గట్టు గుట్టు తేల్చాలి
- BAGADI NARAYANARAO
- Aug 12
- 1 min read
రెవెన్యూ సిబ్బందికి తహసీల్దారు మెమోలు
‘సత్యం’ కథనానికి స్పందన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
బలగ నాగావళి వరదగట్టు గుట్టు తేల్చేపనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఆదివారంపేట దాటిన తర్వాత శ్రీకాకుళం-ఆమదాలవలన ప్రధాన రోడ్డుకు ఆనించి ఉన్న సర్వే నెంబర్1 లోని సబ్ డివిజన్లు 1 నుంచి 5 వరకు సుమారు 1.80 ఎకరాల నాగావళి వరదగట్టు (ప్రభుత్వ భూమి)కి కంచె వేసి కబ్జా చేసిన అంశంపై తహసీల్దారు ఎన్.గణపతి మండల రెవెన్యూ సిబ్బందికి సోమవారం మెమోలు జారీ చేశారు.శ్రీకాకుళం మండలం బలగ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 1లో సబ్‌డివిజన్లు 1 నుంచి 5 వరకు ఉన్న సర్వే నెంబర్లలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ‘సత్యం’లో వచ్చిన కథనానికి శ్రీకాకుళం మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. సదరు సర్వే నెంబర్`1లో ఉన్న సబ్ డివిజన్లను సర్వే చేసి నివేదిక ఇవ్వాలని మండల సర్వేయర్, ఆర్‌ఐ, స్థానిక విలేజ్ సర్వేయర్, స్థానిక వీఆర్వోలకు మెమోలు జారీ చేశారు. సదరు నాగావళి వరద గట్టును ఆక్రమించిన వారి వివరాలు, భూమి స్వభావాన్ని తెలియజేయాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు 2023లో ప్రభుత్వ భూమిగా గుర్తించిన నాగావళి వరద గట్టుపై మూడు సార్లు హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేస్తే, వాటిని తొలగించి హద్దురాళ్లు, కంచె వేశారని సోమవారం గ్రీవెన్స్‌లో ఆదివారంపేటకు చెందిన బోనెల చిరంజీవి ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని ఫిర్యాదుదారుకు చెప్పారు. దీంతో తహసీల్దార్ ముందుగానే ‘సత్యం’లో వచ్చిన కథనానికి స్పందించి మెమోలు జారీ చేశారు. నాగావళి వరద గట్టును జేసీబీలతో తవ్వి మట్టిని చదును చేసి చుట్టూ కంచె, హద్దు రాళ్లు వేసిన బలగకు చెందిన ఆ నలుగురు ఫేక్ పత్రాలతో స్థానిక రెవెన్యూ సిబ్బంది ద్వారా వ్యవహారం చక్కబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదుదారుడు బోనెల చిరంజీవి ఆరోపిస్తున్నారు. కొందరు రెవెన్యూ సిబ్బంది నిర్వాకం వల్లనే నాగావళి వరదగట్టు ఆక్రమణకు గురైందని ఆరోపిస్తున్నారు. ఆక్రమణలు తొలగించి భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకునేంత వరకు పోరాటం ఆగదని ఫిర్యాదుదారుడు బోనెల చిరంజీవి పేర్కొన్నారు.
Comments