చెక్కే.. ధర చూస్తే షాకే!
- DV RAMANA

- Sep 22, 2025
- 1 min read
బంగారం, వజ్రాలు, ప్లాటినమ్ బలాదూర్
పది గ్రాములు ఏకంగా రూ.85 లక్షలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఈ ఫొటోలో ఉన్నదేమిటో చూశారు? చెక్కలా కనిపిస్తోంది కదూ. అది నిజమే కావచ్చు.. కానీ చెక్కే కదా! దానికి అంత బిల్డప్ దేనికి అని ఎకసక్కెం చేయకండి. కావడానికి అది చెక్కే కావచ్చు.. కానీ ధరలో బంగారానికే బాబు అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం పది గ్రాములు ధర రూ.1.12 లక్షలకు చేరుకుంటేనే అందరూ నోరెళ్లబెడుతున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకొంటున్న చెక్క అదే గ్రాములు కొనాలంటే రూ.85 లక్షలు సమర్పించుకోవాలంటే కళ్ల తేలేస్తారేమో! కానీ ఇది ముమ్మాటికీ నిజం. అసలు ఆ చెక్క ఏమిటి? దానికి అంత విలువేమిటి? అంటే.. అగర్‌వుడ్ అని పిలిచే ఈ చెక్క లేదా కలప ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినది. అత్యంత ఖరీదైనది కూడా. దీనికి దేవతల కలప అనే మరోపేరు కూడా ఉంది. ఇతర కలప జాతుల మాదిరిగానే అగర్‌వుడ్ కూడా చెట్ల రూపంలో ప్రకృతి సహజంగానే పెరుగుతుంది. కానీ ఆ పెరుగుదల క్రమం అత్యంత సుదీర్ఘంగా.. ఇంకా చెప్పాలంటే కొన్ని దశాబ్దాల పాటు సాగుతుంది. అక్విలేరియా అనే చెట్ల మధ్యలో అగర్‌వుడ్ ఏర్పడుతుంది. చెట్టు ఈ ఒత్తిడిని ఎదుర్కొనేటప్పుడు రెసిన్ అనే జిగురులాంటి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సువాసనభరితంగా ఉంటుంది. ఇదే అక్విలీరియా చెట్టుకు చెందిన కినమ్ కలపను సుగంధభరితం చేసి అగర్‌వుడ్‌గా మారుస్తుంది. వియత్నాం, చైనాలోని హైనాన్ ప్రాంతం, కంబోడియా, ఇండోనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలతో పాటు మన దేశంలోని అసోంలో చాలా పరిమితంగా ఈ అగర్‌వుడ్ లేదా కినమ్ కలప లభిస్తుంది. దీన్ని కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు, నూనెల తయారీలో ఉపయోగిస్తారు. ఇటీవల షాంఘైలో 600 ఏళ్ల పురాతనమైన 16 కిలోల అగర్‌వుడ్ చెక్క రూ.171 కోట్లకు అమ్ముడైనట్లు అల్ జజీరా టీవీ వెల్లడిరచింది. సో.. బంగారం, వజ్రాలు, ప్లాటినమ్ అతి ఖరీదైనవని అనుకుంటాం. కానీ అగర్‌వుడ్ ముందు అవన్నీ దిగదుడుపేనన్నమాట!










Comments