top of page

గోల్డ్, సిల్వర్ పతనం.. రాగి ఉత్థానం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 5 days ago
  • 3 min read

ఆకాశమే హద్దుగా కొన్నాళ్లుగా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు కొత్త శిఖరాలను తాకిన తర్వాత శుక్రవారం అకస్మాత్తుగా నేలచూపులు చూడటం సాధారణ వినియోగదారులను ఉపశమనం కలిగించినా.. బడా పెట్టుబడిదారులు, అమెరికా సహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులకు ఝలక్ ఇచ్చినట్లయ్యింది. ధరల దూకుడుకు శుక్రవారం ఉదయం నుంచే బ్రేకులు పడుతూ మార్కెట్ తీవ్ర ఊగిసలాటతో కొట్టుమిట్టాడింది. ఫలితంగా పెట్టుబడిదారులు, వ్యాపారులు బేర్‌మన్నారు. ఉదయం వ్యాపార కార్యకలాపాలు ప్రారంభం కాగానే గురువారం సాయంత్రం ధరతో పోలిస్తే బాగా తక్కువగా ట్రేడ్ అయ్యింది. మధ్యాహ్నానికి కోలుకున్న ధర మళ్లీ సాయంత్రానికి భారీగా పతనమైంది. ఒక దశలో రూ.1.90 లక్షలకు ఎగబాకి రికార్డు సష్టించిన బంగారం ధర సాయంత్రానికి రూ.1.63 లక్షల స్థాయికి పతనమైంది. ఇక వెండి కూడా కేజీ ధర రూ.4.25 లక్షల నుంచి శుక్రవారం ఒక్కరోజే రూ.85 వేలకుపైగా పతనమై రూ.3.40 లక్షల స్థాయికి దిగిపోయింది. ఫలితంగా శుక్రవారం ఒక్కరోజే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆవిరైపోయాయి. ఈ పరిమాణాన్ని మార్కెట్ నిపుణులు ముందే ఊహించి హెచ్చరిస్తూ వచ్చారు. వారి హెచ్చరికలను నిజం చేస్తూ ధరల పతనం ప్రభావం గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్(ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)పై భారీగా పడింది. ఒక్కరోజులోనే 10 నుంచి 14 శాతం మేరకు వాటి విలువలు పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కనిపించింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో వెండి ధర ఆరు శాతం మేరకు, బంగారం ధర ఐదు శాతం వరకు క్షీణించింది. ఈ రెండింటి ధరలు ఇలా దోబూచులాడుతుంటే.. తానేమీ తక్కువ కాదన్నట్లు రాగి(కాపర్) కూడా వాటినే అనుసరిస్తోంది. పసిడి, సిల్వర్ ధరలు అందుబాటులో లేకుండా పెరిగిపోవడంతో పెట్టబడులకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్న ఇన్వెస్టర్లు ఈ రెండింటి తర్వాత స్థానంలో నిలిచిన రాగి వైపు దష్టి సారించారు. వెండి మాదిరిగానే రాగిని గీVAపకరణాలుగానే కాకుండా పారిశ్రామికంగానూ వినియోగిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఈ వినియోగం మరిన్ని పారిశ్రామిక రంగాలకు విస్తరించింది. ఏఐ ఆధారిత డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పవర్ గ్రిడ్ పరిశ్రమ వంటివన్నీ రాగిపై ఆధారపడి పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రపంచం తీవ్రమైన రాగి కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని నిన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. రాగి ఇకనుంచి కేవలం పారిశ్రామిక లోహంగా మాత్రమే కాకుండా వ్యూహాత్మక వనరుగానూ కీలకంగా మారుతుందని సర్వే పేర్కొంది. ఇప్పటికే బంగారం, వెండి ధరల ప్రభావంతో గత కొన్నిరోజులుగా పెరుగుతున్న రాగి ధర, ఆర్థిక సర్వే పుణ్యాన మరింత ఎగబాకే అవకాశం కనిపిస్తోంది. దానికి తగినట్లే పారిశ్రామిక వినియోగంతోపాటు రాగిపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఫలితంగా