్యాక్‌గ్రౌండ్ గురించి వాకబు చేసినంతగా మనం ఈ దేశానికి వన్నె తెచ్చిన వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపలేదు. బిగ్‌బాస్ విజేతని అభినందించడంలో పోటీపడిన జనం, కోలాహలం, పత్రికల్లో, మీడియాలో ఈ అథ్లెట్ గురించి కనీసం కనిపించలేదు. ఆ అథ్లెట్ పేరు జ్యోతి ఎర్రాజి.
జ్యోతి.. జపాన్ అథ్లెట్ యుమీతనాక, చైనా అథ్లెట్ యన్నీవూలను వెనక్కి నెట్టి దక్షిణ కొరియాలో జరుగుతోన్న 2025 ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్ షిప్‌లో 12.96 సెకెన్ల టైమింగ్‌తో 100 మీటర్ల బంగారు పతకం సాధించింది. ఆ అమ్మాయేమీ అథ్లెటిక్స్‌కి కొత్తకాదు.. నిజానికి 2023లో కూడా ఆమె బంగారుపతకం సాధించింది. నిన్న నెలకొల్పిన రికార్డుకన్నా మెరుగైన రికార్డుతో (12.78సె.) ఆమె ఇప్పటికే భారతీయ అత్యుత్తమ హర్డిల్ అథ్లెట్. క్రికెట్లో రంజీప్లేయర్ పేర్లు కూడా తెలిసిన మనకు, ఎక్కడో ఇటలీలోని ఫుట్‌బాల్ ప్లేయర్‌కి కోట్లు ఖర్చుపెట్టి చూడడానికి రప్పించుకునే మనకి, ముఖ్యంగా కులాన్ని చూసి ఆటగాళ్లకి కీర్తిని ఆపాదించే మనకి జాతిని వెలిగించిన జ్యోతి కూడా కంటికి ఆనకపోవడంలో వింతలేదు. ప్రభుత్వాలు గజం స్థలం కూడా ఇవ్వవు.
జ్యోతి కింది కులంలో పుట్టింది విశాఖపట్నం జిల్లాలో. తండ్రి ఒక ప్రైవేటు సెక్యూరిటీ గార్డు, తల్లి ఆసుపత్రిలో ఆయా. ఆ మొత్తం రూ.18వేల ఇంటి ఆదాయంతో వారి జీవితం గడుస్తోంది. ప్రభుత్వ స్కూల్లో చదివేటప్పుడు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఆమెలోని ప్రతిభని గుర్తించి ప్రోత్సహించాడు. దీంతో జ్యోతి మట్టి రోడ్ల మీద ఉత్తి కాళ్లతో పరుగులు మొదలుపెట్టింది. ప్రతిభ చూపడం మొదలుపెట్టాక స్థానికంగా చలించిపోయిన ఒక పెద్దమనిషి బూట్లు కొనిచ్చాడు. అలా కుల, పేదరిక హర్డిల్స్‌ని దాటుకుంటూ పరుగులు పెట్టుకుంటూ జోనల్, రాష్ట్రస్థాయిలో జూనియర్ నుంచి సీనియర్ అథ్లెట్‌గా ఎదగడాన్ని చూసిన ఒక కార్పొరేట్ సంస్థ తన శిబిరంలో చేరమంది.
జ్యోతి గౌండులో హర్డిల్స్‌తో పాటు కష్టాల్నీ, దురదృష్టాల్నీ దాటాల్ని వచ్చింది. ఆమె గాయాలపాలయింది. ఒక దశలో పరుగు సంగతి తర్వాత, అతి చిన్న హర్డిల్‌ని కూడా ఎగరలేకపోయింది అంటాడు. ఆమెని తీర్చిదిద్దిన విదేశీ కోచ్ జేంస్ హిల్లర్. ఒక సమయంలో ఇక కేరీర్ ముగిసిపోయిందనుకున్నా పట్టుదలతో తిరిగి పుంజుకుంది.
ఆమె ఇండియా అత్యుత్తమ హర్డిల్ రికార్డు బద్దలుగొట్టినప్పుడు గాలి వేగం కారణంగా రికార్డు గుర్చించబడలేదు. మరోసారి పోటీల్లో మాన్యుయల్ గన్ శబ్దానికి అలవాటుపడిన ఆమె, ఎలక్ట్రిక్ గన్ శబ్దంతో తికమకపడిపోయి రేస్ అందరితో పాటు కాకుండా, అందరూ ట్రాక్ మీద నుంచి లేచి ముందుకు పరిగెత్తి పోవడాన్ని చూసి పరుగు మొదలుపెట్టి రికార్డు బద్దలు కొట్టింది.
అందాకా ఎందుకు ఇదే ఏషియన్ చాంపియన్ పోటీల్లో రెండేళ్ల క్రితం బంగారు పతకం సంపాదించినప్పుడు వర్షం కారణంగా ఒక్కరూ లేని స్టేడియంలో ప్రతిభ చూపి పతకం అందుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అంతే, అందాక భోరున కురిసిన వర్షం కారణంగా ఖాళీ అయిన స్టేడియంలో బంగారు పతకం గెలిచి విజయంతో చెతులెత్తి నవ్వి చుట్టూ చూసినప్పుడు జనంలేరు, మెడలో బంగారుపతకం ధరించి చుట్టూ చూసినా జనంలేరు. ఉబికివస్తోన్న కన్నీళ్లను అదిమిపెడుతూ, హద్దు దాటుతోన్న వేదనని మినిపంటిమీద నొక్కి పెట్టుకుంటూ ఆ పిల్ల ప్రపంచానికి తాను ఆటలోనే గాదు, జీవితంలోనూ విజేతగా నిలబడినా తనకెదురైన పరిస్థితిని ప్రతిబింబించింది.
- సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్










Comments