గుర్తుకొస్తున్నది..70ల నాటి సంక్షోభం!
- DV RAMANA

- 6 days ago
- 2 min read

పశ్చిమాసియాలో నెలరోజులకుపైగా చెలరేగుతున్న యుద్ధజ్వాలలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టే సూచనలు లేశమాత్రంగానైనా కనిపించడంలేదు. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగితే 70 దశకంనాటి చమురు సంక్షోభం.. తద్వారా ఆర్థిక సంక్షోభానికి మించిన దుర్భర పరిస్థితులు దాపురిస్తాయని అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్, అమెరికా`ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలై నెల రోజులు దాటిపోయింది. తన దాడులకు ప్రతిగా అంతర్జాతీయ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో దాదాపు అర్థశతాబ్దం క్రితం నాటి చమురు సంక్షోభాన్ని గుర్తు చేస్తున్నాయి. పరిస్థితులను ఉపశమింపజేయకపోతే అప్పటికంటే తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని నౌకా రవాణా నిపుణుడైన మెర్స్క్ మాజీ డైరెక్టర్ లార్స్ జెన్సన్ వంటివారు హెచ్చరిస్తున్నారు. ‘చరిత్రలోనే అత్యంత పెద్దదైన ఇంధన భద్రతా ముప్పును ప్రపంచం ఎదుర్కోనుంది’ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ‘1970లలో ఎదుర్కొన్న చమురు ధరల పెరుగుదలకంటే ఇది చాలా పెద్దది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత పెరిగిన సహజవాయువు ధర కంటే కూడా ఇది పెద్దది’ అని అంటున్నారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిలో రవాణాపై ఆంక్షలు విధించడంతోపాటు గల్ఫ్ దేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై భీకర దాడులు చేసిన నేపథ్యంలో వాటి రవాణాతోపాటు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. భారత్‌తో సహా చాలా దేశాలు ధరలు పెంచేశాయి. మనదేశంలో దాదాపు పదిహేను రోజుల క్రితమే గహవినియోగ గ్యాస్ ధరను రూ.60, తాజాగా వాణిజ్య సిలెండర్ ధరను రూ.200 వరకు పెంచేశారు. చాలా అసియా, ఐరోపా దేశాల్లో ధరలు దీనికంటే భారీగా పెరిగిపోయాయి. యుద్ధానికి కారణమైన అమెరికాలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో 70ల తరహా సంక్షోభం ముంగిట ప్రపంచం ఇప్పటికే నిలిచిందంటున్నారు. అంతకూ ఆనాడు ఏం జరిగిందంటే.. 1973 అక్టోబర్ 6 నుంచి ఆ నెల 25 వరకు ఇజ్రాయెల్‌తో ఈజిప్ట్, సిరియా తదితర అరబ్ దేశాలకు జరిగిన యోమ్ కిప్పూర్(యూదుల సబ్బత్ దినాన్నే యోమ్ కిప్పూర్ అంటారు. అదే రోజు ప్రారంభమైనందున ఈ యుద్ధాన్ని ఆ పేరుతో వ్యవహరిస్తున్నారు) యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌కు అండగా నిలిచినందుకు అమెరికా కూటమి భాగస్వాములైన దేశాలపై అరబ్ చమురు ఉత్పత్తిదారులు అప్పట్లో నిషేధం విధించారు. దాంతోపాటు చమురు ఉత్పత్తిలో కోతలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా నెలý వ్యవధిలోనే చమురు ధరలు నాలుగురెట్లు పెరిగిపోయాయి. ఇది పలు దేశాల్లో చమురు రేషనింగ్‌కు దారితీయగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ పరిణామాలు ద్రవ్యోల్బణాన్ని అమాంతం పెంచేశాయి. ఫలితంగా వాణిజ్యం తగ్గిపోయింది, నిరుద్యోగం పెరిగింది. అనేక దేశాల్లో సామాజిక నిర్మాణం దెబ్బతిని సమ్మెలు, అశాంతి, పేదరికం