ఏడాది కాలంలో దీని ధర రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 2025 జనవరిలో రూ.793 పలికిన కిలో రాగి.. ఏడాది తిరిగేసరికి ఈ నెలారంభంలో రూ.1325కు చేరుకుంది. ఇక గత వారం రోజులు మరింత ఊపందుకుని గురువారం నాటికి కిలో రూ.1800కు ఎగబాకింది. రాగి ధరల్లో అనూహ్య పెరుగుదలకు రెండు ప్రధాన కారణాలను ఆర్థిక సర్వే వెల్లడించింది. పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులకు భారీ మౌలిక సదుపాయాలు అవసరం. ట్రాన్స్‌మిషన్ లైన్లు, కేబుల్స్, మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, గ్రిడ్ నెట్‌వర్క్‌లను నిర్మించడానికి పెద్ద మొత్తంలో రాగి అవసరం అవుతుంది. ఈ స్థాయిలో డిమాండ్ పెరుగుతున్నప్పటికీ దానికి తగిన విధంగా సరఫరా లేదని సర్వే ఎత్తిచూపింది. ఒక నివేదిక ప్రకారం.. ఒక గిగావాట్(జీడబ్ల్యూ) పవన విద్యుత్ ప్రాజెక్టు స్థాపించడానికి సుమారు 2,866 టన్నుల రాగి అవసరమని అంచనా. అయితే గనుల్లోంచి రాగి వెలికితీత ప్రక్రియ గతం కంటే ఇప్పుడు కష్టంగా మారిపోయింది. ప్రస్తుతం నడుస్తున్న గనుల్లో సగటు రాగి ఉత్పత్తి శాతం 0.5 నుంచి 0.6 శాతం మాత్రమే ఉంది. కొత్త ప్రాజెక్టుల్లో అయితే 0.4 నుంచి 0.5 శాతానికి తగ్గింది. అంటే ఒక టన్ను స్వచ్ఛమైన రాగిని ఉత్పత్తి చేయాలంటే 167 నుంచి 200 టన్నుల ఖనిజాన్ని ప్రాసెస్(శుద్ధి) చేయాల్సి ఉంటుంది. మనం సగటున 0.6 శాతం దిగుబడిని తీసుకుంటే 2,866 టన్నుల రాగిని పొందడానికి సుమారు 4.8 లక్షల టన్నుల ఖనిజాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుందని ఆ రంగం నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రాగి గనుల్లో తరచూ జరుగుతున్న సమ్మెలు, ఇతరత్రా అవాంతరాలు ఉత్పత్తిని పడగొడుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా రాగి ఉత్పత్తి చేసే చిలీతో సహా ఇతర దేశాల్లోని రాగి గనుల కార్మికులు తరచూ సమ్మెలు చేస్తుండటం వల్ల జరుగుతున్న కొద్దిపాటి ఉత్పత్తి కూడా నిలిచిపోతున్నది. మరోవైపు అవసరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇది చాలదన్నట్లు అమెరికా టారిఫ్ భయాలు రాగి పరిశ్రమను వెంటాడుతున్నాయి. రాగి దిగుమతులపై 15 నుంచి 30 శాతం వరకు సుంకాలు విధించడానికి డోనాల్డ్ ట్రంప్ సర్కార్ సన్నాహాలు చేస్తుండటంతో భవిష్యత్తులో రాగి ధరలు ఇంకా పెరుగుతాయని ఆ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ ఖనిజం ధర 13వేల డాలర్లు దాటి రికార్డులు సష్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాగి తవ్వకాలకు సకాలంలో పెట్టుబడులు పెట్టకపోయినా, కొత్త ప్రాజెక్టులకు ఆమోదం లభించకపోయినా, రీసైక్లింగ్‌పై దృష్టి పెట్టకపోయినా గ్రీన్ ఎనర్జీ పరివర్తన అడ్డంకులను ఎదుర్కొంటుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ప్రపంచ శక్తి పరివర్తన ఎంత త్వరగా జరుగుతుందో రాగి లభ్యత నిర్ణయిస్తుందని సర్వే స్పష్టం చేస్తోంది. రాబోయే దశాబ్ద కాలంలో కొత్త కొత్త రంగాలకు రాగి వినియోగం విస్తరిస్తుందన్నది వాస్తవం. ఆ ఒత్తిడి అంచనా వేసి ఇప్పటినుంచే రాగి ఉత్పత్తి, సరఫరా పెంచేందుకు చర్యలు తీసుకోకపోతే బంగారం, వెండి మాదిరిగానే రాగి ధర కూడా చుక్కలను తాకడం ఖాయం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page