గ్రామీణ బ్యాంకులు బంద్!
- DV RAMANA

- Oct 10, 2025
- 2 min read
ఐదురోజుల తర్వాత కొత్త రూపంలో అందుబాటులోకి
అంతవరకు అన్ని రకాల సేవలు నిలిపివేత
బ్యాంకుల విలీన ప్రక్రియ కోసమే తాత్కాలిక విరామం
13 తర్వాత నుంచి మనుగడలోకి ఏపీ గ్రామీణ బ్యాంకు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
దేశంలో బ్యాంకింగ్ సంస్కరణలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న డజన్లకొద్దీ జాతీయ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా విలీనం చేస్తూ వస్తోంది. అంతిమంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు మరో ఒకటి రెండు బ్యాంకులకు మించి ఉండరాదన్న విధాన నిర్ణయంతో రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో ఈ విలీన ప్రక్రియను కొంతకాలంగా కొనసాగిస్తున్నారు. అదే క్రమంలో వివిధ జాతీయ బ్యాంకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ బ్యాంకులను సైతం ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే విలీన ప్రక్రియను కూడా చేపట్టారు. గతంలో ప్రతి జిల్లాకు లేదా రెండు మూడు జిల్లాలకు ఒక గ్రామీణ బ్యాంకు ఉండేది. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలతోపాటు వ్యవసాయ రుణాలు వంటివి సమకూర్చడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు. గతంలో ఉత్తరాంధ్ర పరిధిలో సేవలు అందించిన విశాఖ గ్రామీణ బ్యాంకు, గోదావరి జిల్లాల్లో గోదావరి బ్యాంకు, రాయలసీమలో అనంత గ్రామీణ బ్యాంకు, సరస్వతి గ్రామీణ బ్యాంకు వంటివి పని చేసేవి. కొన్నేళ్ల క్రితమే వాటిని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుగా మార్చారు. అయినా ఇంకా కొన్ని గ్రామీణ బ్యాంకులు వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిని కూడా విలీనం చేసే చర్యలు తాజాగా ప్రారంభమయ్యాయి. విలీనం, తత్సంబంధిత మార్పులు చేసేందుకు వీలుగా రాష్ట్రంలోని గ్రామీణ బ్యాంకులను ఐదురోజులపాటు మూసివేస్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నాలుగు రూరల్ బ్యాంకులు విలీనమై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పేరుతో ఒకే బ్యాంకుగా అందుబాటులోకి వస్తాయి.
గ్రామీణ బ్యాంకుల ఏకీకరణ
‘ఒకే దేశం.. ఒకే ఆర్‌ఆర్‌బీ’ అన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత బ్యాంకుల విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి ‘ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంకు’ నినాదాన్ని ఆచరణలోకి తేనున్నారు. ఇందులో భాగంగానే మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాలుగు గ్రామీణ బ్యాంకులను విలీనం చేస్తున్నారు. ఇకముందు ఈ బ్యాంకులు మనుగడలో ఉండవు. వాటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఒక్కటే చెలామణీలోకి వస్తుంది. పాత నాలుగు గ్రామీణ బ్యాంకుల ఖాతాదారులందరూ ఇకముందు కొత్త బ్యాంకు ఖాతాదారులుగా మారిపోతారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పేరుతో ఒక సర్క్యులర్ విడుదలైంది. నాలుగు గ్రామీణ బ్యాంకులను సాంకేతికంగా, భౌతికంగా విలీనం చేసే ప్రక్రియ చేపడుతున్నందున ఐదు రోజుల పాటు ఈ బ్యాంకుల సేవలు అందుబాటులో ఉండవని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ(గురువారం) సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ నెల 13 ఉదయం 10 గంటల వరకు ఈ నాలుగు బ్యాంకుల సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. విలీనానికి అవసరమైన కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అనుసంధానం, ఇతర సాంకేతిక, పాలనాపరమైన మార్పులు చేయడానికే బ్యాంకింగ్ సేవలను కొద్దిరోజులు నిలిపాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఖాతాదారులందరికీ వ్యక్తిగత ఎస్సెమ్మెస్‌ల ద్వారా కూడా అలర్ట్ చేశారు. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్, ఏటీఎం, బ్యాంక్ మిత్రల సేవలు కూడా నిలిచిపోయాయి. ఐదు రోజులు సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అక్టోబర్ 11 రెండో శనివారం, 12 ఆదివారం బ్యాంకులకు ఎలాగూ సాధారణ సెలవులే. అయితే సెలవుల్లో ఆన్‌లైన్ సేవలు మాత్రం కొనసాగేవి. కానీ ఇప్పుడు ఆ రెండు రోజుల్లో ఆన్‌లైన్ సేవలు ఉండవు సరికదా.. ఏటీఎంలు కూడా మూతపడ్డాయి. అంటే మొత్తంగా ఐదు రోజుల పాటు గ్రామీణ బ్యాంకుల సేవలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ఈ సమయంలో ఆర్థికపరమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవడం లేదా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే విషయంలో ఖాతాదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని బ్యాంకులు సూచించాయి. బ్యాంకుల విలీనం పూర్తి అయిన తర్వాత మరింత సమర్థవంతంగా, మెరుగ్గా సేవలు అందుతాయని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పేర్కొంది.










Comments