గుణపాఠం నేర్చుకోకపోవడమే పెద్ద విషాదం!
- DV RAMANA

- Oct 1, 2025
- 2 min read

సినీనటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడు రాష్ట్రంలో కరూర్ పట్టణంలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 42 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటంపై రకరకాలుగా చర్చలు జరిగాయి. పత్రికల్లోనూ అనేక కోణాల్లో వార్తాకథనాలు వచ్చాయి. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు టీవీకే పార్టీ అధినేత విజయ్ భారీ నష్టపరిహారం ప్రకటించడాన్ని కొన్ని ప్రసార మాధ్యమాలు గొప్పగా వర్ణిస్తే.. మన రాష్ట్రంతో సహా చాలా ప్రధాన స్రవంతి మీడియా పరిహారం ఇస్తే మాత్రం ‘పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?’ అని ప్రశ్నిస్తూ కథనాలు ప్రచురించాయి. గతంలో ఇదే మాధ్యమాలు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్న సభల్లోనూ, ఆ పార్టీ నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ వంటి కార్యక్రమాల్లోనూ తొక్కిసలాటలు జరిగి మరణాలు సంభవించినప్పుడు మాత్రం ఇటువంటి ప్రశ్నలు సంధించకపోవడానికి కారణం.. అవి అనుసరిస్తున్న రాజకీయ అజెండాలే! దీన్ని ఎవరూ కాదనలేరు. సరే.. ఆ సంగతి పక్కన పెడితే.. రాజకీయ సభలు, ర్యాలీలకు పోటాపోటీగా జనాన్ని తరలించడమే ఇటువంటి తొక్కిసలాటలకు, దుర్ఘటనలకు ఆస్కారమిస్తున్నారన్న విషయాన్నయినా.. సదరు మీడియా ఆయా పార్టీల తలకెక్కేలా కథనాలు ఇచ్చినా బాగుండేది. కానీ ఆ పని చేయకపోగా.. ఇటువంటి వివాదాలు తలెత్తినప్పుడు ఆయా పార్టీలు పరస్పరం చేసుకునే విమర్శలను మాత్రం తమదైన కోణంలో వండివార్చడంలో ముందుంటున్నాయి. కరూర్‌లో 42 మంది చనిపోయిన దుర్ఘటనపై తమిళనాడులో టీవీకే, డీఎంకే, బీజేపీలు పరస్పర ఆరోపణలతో ఒక విషాదాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని అందరికీ అర్థమవుతూనే ఉంది. వీటిని బాగానే కవర్ చేస్తున్న తెలుగు మీడియా మరోవైపు చాలా అమాయకంగా గతంలో చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్, తదితరులు నిర్వహించిన సభలు, ర్యాలీల్లో తొక్కిసలాటలు జరిగి పలువురు చనిపోయిన సంఘటనలను కన్వీనెంట్‌గా విస్మరిస్తోంది. రాజకీయ పార్టీ.. నాయకుడు, సినిమా యాక్టర్, చివరి దేవుడైనా సరే.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ , తాము ఒక్క పిలుపునిస్తే చాలు.. జనం వేలంవెర్రిగా వచ్చిపడిపోతారన్న అహంకారంతో ప్రవర్తిస్తే.. రాజకీయ దర్పం ప్రదర్శిస్తే కరూర్ ఏం ఖర్మ.. దానికి వంద రెట్లు తీవ్రమైన విషాదాలు జరుగుతాయి. ఇంకో విషయం ఏంటంటే.. గతంలో పార్టీలు జనసమీకరణకు ప్రధానంగా బహిరంగ సభలనే మార్గంగా ఎంచుకునేవి. వాటిని నిర్వహించాలంటే వేల, లక్షల జనం పట్టే విశాలమైన మైదానాలు అవసరం, వేదికలు, బారికేడ్లు వంటివి నిర్మించాల్సి వస్తుంది. ఆనక పోలీసు పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్టీరామారావు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రోడ్‌సైడ్, చౌరస్తా మీటింగుల సంస్కృతి మొదలైంది. అదే ఆ తర్వాత కాలంలో రోడ్డుషోలుగా రూపాంతరం చెందింది. వీటికి పర్మిషన్ తప్ప నిర్వహణ ఖర్చుల బాధ ఉండదు. నేతలు తమ వాహనాన్నే వేదికగా చేసుకుని మైక్ పట్టుకుని మాట్లాడే వెసులుబాటు ఉంటుంది. ఇదే తొక్కిసలాటలకు కారణమవుతోందని పోలీసువర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇరుకు మార్గాల్లో ఎటువంటి ఏర్పాట్లు లేకుండానే భారీ జనసమీకరణకు పూనుకోవడం, జనాలు కూడా తమ అభిమాన నాయకుడినో, నటుడినో చూడటానికి విపరీతంగా ఎగబడటమే తొక్కిసలాటలకు, మరణాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో జనం గుమిగూడటానికి కారణమైన పార్టీలను, వాటి అధినేతలను బాధ్యులను చేసి, కఠిన చర్యలు తీసుకోవడంలో మన పోలీసు యంత్రాంగం విఫలమవుతోంది. దాన్నే అలుసుగా తీసుకుంటున్న నాయకులు విషాద ఘటనలను పెద్దగా పట్టించుకోకుండా నాలుగు సానుభూతి వచనాలు పలికి, నష్టపరిహారం పేరుతో కొంత డబ్బు వెదజల్లితే సరిపోతుందన్న ధీమాతో వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన కరూర్ దుర్ఘటన విషయంలోనూ అదే జరుగుతోంది. సభలో పాల్గొని ప్రసంగించిన టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై పోలీసులు ఇంతవరకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం అతన్ని పిలిపించి మాట్లాడనూలేదు. కానీ ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిని మాత్రం అరెస్టు చేశారు. కరూర్ సభాప్రాంగణంలో పదివేల మందే పడతారని, ఆ మేరకు అనుమతి ఇచ్చినా అంతకుమించిన జనాన్ని తరలించారని పోలీసులు అంటున్నారు. కానీ రాజకీయ పార్టీ సభ పెట్టిందింటే.. అందులోనూ ప్రముఖ నటుడి సభ అయితే అడ్డూఅదుపు ఉండదు. దానికి గేట్లు కూడా వేయలేరు. దాన్ని పోలీసులు ముందే గ్రహించి సభకు అనుమతి నిరాకరిస్తూ.. వేరే విశాలమైన ప్రాంగణంలో పెట్టుకోమని కచ్చితంగా చెప్పి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు. కానీ పోలీసులు ఈ విషయంలో విఫలమవుతున్నారు. రాజకీయ పార్టీల విషయంలో ఎందుకొచ్చిన గొడవ అన్నట్లు చూసీచూడనట్లు పోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరూర్ విషాదం మాత్రమే మొదటిది కాదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చివరిదీ కాకపోవచ్చు. రాజకీయాలకు వెరవకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించడంతోపాటు పార్టీలు కూడా జనాన్ని పోగు చేయడమే పరమావధి అన్న దిక్కుమాలిన భావన నుంచి బయటపడితేనే ఫలితం ఉంటుంది.










Comments