top of page

కసాయి భర్తను కడతేర్చిన భార్య

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 24, 2024
  • 2 min read
  • గతంలో తనపై అనుమానంతో వేధింపులు

  • అడ్డుకున్న కొడుకును హతమార్చాడన్న కక్ష

  • బెయిలుపై బయటకొచ్చినా గ్రామానికి వెళ్లని కుప్పయ్య

  • ఏడాది తర్వాత పండుగలకు ఇంటికి వెళ్లి అక్కడే తిష్ట

  • నిద్రలో ఉన్న సమయంలో హరమ్మ చేతిలో హతం

(సత్యంన్యూస్‌, ఎచ్చెర్ల)

కన్నకొడుకును హతమార్చాడన్న కోపం.. గతంలో తననే అనుమానిస్తూ వేధించేవాడన్న కక్ష కలిసి భర్తనే హత్య చేసేందుకు ఓ భార్యను ప్రేరేపించాయి. ఫలితంగా కొండ్ర కుప్పయ్య(55) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. చాన్నాళ్ల తర్వాత ఇంటికి వచ్చిన అతను భార్య చేతిలోనే హతమారిపోవడం విషాదం. ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణానికి సంబంధించి పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. కుప్పిలి గ్రామానికి చెందిన కుప్పయ్య ఆదివారం రాత్రి ఇంటి డాబాపై నిద్రిస్తున్న సమయంలో అతని భార్య హరమ్మ(51) అర్ధరాత్రి సమయంలో కత్తితో అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత నిందితురాలు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ree
ఏడాది క్రితం కొడుకును చంపిన తండ్రి

కుప్పయ్య, హరమ్మలకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె అప్పాయమ్మకు వివాహమై అదే ఊళ్లోని అత్తవారింట్లో ఉంటోంది. కాగా కుప్పయ్యకు భార్య ప్రవర్తనపై గతం నుంచీ అనుమానం ఉండేది. పలుమార్లు ఆ విషయంలో భార్యను నిలదీసి, గొడవలు పెట్టినా సొంత కుటుంబ సభ్యులు, ఊరిపెద్దలు తన భార్య హరమ్మనే సమర్థిస్తూ తనను మందలించడాన్ని తట్టుకోలేకపోయాడు. దాంతో కుటుంబం మొత్తాన్ని అంతం చేయాలనుకున్నాడు. సరిగ్గా ఏడాది క్రితం జూన్‌ 27న అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో కుప్పయ్య సరుగుడు తోటలు నరికే కత్తితో తొలుత పెద్ద కుమారుడు తాతారావుపై దాడి చేసి నరికేశాడు. ఈ అలికిడికి మెలకువ వచ్చిన మిగతా కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఏమాత్రం వెనక్కి తగ్గని కుప్పయ్య రెండో కొడుకు కామరాజుపైనా దాడి చేసి గాయపరిచాడు. దాంతో భయాందోళనతో మిగతావారు కేకలు పెట్టడం, చుట్టుపక్కలవారు పెద్దసంఖ్యలో చేరుకోవడంతో కుప్పయ్య పారిపోయాదు. రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిరోజుల్లోనే అతన్ని అరెస్టు చేసి జైలులో పెట్టారు.

పండుగలకు గ్రామానికి వచ్చి..

కేసు విచారణలో ఉండగానే కుప్పయ్య కొన్ని నెలల క్రితం బెయిల్‌పై విడుదలయ్యాడు. కానీ స్వగ్రామమైన కుప్పిలికి వెళ్లకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా శ్రీకాకుళం నగరంలోని కూలి పనులు చేసుకుంటూ గడపసాగాడు. ఈ తరుణంలో కుప్పిలిలో 16 ఏళ్లకోసారి జరిగే అసిరితల్లి అమ్మవారి పండుగలు మొదలయ్యాయి. ఆ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కుప్పయ్య స్వగ్రామానికి వచ్చి, సొంత ఇంట్లోనే ఉండటం ప్రారంభించాడు. అయితే పండుగలు పూర్తి అయినా కుప్పయ్య ఇంటి నుంచి కదలకపోవడాన్ని భార్య హరమ్మ ప్రశ్నించింది. తాను శ్రీకాకుళం తిరిగి వెళ్లనని, ఇక్కడే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటానని కుప్పయ్య స్పష్టం చేశాడు. కానీ భర్త ఇంట్లో తనతో పాటు ఉండటం హరమ్మకు ఏమాత్రం ఇష్టం లేదు. గతంలో అనుమానాలతో తనను వేధించడం, అభ్యంతరం చెప్పిన కుమారుడిని హతమార్చాడన్న కారణంతో భర్త తమతో కలిసి ఉండటం హరమ్మకు ఇష్టం లేదు. దాంతో అర్ధరాత్రి నిద్రిస్తున్న కుప్పయ్యపై దాడి చేసిన హతమార్చింది. స్వయంగా వచ్చి లొంగిపోయిన హరమ్మ ఇచ్చిన సమాచారం ప్రకారం ఎచ్చెర్ల సీఐ రామచంద్రరావు, ఇతర పోలీస్‌ సిబ్బంది కుప్పిలి గ్రామానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page