top of page

గెరిల్లా యుద్ధతంత్రం వైపు ఇరాన్!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 12 hours ago
  • 3 min read

పశ్చిమాసియా యుద్ధాన్ని త్వరగానే ముగించేస్తామని అటు అమెరికా రక్షణ మంత్రి, ఇటు ఇజ్రా యెల్ ప్రధానమంత్రి ప్రకటించారు. 90వ దశకంలోని గల్ఫ్ యుద్ధం మాదిరిగా ఇది సుదీర్ఘకాలం కొనసాగే పరిస్థితి లేదని.. ఇరాన్ ఆయుధాగారం ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోవడం, ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం కావడమే దీనికి కారణమన్నది ఆ నేత అభిప్రాయం. కానీ ఇరాన్ నాయకత్వం దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది. తమ దేశంలోని జనావాసాలు, ఆర్థిక ఆయువుపట్లు అయిన చమురు, గ్యాస్ క్షేత్రాలపై అమెరికా`ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఇరాన్ ఇప్పటినుంచే తమ అసలు సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరిస్తున్నది. అందుకు తగినట్లే కొద్దిరోజుల్లోనే ముగిసిపోతుందనుకున్న యుద్ధం 20 రోజులు గడిచినా కొనసాగుతూనే ఉంది. కాగా ఒకవైపు ఆధునిక వార్‌ఫేర్ అనుసరిస్తున్న ఇరాన్ మరోవైపు శత్రుద్వయాన్ని నిలువరించి, కకావికలు చేసేందుకు గెరిల్లా యుద్ధతంత్రాన్ని అమలు చేస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ గెరిల్లా యుద్ధానికి దిగితే అది మరో వియత్నాం లేదా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మాదిరిగా సుదీర్ఘ కాలం కొనసాగే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. రక్షణ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఇరాన్ ఇప్పటికే సంప్రదాయ యుద్ధం కాకుండా అసిమెట్రిక్ యుద్ధ వ్యూహాల వైపు మరలుతోంది. రెండు దేశాలు లేదా సైన్యాల శక్తి, సాంకేతికత, వనరులు సమానంగా లేని పరిస్థితుల్లో బలహీనపక్షం ప్రత్యక్ష యుద్ధం కాకుండా ప్రత్యేక వ్యూహాలతో బలమైన శత్రువును ఎదుర్కోవడాన్నే అసిమెట్రిక్ యుద్ధరీతిగా పేర్కొంటారు. చిన్నదేశాలు లేదా గెరిల్లా దళాలు పెద్ద సైన్యాలను ఎదుర్కోడానికి ఈ వ్యూహం అనుసరిస్తుంటాయి. ఈ యుద్ధతంత్రంలో చాటుమాటు మెరుపు దాడులు, చౌక ఆయుధాలతో దాడులు, మౌలిక వసతులను దెబ్బతీయడం, మానసిక యుద్ధం భాగంగా ఉంటాయి. శత్రువు ఊహకు అందని రీతిలో అకస్మాత్తుగా దాడులు చేసి మెరుపు వేగంతో వెనక్కి వెళ్లిపోవడం గెరిల్లా యుద్ధతంత్రం. ఈ వ్యూహం ఎంత పెద్ద సైన్యాన్ని అయినా చికాకు పర్చి వేగంగా అలసిపోయేలా చేస్తుంది. అమెరికా లాంటి అతిపెద్ద సైనికశక్తి కలిగిన దేశాలతో ఇరాన్ లాంటి చిన్న దేశాలు తలపడలేవు. అలాంటప్పుడు చిన్న డ్రోన్లు, మైన్లు, ఐఈడీలు ఉపయోగించి పెద్ద సైన్యాలకు భారీ నష్టం కలిగిస్తుంటాయి. ఒకే ప్రాంతంలో కాకుండా అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న దాడులు చేసి మానసికంగా దెబ్బతీస్తుంటాయి. ఇప్పుడు ఇరాన్ అదే పని చేస్తున్నది. ఇలాంటి వ్యూహాలను గతంలో వియత్నాం యుద్ధంలో తర్వాత ఆఫ్ఘన్‌లో తాలిబాన్లు అమలుచేశారు. ఇరాన్ అనుసరిస్తున్న మోసాయిక్ డిఫెన్స్ వ్యూహం సరిగ్గా అలాగే ఉంది. ఈ విధానంలో సైన్యాన్ని చిన్న చిన్న యూనిట్లుగా విభజిస్తారు. కేంద్ర కమాండ్ ధ్వంసమైనా యుద్ధం కొనసాగుతుంది. ప్రతి యూనిట్ స్వతంత్రంగా పోరాడుతుంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ రూపొందించిన ఈ వ్యూహం వల్ల శత్రువు త్వరగా విజయం సాధించడం చాలా కష్టం. మరోవైపు ప్రస్తుత యుద్ధంలో ఇరాన్‌తో పోలిస్తే అమెరికా ఖర్చు ఎన్నో రెట్లు అధికంగా ఉంది. అమెరికా గత రెండు దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో చేసిన యుద్ధాలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. బ్రాన్ యూనివర్సిటీ (కాస్ట్స్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్) నివేదికల ప్రకారం.. 