కళ్లెదుటే వైకల్యం.. కానరాని కనికరం
- SATYAM DAILY
- Nov 10
- 1 min read
100 శాతం వైకల్యం ఉన్నా ఒక్క ప్రభుత్వ పథకం కూడా దరి చేరలేదు
టీడీపీ కుటుంబానికి చెందినవాడంటూ వైకాపా హయాంలో తొలగింపు
గత నాలుగేళ్లగా పింఛను అందక ఆవేదన వ్యక్తం చేస్తున్న దివ్యాంగుడు
ఆదుకోవాలంటూ అభాగ్యుని వేడుకోలు

(సత్యంన్యూస్, పొందూరు)
పొందూరు మండలం తండ్యాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు మేకా నవీన్ కుమార్ గత నాలుగేళ్లుగా పింఛను అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. కొన్నేళ్లు దివ్యాంగ పింఛను అందుకున్నా తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబం అనే నెపంతో గత ప్రభుత్వం తనను పింఛను జాబితా నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్‌లో వినతి సమర్పించారు. ఎదుటి వ్యక్తి సహాయం లేకుండా ఏ పని చేయలేని తనకు 100 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం ధ్రువీకరణ పత్రం ఉందని, తన పింఛను పునరుద్ధరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడంలేదని ఆ అభాగ్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. హౌస్ మ్యాపింగ్ సర్వేలో చూపించిన ఫించన్ తొలగించామని చెబుతున్నారని, గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లతో పెన్షన్ తీసుకున్న వాళ్లని అనర్హులను తొలగించడం బాగానే ఉందని, ఎదుటి వ్యక్తి సాయంలేనిదే ఏ పనీ చేయలేని తన పింఛను తొలగించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాడు. మండల స్థాయి అధికారి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు సర్టిఫికెట్స్, వినతులు సమర్పించినా ఇప్పటికీ పింఛను రావటం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి తనకు పింఛను పునరుద్ధరించాలని నవీన్ కుమార్ కోరుతున్నాడు.










Comments