పెరిగింది. వేలాది కుటుంబాలకు రోజు గడవటం కష్టంగా మారింది. అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో 1973లో ఏర్పడిన మాంద్యం 1975 వరకు కొనసాగింది. ఈ సంక్షోభం దెబ్బతోనే 1974లో బ్రిటన్‌లో టెడ్ హీత్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు కూడా అంతకంటే తీవ్రమైన గడ్డు పరిస్థితులు తలెత్తవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో గల్ఫ్ దేశాల నుంచి చమురు, సహజవాయువు రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీన్ని పునరుద్ధరించేందుకు యుద్ధనౌకలను పంపి సహకరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడంలేదు. గల్ఫ్ దేశాల నుంచి నెలరోజులకు ముందు బయల్దేరిన చమురులో ఎక్కువ భాగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిఫైనరీలకు చేరుతోంది. దానికి మించి కొత్త సరుకు వచ్చే పరిస్థితి లేదు. అద్భుతం జరిగి రెండు మూడు రోజుల్లోనే హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచినా కూడా చమురు కొరత ఇప్పట్లో తీరే పరిస్థితి లేదు. యుద్ధం ముగిసిన ఏడాది వరకు ప్రపంచం పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం భారీగా చెల్లించాల్సి రావచ్చని అంచనా వేస్తున్నారు. 1970 నాటి పరిస్థితులతో పోల్చి చూస్తే చమురు మార్కెట్ ప్రస్తుతం చాలా భిన్నంగా ఉంది. అప్పటితో పోలిస్తే చమురు వినియోగం కూడా గణనీయంగా తగ్గిందని అరబ్ ఎనర్జీ క్లబ్ ప్రధాన కార్యదర్శి నఖ్లే చెప్పారు. ప్రస్తుతం ముడి చమురు ధర చాలా ఎక్కువగా ఉందని, కానీ ఇప్పటి సంక్షోభం అంత తీవ్రమైనది కాదని ఆమె అన్నారు. ‘ఇప్పుడు మనం చూస్తున్న అంతరాయాలు పెద్దవే కావచ్చు. బహుశా ఇటీవలి చరిత్రలో ఇది అత్యంత భారీదని అనుకోవచ్చు. అయినప్పటికీ 1970లతో పోలిస్తే ఇప్పటి మార్కెట్‌కు కఠిన పరిస్థితులను తట్టుకుని నిలబడే శక్తి ఉందని ఆమె చెప్పారు. ‘ఇది మరింత వైవిధ్యభరితమైనది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైనన్ని నిల్వలు ఉన్నాయని నఖ్లే అన్నారు. అప్పటికీ ఇప్పటికీ మరో మౌలిక వ్యత్యాసం కూడా ఉందంటున్నారు. 1970ల నాటి సంక్షోభం అభివృద్ధి చెందిన దేశాలను లక్ష్యంగా చేసుకుంది. దాన్ని తట్టుకునేందుకు వాటి వద్ద రాజకీయ శక్తి, డబ్బు ఉన్నాయి. దానికి విరుద్ధంగా ప్రస్తుత సంక్షోభం అభివృద్ధి చెందుతున్న దేశాలను కూడా ప్రభావితం చేస్తుంది. వాటి దగ్గర సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తగిన వ్యవస్థలు, నిధులు లేవు. మరో విషయమేమిటంటే.. ఇప్పటిలా 1970లో ఇంధనరంగ మౌలిక వసతులకు ఏమాత్రం నష్టం వాటిల్లలేదు. కానీ ఇప్పుడు ఉత్పత్తి క్షేత్రాలే భారీగా నాశనమయ్యాయి. అయితే మన ఆర్థిక వ్యవస్థలపై అవగాహన పెరగడం, చమురు నిల్వలున్న దేశాల సంఖ్య పెరగడం వల్ల కొంతకాలం పాటు సంక్షోభాన్ని ఎదుర్కొనే వెసులుబాటు లభిస్తుంది. అయితే ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే భవిష్యత్ అంచనాలు తలకిందులవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీటన్నింటికంటే ఈ యుద్ధాన్ని త్వరగా ముగించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే అత్యుత్తమ పరిష్కారం’ అని అంటున్నారు.






Comments