top of page

గంజాయి బ్యాచ్‌పైకి డాగ్‌ స్క్వాడ్‌!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jul 23
  • 1 min read
  • రంగంలోకి దిగిన స్నిప్పర్‌ డాగ్‌

  • ఎస్పీ ఆధ్వర్యంలో నార్కోటిక్స్‌ పోలీసుల తనిఖీలు

  • న్యూకాలనీ ప్రాంతంలో సోదాలు

ree
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాంతాలతో పాటు అనుమానమున్న ఇళ్లు, షాపుల్లో ఇకనుంచి పోలీసులు భౌతిక తనిఖీలకు సిద్ధమయ్యారు. అందువల్ల పోలీసులకు దొరక్కుండా గంజాయి నిల్వలను దాచేస్తే సరిపోతుంది.. అనే భావన గంజాయి అమ్మకందారుల్లో ఉంటే ఇక దానికి తిలోదకాలివ్వాల్సిందే. జిల్లాలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి చొరబడకుండా చూడాలని పోలీసు డిపార్ట్‌మెంట్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. జిల్లాకు రెండు వైపులా ఒడిశా బోర్డర్‌ ఉండటం, అనేక మారుమూల గ్రామీణ మార్గాల నుంచి ఒడిశా-ఆంధ్ర మధ్య రాకపోకలు సాగించే అవకాశాలు ఉండటంతో ఏదో ఒక మార్గం ద్వారా గంజాయి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఇలా ఒడిశా నుంచి వస్తున్న గంజాయి గమ్యస్థానం శ్రీకాకుళమేనని తేలడంతో ఎస్పీ మహేశ్వర్‌ రెడ్డి నేతృత్వంలో నార్కోటిక్స్‌ విభాగం విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. ఇంతవరకు పోలీసులే వచ్చి షాపుల్లోనూ, అనుమానం ఉన్న ఇళ్లలోనూ సోదాలు చేసి, సరుకు దొరికితే కేసు నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు నార్కోటిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో గంజాయి వాసనను పసిగట్టే స్నిప్పర్‌ డాగ్‌ను రంగంలోకి దించారు. గంజాయి వాసన సోకితే చాలే.. ఈ శునకం వ్యక్తిగత సోదాలకు ముందే పోలీసులను సరుకు ఉన్న చోటుకు తీసుకువెళ్తుంది. న్యూకాలనీలో సోమేశ్వరరావు చిన్నపిల్లల ఆస్పత్రి జంక్షన్‌ వద్ద గతంలో బడ్డీలు ఉండేవి. ఇక్కడ రాత్రీపగలు తేడా లేకుండా మద్యం సేవనం జరిగేది. అయితే ఈ బడ్డీల వెనుక భాగంలో ఉన్న స్థలాన్ని కొందరు కొనుగోలు చేయడంతో వాటిని ఖాళీ చేయించారు. అయినా ఆ ప్రాంతం వద్దకు ఇప్పటికీ యువకులు పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. దీంతో ఆ సమీపంలో గంజాయి అమ్ముతున్నారేమోనన్న అనుమానంతో నార్కోటిక్స్‌ విభాగం నుంచి రుషికేష్‌, రాజేష్‌లతో కూడిన బృందం గంజాయిని పసిగట్టే స్నిప్పర్‌ డాగ్‌ను తీసుకొచ్చి న్యూకాలనీలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రాంతంలో కొన్ని బడ్డీలు, ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. సిగరెట్‌లో పొగాకును తీసేసి గంజాయి దట్టించి జేబులో పెట్టుకున్నా స్నిప్పర్‌ డాగ్‌ పసిగట్టేస్తుంది. దీంతో గంజాయి సేవించేవారిని సైతం పట్టుకోడానికి నార్కోటిక్స్‌ పోలీసులు సిద్ధపడుతున్నారు. మరోవైపు గంజాయి సేవించినా, పేకాడుతూ దొరికిపోయినా, చిల్లర కొట్లాటల్లో కోర్టుకు వచ్చినా స్థానిక బెంచ్‌కోర్టు న్యాయమూర్తి కర్రి శివరామకృష్ణ నిర్మొహమాటంగా జైలుశిక్ష వేసేస్తున్నారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు జ్యుడీషియరీ కలిసి పని చేస్తున్నా నగరంలో గంజాయి సేవించి రోడ్ల మీదే తలలు బద్దలుగొట్టుకుంటున్న కేసులు తగ్గడంలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page