గార రాజకీయాల్లో మరో ‘మార్పు’?
- Prasad Satyam
- Jun 24
- 1 min read
ఎమ్మెల్యే శంకర్‌ను కలిసిన రామారావు కుమార్తె
రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం సూపర్ బజార్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్ లాంటి ఎన్నో పదవులను నిర్వహించిన దివంగత మార్పు రామారావు కుటుంబం నుంచి ఆయన రాజకీయ వారసత్వం అందుకోడానికి మొదటిసారిగా ఆయన కుమార్తె ముందుకొచ్చినట్లు కనిపిస్తుంది. గార మండలాన్ని శాసించిన మార్పు రామారావు తదనంతరం ఆయన సోదరుడు మార్పు ధర్మారావు రాజకీయాల్లోకి వచ్చారు. ధర్మాన ప్రసాదరావు అనుచరుడిగా ఉన్న రామారావు మాదిరిగానే ఆయన సోదరుడు ధర్మారావు కూడా వైకాపా నాయకుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య సుజాత ప్రస్తుత జడ్పీటీసీ కాగా, తనయుడు ఫృధ్వీ సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇంతవరకు మార్పు రామారావు కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో అడుగు పెట్టలేదు. నాలుగు రోజుల క్రితం రామారావు కుమార్తె లావణ్య స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ను కలిశారు. భవిష్యత్తులో తెలుగుదేశం కోసం పనిచేసే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇంతవరకు విదేశాల్లో ఉన్న లావణ్య కొన్నేళ్ల క్రితం నాతవలస వద్ద ఓ స్టార్టప్‌ను ఏర్పాటుచేసుకొని వ్యాపారం చేస్తున్నారు. విశాఖపట్నం రోటరీ అధ్యక్షురాలిగా పని చేసిన లావణ్య అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పని చేస్తున్న విషయం విశాఖవాసులకు తెలుసు. అయితే తొలిసారిగా ఆమె రాజకీయ ఆరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేను కలిసినవారిలో లావణ్యతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు దొండపాటి నవీన్‌కుమార్, అడ్వకేట్ ధనుంజయ, లొట్టి జగన్‌లు ఉన్నారు.










Comments