గుడి.. అంగన్‌వాడీ.. మధ్యలో మద్యం అంగడి!
- BAGADI NARAYANARAO

- Sep 17, 2025
- 2 min read
నిబంధనలకు విరుద్ధంగా వంద మీటర్లలోపే ఏర్పాటు
గ్రామస్తులు వ్యతిరేకిస్తే రెండు నెలల్లో మార్చేస్తామని హామీ
కానీ ఏడాది అవుతున్నా కదలిక లేని ఎక్సైజ్ అధికారులు
పైగా దానికి అనుబంధంగా అనధికార పర్మిట్ రూము

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గుడి, బడి సమీపంలో, జనావాసాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ జిల్లాలో పలుచోట్ల షాపుల ఏర్పాటులో నిర్వాహకులు గానీ, ఎక్సైజ్ అధికారులు గానీ వాటిని పట్టించుకోవడంలేదు. దాంతో పలుచోట్ల ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామంలో జరుగుతున్న వివాదమే దీనికి నిదర్శనం. తమ గ్రామంలో జనావాసాల మధ్య మద్యం షాపు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి షాపు ఏర్పాటు చేసిన సమయంలోనే గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అయితే ఎక్సైజ్ అధికారులు వారికి నచ్చజెప్పి, రెండు నెలల్లో షాపును అక్కడి నుంచి తరలించేస్తామని హామీ ఇచ్చి షాపును ఏర్పాటు చేయించారు. కానీ ఏడాది కావస్తున్నా దాన్ని తొలగించలేదు. పైగా షాపునకు అనుబంధంగా అనధికారిక పర్మిట్ రూమ్ నిర్వహిస్తున్నారు. ఇదేంటని ఎక్సైజ్ అధికారులను అడిగితే.. షాపువారిని సుతిమొత్తగా హెచ్చరించి సరిపెట్టేస్తున్నారు. వైన్‌షాపు నిర్వాహకుల ఒత్తిడితో ఎక్సైజ్ అధికారులు మద్యం షాపును ప్రభుత్వాస్పత్రికి వెళ్లే మార్గంలో టీటీడీ నిధులతో నిర్వహిస్తున్న వేంకటేశ్వరస్వామి, షిర్డీసాయిబాబా ఆలయాల మధ్యలో అంగన్‌వాడీ కేంద్రానికి సమీపంలో రాష్ట్ర రహదారికి వంద మీటర్ల పరిధిలోపే దీన్ని ఏర్పాటు చేశారు. దానికి ముందు కొలతలు వేసి దేవాలయాలు, అంగన్వాడీ కేంద్రం, ప్రధాన రహదారికి కొలతలు వేసి వంద మీటర్ల అవతలే షాపు ఏర్పాటు చేయనున్నట్లు బిల్డప్ ఇచ్చారు. గ్రామస్తులు వ్యతిరేకించినా పట్టించుకోలేదు. పైగా వంద మీటర్ల ఆవల ఉండాల్సిన మద్యం షాపు 80 మీటర్ల లోపే ఉంది. రెండు నెలల్లో మార్చేస్తామని చెప్పి ఇప్పటికీ కొనసాగిస్తుండటంపై గ్రామస్తులు ఎక్సైజ్ అధికారులను సంప్రదించారు. ఫోన్ యాప్ ద్వారా జీఐఎస్ కొలతలు వేయాలని మార్గదర్శకాలు ఉంటే టేప్‌తో ఎలా కొలతలు వేశారని ప్రశ్నించారు. దీంతో ఫోన్ యాప్ ద్వారా జీఐఎస్ సర్వే చేసి కొలతలు వేశారు. అందులోనూ గతంలో టేప్‌తో కొలతలు వేసిన మాదిరిగానే 90 మీటర్ల లోపే మద్యం దుకాణం ఉన్నట్లు తేలింది. అయినా షాపును మార్చకుండా తాత్సారం చేస్తున్నారు. దీనిపై స్థానికులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించినా ఎక్సైజ్ అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేదు. గడువులోగా ఫిర్యాదుదారులకు ఎండార్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉండడంతో గ్రామస్తులకు మాయమాటలు చెప్పి వారి సంతకాలు సేకరించి సమస్యను పరిష్కరించినట్లు చూపించి గ్రీవెన్స్ ఫిర్యాదును బుట్టదాఖలు చేసేశారు. అయితే ఫిర్యాదుదారులకు సమాచారం ఇవ్వకుండా విచారణ జరిపి అంతా సవ్యంగా ఉందని, తప్పుడు ఫిర్యాదుగా చూపించి క్లోజ్ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గర్భిణుల, బాలింతలకు అసౌర్యం
మద్యం షాపునకు సమీపంలో ఉన్న అంగన్‌వాడీలో 13 మంది చిన్నారులకు చదువు చెప్పడంతోపాటు బాలింతలు, గర్భిణులకు సేవలు అందిస్తున్నారు. మద్యం షాపు వల్ల వారంతా అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులకు దీనిపై విన్నవించినా స్పందించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. మద్యం షాపు పక్క నుంచే గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీకి రాకపోకలు సాగించాల్సి ఉంటుందని, మందుబాబుల కారణంగా అటు వెళ్లడానికి భయపడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఒక వ్యక్తి అంగన్‌వాడీ కేంద్రం వద్దే ప్రమాదానికి గురయ్యాడని, ఈ ఘటనలో అంగన్‌వాడీకి చెందిన చిన్నారులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారని వారు వివరించారు. మరిన్ని ప్రమాదాలు జరగకముందే మద్యం దుకాణాన్ని అక్కడి నుంచి తరలించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని, వారికి ఇబ్బంది కలిగేలా మద్యంషాపు ఏర్పాటు చేశారని, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటున్నారు. జిల్లాస్థాయి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే స్థానిక నాయకుల సహకారంతో ఎక్సైజ్ అధికారులు వాటిని తుంగలోకి తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపు వద్ద కూర్చొని తాగడానికి వీలుగా రూమ్ ఏర్పాటు చేయడంపై ఎక్సైజ్ అధికారులను ప్రశ్నిస్తే సమాధానం దాటవేస్తున్నారని ఆరోపించారు. అనుమతి ఇవ్వడం తమ పరిధిలో లేదని నరసన్నపేట ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్యం షాపును తరలించి గ్రామం బయట ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే ఉద్యమిస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.










Comments