top of page

ఖజానాకు మద్యం కిక్‌!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jan 2
  • 2 min read
  • జిల్లాలో రూ.11.10 కోట్ల విలువైన అమ్మకాలు

  • గత ఏడాది కంటే ఎక్కువ వ్యాపారం

  • చివరి నాలుగు రోజుల్లోనే రికార్డు టర్నోవర్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నూతన ఏడాదిని జిల్లా ప్రజలు మద్యం పొంగించి మరీ ఘనంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ జనవరి ఒకటో తేదీకి ముందు నాలుగు రోజులు, ఆ రోజు కూడా జిల్లాలో మద్యం ఏరులైపారింది. ఈ నాలుగైదు రోజుల్లోనే రూ.11.10 కోట్ల మద్యాన్ని తాగేశారని ఎక్సైజ్‌ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం 176 మద్యం షాపులు, 9 బార్లకు బేవరేజెస్‌ డిపోల నుంచి డిసెంబర్‌ తొమ్మిది నుంచి ఈ నెల ఒకటో వరకు రూ.20.27 కోట్ల విలువైన మద్యం సరఫరా చేయగా అందులో రూ.11.10 కోట్ల విలువైన మద్యాన్ని ఈ నాలుగైదు రోజుల్లోనే మందుబాబులు ఖాళీ చేసేశారు.

పెరిగిన అమ్మకాలు

2024 డిసెంబర్‌ 30న రూ.5.13 కోట్లు, 31న రూ.4.28 కోట్లు, 2025 జనవరి ఒకటిన రూ.1.74 కోట్ల విలువైన మద్యం సరఫరా చేశారు. ఆ మూడు రోజుల్లో షాపులకు తరలించిన మద్యం విలువ రూ.11.15 కోట్లు మాత్రమే. కానీ ఈ ఏడాది మద్యం డిపోల నుంచి డిసెంబర్‌ 29న రూ.6.29 కోట్లు, 30న రూ.7.04 కోట్లు, 31న రూ.5.47 కోట్లు, జనవరి ఒకటిన రూ.1.47 కోట్ల విలువైన మద్యం స్టాకును షాపులు, రెస్టారెంట్లకు అందజేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.10 కోట్ల విలువైన మద్యాన్ని అదనంగా సరఫరా చేశారు. ఈ నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో రిటైల్‌ అమ్మకాల వివరాలు పరిశీలిస్తే.. డిసెంబర్‌ 29న రూ.2.30 కోట్లు, 30న రూ.2.45 కోట్లు, 31న రూ.3.75 కోట్లు, జనవరి ఒకటిన రూ.2.60 కోట్ల విలువైన మద్యం, బీరు అమ్ముడయ్యాయి. అదే 2024 లెక్కలు చూస్తే.. ఆ ఏడాది డిసెంబర్‌ 29న 4,493 లిక్కర్‌, 1,127 బీర్లు, 30న 3,722 లిక్కర్‌, 694 బీర్లు, 31న 6,720 లిక్కర్‌ కేసులు, 2,764 బీరు కేసులు విక్రయించారు. 2025 డిసెంబర్‌ 31న 8,267 లిక్కర్‌ కేసులు, 2052 బీరు కేసులు, జనవరి ఒకటిన 8,990 లిక్కర్‌ కేసులు, 2,884 బీరు కేసులు విక్రయించారు. ఈ లెక్కన జిల్లాలో నూతన సంవత్సరాది పేరుతో మద్యం వినియోగం ఎంత పెరిగిందో ఆర్ధం చేసుకోవచ్చు.

టార్గెట్లు ఇచ్చి మరీ..

గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.10 కోట్ల విలువైన అదనపు మద్యం నిల్వలను డిపో నుంచి సరఫరా చేయించుకున్న వ్యాపారులు నాలుగు రోజుల వ్యవధిలోనే కొత్త, పాత స్టాకుతో కలిపి రూ.11.10 కోట్ల మేరకు అమ్మకాలు జరిపారు. డిపో నుంచి అవసరమైన ఇండెంట్‌ను షాపులకు తరలించినప్పుడే ప్రభుత్వానికి 53 శాతం మేరకు అన్ని పన్నులు చెల్లిస్తారు. చెల్లించిన పన్నులతో సహా బాటిల్‌పై గరిష్ట చిల్లర ధరపై 10 శాతం మార్జిన్‌ వేసుకుని విక్రయిస్తుంటారు. మద్యం అమ్మకాల్లో వ్యాపారులకు మిగిలేది ఆ పది శాతం మార్జిన్‌ మాత్రమే. కాగా డిపోల నుంచి షాపుల్లో అమ్మకాలు జరిపిన మద్యానికి సంబంధించి పన్నుల రూపంలోనే ఈ ఏడాది నాలుగు రోజుల్లో సుమారు రూ.11కోట్ల అదాయం ప్రభుత్వానికి సమకూరింది. మద్యం అమ్మకాలతో సంబంధం లేకుండా డిపోల నుంచి షాపులకు మద్యం సరఫరా చేస్తే చాలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. నూతన పాలసీ అమల్లోకి వచ్చిన నాటి నుంచీ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం మద్యం అమ్మకాలకు టార్గెట్‌ విధించి మరీ ఎక్సైజ్‌ శాఖ ద్వారా వ్యాపారులపై ఒత్తిడి తెచ్చి అమ్మకాలు పెంచేలా నిర్దేశించింది. అందులో భాగంగానే మద్యం షాపులు, బార్లకు నూతన సంవత్సరాది సందర్భంగా నాలుగైదు రోజుల్లో పెంచిన టార్గెట్‌ మేరకు రూ.20.27 కోట్ల విలువైన మద్యం తరలించేలా చర్యలు తీసుకుంది. షాపులు, బార్లకు సరఫరా చేసిన మద్యంలో 50 శాతం మాత్రమే విక్రయాలు జరిగాయి. అయితే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది రూ.7కోట్లు మేర వ్యాపారం జరిగితే ఈ ఏడాది రూ.10కోట్లు దాటింది. ఇందులో వ్యాపారులకు వచ్చే ఆదాయం 10 శాతం అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 53 శాతం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page