గోల్డ్ కొరియర్ హత్యలో కార్ వరల్డ్ ప్రమేయం
- NVS PRASAD

- Sep 5, 2025
- 1 min read
గుప్త కారులో నలుగురు ప్రయాణం
మడపాం సీసీలో ఒక్కరే రికార్డు
పెద్దపాడు సమీపంలోని పంట కాలువలో మృతదేహం
డ్రైవర్ సంతోష్, మొల్లి రాజుపైనే అనుమానం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
బయటి ప్రాంతం నుంచి బంగారం తెస్తూ హత్యకు గురైన బంగారం కొరియర్ నరసన్నపేటకు చెందిన పొట్నూరు వెంకట పార్వతీశం గుప్త కేసులో శ్రీకాకుళం పెద్దపాడులో వ్యాపారం చేస్తున్న ఆదిత్య కార్ వరల్డ్ యజమాని మొల్లి రాజు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇదిలా ఉండగా, గుప్త శవం పెద్దపాడులో ఉన్న ఆదిత్య కార్‌వరల్డ్ పక్కనున్న పెద్దపాడు గెడ్డ శివార్లలో గుర్తించారు. ఇందుకు సంబంధించి డ్రైవర్ ప్రధాన నిందితుడని పోలీసులు భావిస్తున్నారు. అయితే గురువారం రాజును పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. రాజుకు, గుప్త కార్ డ్రైవర్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్టు భోగట్టా. కార్ డ్రైవర్ సంతోష్ నరసన్నపేటలో అనేకమంది బంగారం వర్తకుల వాహనాలకు డ్రైవర్‌గా పని చేశాడు. అనేక ప్రాంతాల నుంచి బంగారం తెచ్చేటప్పుడు సంతోష్‌నే డ్రైవర్‌గా తీసుకువెళ్తారు. అయితే ఈసారి పెద్దమొత్తంలో బంగారం గుప్త వద్ద ఉండటంతో ఆయన హత్యకు పూనుకొన్నట్లు భావిస్తున్నారు. నాతవలస టోల్‌గేట్ వద్ద సీసీ కెమెరాలో గుప్త కారులో నలుగురు ఉన్నట్లు గుర్తించగా, మడపాం టోల్‌గేట్ వద్ద డ్రైవర్ ఒక్కడే సీసీలో రికార్డయినట్టు తెలుస్తుంది. అంటే ఈ మధ్యలోనే గుప్తను హత్యచేసివుంటారని పోలీసులు ముందుగానే ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇందులో ఆదిత్య కార్‌వరల్డ్ యజమాని రాజు పాత్ర ఏమిటనేది తేలాల్సివుంది. రాజు కుటుంబం కొన్నేళ్ల క్రితం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చారు. పెద్దపాడు రోడ్‌లో కార్‌జిమ్ అని ఒక షాపును తెరిచి, అది నష్టాల్లో ఉందంటూ మూసేశారు. ఆ తర్వాత పెద్దపాడులో బంకు ఎదురుగా ఆదిత్య కార్ వరల్డ్ అనే మరో షాపును తెరిచారు. ఇక్కడ కూడా వ్యాపారం సాగడంలేదంటూ హైవేపై వరుణ్ మోటార్స్ పక్కన ఇదే పేరుతో షాపును తెరిచారు. ఆ షాపు పైన రెండంతస్తుల్లో రాజు కుటుంబం ఉంటుంది. గుప్త బంగారం తేవడానికి వెళ్లిన కారులో డ్రైవర్ కుటుంబీకులు కూడా ఉన్నారని కొందరు చెబుతున్నారు.










Comments