2001`21 మధ్య ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలకు అమెరికా సుమారు రూ. 660 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇందులో నేరుగా యుద్ధానికి చేసిన ఖర్చుతో పాటు, రిటైర్డ్ సైనికుల వైద్యం, అప్పులకు వడ్డీలు కూడా కలిపి ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు అమెరికా రోజుకు సగటున రూ.2,500 కోట్లు ఖర్చు చేసింది. కాగా ఇరాన్‌తో జరుగుతున్న ప్రస్తుత యుద్ధంలో మొదటి వంద గంటల్లోనే అమెరికాకు సుమారు రూ.34,240 కోట్లు ఖర్చు అయ్యిందని అంచనా. ఇరాన్ అమలు చేస్తున్న మరో వ్యూహం కూడా అమెరికాపై ఒత్తిడి పెంచుతున్నది. పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న హర్మూజ్ జలసంధి గుండా ప్రపంచ చమురు అవసరాల్లో 20 శాతం వరకు రవాణా అవుతుంటుంది. ఇరాన్ ఈ మార్గాన్ని దాదాపుగా మూసివేయడం వల్ల ప్రపంచ చమురు మార్కెట్ కుదేలవుతుంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి. దీనివల్ల ఇతర దేశాల నుంచి అమెరికాపై ఒత్తిడి బాగా పెరుగుతుంది. కాగా చుట్టూ పర్వతాలు, ఎడారులు, విస్తారమైన భూభాగాలు ఇరాన్‌కు సహజమైన రక్షణ కవచాలుగా ఉన్నాయి. ఇవి విదేశీ సైన్యాలకు కష్టాలు తెచ్చిపెడతాయి. అమెరికా ఇప్పటికే అప్ఘనిస్తాన్‌లో, ఇరాక్ యుద్ధాల్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది. అయితే ఇరాన్‌తో పూర్తిస్థాయి భూతల యుద్ధానికి అమెరికా సాహసించే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. దానికి భారీ సైనిక బలం అవసరం. పైగా ప్రాణనష్టం జరిగే కొద్ది అమెరికా ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో నిరసనలు తీవ్రమవుతాయి. పైగా యుద్ధం ఎంత ఎక్కువ కాలం జరిగితే అమెరికాకు అంత ఎక్కువ ముప్పు ఉంటుంది. అందువల్ల భూతల యుద్ధానికి అమెరికా దిగే ఛాన్స్ లేదు. కాగా కొంతమంది నిపుణులు మాత్రం ప్రస్తుత యుద్ధం వియత్నాం యుద్ధంలా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే అమెరికా భారీగా నష్టపోతుంది. ప్రస్తుత యుద్ధం ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెనుప్రభావం చూపుతోంది. సప్లై చైన్ దెబ్బతినడం వల్ల చమురు ధరలు పెరుగుతూ పోతున్నాయి. గ్యాస్ కొరత సంక్షోభం సష్టిస్తున్నది. వీటి ఫలితంగా ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయి. దీంతో యుద్ధాన్ని త్వరగా ముగించాలని ప్రపంచ దేశాలు అమెరికాపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం అమెరికాదే అయినా ఒకసారి గెరిల్లా యుద్ధం మొదలైతే మాత్రం ఏళ్ల తరబడి కొనసాగవచ్చు. ఇరాన్ అదే వ్యూహాన్ని పూర్తిగా అమలు చేస్తే ఈ యుద్ధం త్వరగా ముగియకపోవచ్చు. అలాంటి పరిస్థితే ఏర్పడితే అది కేవలం మధ్యప్రాచ్యానికే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే పెద్ద పరీక్షగా మారే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page