గిరిజన తండాలకు మోక్షమెప్పుడో
- SATYAM DAILY
- Nov 10
- 1 min read
3 కిలోమీటర్ల మేర రాళ్లు తేలిన రహదారి
రేషన్ తీసుకోడానికి.. పంట అమ్ముకోడానికి ఈ రోడ్డే గతి
వైద్యం కోసం ఇప్పటికీ తప్పని డోలీమోత
మౌలిక సదుపాయాలందని గిరిజన తండాలు
కన్నెత్తి చూడని నాయకులు, అధికారులు
ఉసిరికపాడు గిరిజనుల గుండెఘోషకు ముగింపు ఎప్పుడు?

(సత్యంన్యూస్, కొత్తూరు)
స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతున్నా ఆ గ్రామానికి రోడ్డు, తాగడానికి నీరు తదితర సదుపాయాలు లేవు. వైద్యం కోసం ఇప్పటికీ డోలీ మోతలు తప్పవు. మూడు కిలోమీటర్ల మేర రాళ్లు తేలిన రహదారి. ఇదీ ఉసిరికపాడు గిరిజన తండా ప్రజల గుండెఘోష.
కొత్తూరు మండల కేంద్రాకి 20 కిలోమీటర్లు, సీతంపేట మండల కేంద్రాకి 23 కిలోమీటర్ల దూరంలో ఉసిరికపాడు అనే తండా ఉంది. గిరిజనుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నా ఇప్పటికీ విద్య, వైద్యం వంటివి అందని తండాలు ఎన్నో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన జనాభా సుమారు 28 లక్షలు. వీళ్లను ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప.. విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఇప్పటికీ అందని గిరిజన తండాలు ఎన్నో. ఒక్క సీతంపేట మండలంలోనే సుమారుగా 18 గ్రామాలు ఉన్నాయి. ప్రతి నెల రేషన్ సరుకుల కోసం పండిన పంటలు అమ్ముకోవడం కోసం రాళ్లు తేలిన రహదారిలోనే వీరి ప్రయాణం. ఇప్పటివరకు ఏ నాయకులు కానీ, ఏ జిల్లాస్థాయి అధికారులు కానీ, మీడియా వ్యవస్థలు గాని ఈ తండాల వైపు కన్నెత్తి చూడకపోవడం కొసమెరుపు. గిరిజనుల జీవన స్థితిగతుల మార్పు కోసం ప్రభుత్వాలు అంకెల గారడే తప్ప.. వాస్తవ రూపంలో వాళ్లకి అందే ఫలాలు ఎంత శాతం? గత ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నక్సల్బరీ ఉద్యమాలకు ఈ ప్రాంతాలే స్థావరం అయి ఉండేవి. నాటి నుంచి నేటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఈ తండాలకు మోక్షం ఎప్పుడో!? ఇకనైనా అధికారులు, నాయకులు ఈ తండాలకు రోడ్లు వేయాలని గిరిజనులు కోరుకుంటున్నారు.










Comments