గంజాయి తరలిస్తూ పట్టుబడిన కర్నాటకవాసి
- SATYAM DAILY
- Nov 25
- 1 min read
పాత నేరస్తుడుగా గుర్తించిన పోలీసులు

(సత్యంన్యూస్, నరసన్నపేట)
20 కిలోల గంజాయిని తరలిస్తూ కర్ణాటకలోని మైసూర్ జిల్లా మండి మొహల్లాకు చెందిన పాత నేరస్తుడు షేక్ రియాజ్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ ఎం.శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వపరాలను వివరించారు. నిందితుడు చెడు వ్యసనాలకు లోనై కుటుంబాన్ని విడిచి ఉడిపి ప్రాంతానికి వెళ్లి అక్కడ ముత్తాప అనే వ్యక్తితో కలిసి 2010లో ఒక వ్యక్తిని హత్య చేసినట్టు తెలిపారు. ఈ కేసులో జైల్లో ఉంటూ గంజాయి, ఇతర కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న వారితో పరిచయం పెంచుకొని జైలులోనే ఒక ఖైదీ హత్య చేసినట్టు తెలిపారు. ఈ కేసులో 2018లో తీర్పు రావడంతో ధార్వాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడని తెలిపారు. శిక్ష అనుభవిస్తున్న షేక్ రియాజ్ అహ్మద్‌ను కుటుంబ సభ్యులు వివాహం చేయడానికి పెరోల్‌కి దరఖాస్తు చేసుకొని బయటకు తీసుకువచ్చారని తెలిపారు. ఈ నెల 5 నుంచి 2026 జనవరి 3 వరకు 60 రోజులు స్థానికంగా ఉన్న కోర్టు పెరోల్ మంజూరు చేసినట్టు విచారణలో తేలిందన్నారు. జైలులో ఉన్నప్పుడు గంజాయి కేసులలో పట్టుబడి జైల్లో ఉన్నవారితో పరిచయం పెంచుకున్న సయ్యద్ వారి ద్వారా ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి దొరుకుతుందని తెలుసుకొని బరంపురానికి చెందిన హిమాన్స్ శేఖర్ మాజిహి సాహు అనే వ్యక్తితో కాంటాక్ట్ అయినట్టు తెలిపారు. కర్ణాటక నుంచి ఇచ్ఛాపురానికి వచ్చిన సయ్యద్ గంజాయిని విక్రయించే హిమాన్స్ సాహు నుంచి ఇచ్ఛాపురంలో 20 కేజీల గంజాయిని రూ.లక్షలు చెల్లించి తీసుకున్నట్టు తెలిపారు. కొనుగోలు చేసిన గంజాయిని జైలులో పరిచయమైన కర్ణాటకలోని హుబ్లీకి చెందిన ముజూమిల్ అక్తర్, తౌషిః అక్రమ్‌కు విక్రయించడానికి తరలిస్తుండగా మడపం టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న నరసన్నపేట ఎస్‌ఐ కె.శేఖరరావుకు పట్టుబడినట్టు తెలిపారు. నిందితుడు సయ్యద్‌ను అరెస్టు చేసి, అతని నుంచి సుమారు 20.860 కిలోల బరువున్న గంజాయి ప్యాకెట్లను, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










Comments