‘చెత్త’ కేంద్రంలోఅక్రమ సంపద సృష్టి!
- BAGADI NARAYANARAO

- Sep 20
- 2 min read
భైరివారి మరో అక్రమ బాగోతం బట్టబయలు
ప్రభుత్వ భవనమే సొంతమని తప్పుడు పత్రాలు
నూనె మిల్లు పేరుతో రూ.18 లక్షల సబ్సిడీ స్వాహా
ధర్మకాటా భవనం, పెట్రోల్ పంప్ ఏర్పాట్లులోనూ అక్రమాలు
బ్యాంకు అధికారుల సహకారంతో దందాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రభుత్వ భవనాన్ని తమ సొంత భవనంగా చూపించారు. అందులోనే వ్యాపారం చేస్తున్నట్లు తప్పుడు పత్రాలతో మభ్యపెట్టారు. ఏకంగా ప్రభుత్వానికే సున్నం పెట్టారు. సబ్సిడీ రుణం తీసుకుని రూ.18 లక్షల సబ్సిడీని స్వాహా చేశారు. బ్యాంకు అధికారుల సహకారం లేకుండా ఇది జరిగే అవకాశం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా అక్రమానికి పాల్పడిరది వేరెవరో కాదు. శ్రీకాకుళం రూరల్ మండలం భైరి ప్రాంతంలోని పంటకాలువలో అక్రమంగా భవనం నిర్మించి అందులో రాజసూర్య ధర్మకాటా నిర్వహిస్తున్న అన్నదమ్ములే పారిశ్రామిక సబ్సిడీ నొక్కేశారని అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆరా తీస్తే దీనివెనుక జరిగిన తతంగం బయటపడిరది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భైరి గ్రామానికి చెందిన భైరి సూర్యనారాయణ, వెంకటరమణలు అదే మండలం కరజాడ గ్రామ పరిధి సర్వే నెంబర్ 80/12లో శ్రీరాజా సరస్వతి గ్రౌండ్‌నట్ మిల్లు పేరుతో వ్యాపారం చేస్తున్నట్లు రిజిస్ట్రేషన్ చేయించారు. వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వ సబ్సిడీ రుణం మంజూరు చేయాలంటూ 2020`21 ఆర్థిక సంవత్సరంలో ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రొగ్రామ్ కింద ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు(కేవీఐబీ)కు దరఖాస్తు చేశారు. ఆయన దరఖాస్తును పరిశీలించిన కేవీఐబీ, కరజాడ గ్రామీణ వికాస్ బ్యాంకు (ప్రస్తుతం అంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు) అధికారులు రూ.50 లక్షల రుణం మంజూరు చేశారు. ఇందులో రూ.18 లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీగా అందింది. అయితే కరజాడలో నూనె మిల్లు ఏమీ లేదని, తప్పుడు డాక్యుమెంట్లతో సూర్యనారాయణ, వెంకటరమణలు రూ.18 లక్షల సబ్సిడీని అప్పనంగా కొట్టేశారని ఆ గ్రామానికి చెందిన కొందరు ఆన్‌లైన్‌లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు లోతుల్లోకి వెళితే విస్మయం కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అన్నీ అభూత కల్పనలే
వాస్తవానికి రుణగ్రహీతలు పేర్కొన్న కరజాడ గ్రామ సర్వే నెం బరు 80/12లో వారికి ఎటువంటి భవనం లేదు. ఆ సర్వే నెంబరు వంశధార నది గర్భం(రివర్ బెల్ట్)లో ఉంది. అందులో ఉన్నది ప్రభుత్వ భవనం. దాన్ని ఉపాధి హామీ పథకం కాంపోనెంట్ నిధులతో నిర్మించారు. దీన్నే రుణగ్రహీతలు తమ సొంత భవనంగా చూపించి, అందులో ఆయిల్ మిల్లు ప్రారంభించామని తప్పుడు పత్రాలు సృష్టించి కేంద్ర ప్రభుత్వ పథకం కింద రుణానికి దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారులు సమర్పించిన ధ్రువపత్రాలు సరిగ్గా పరిశీలించకుండానే, క్షేత్రస్థాయిలో భవనం, మిల్లు ఉన్నాయా లేవా అన్నది నిర్ధారించుకోకుండానే రుణం మంజూరు చేసేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో గ్రామీణ బ్యాంకు మేనేజర్ రవికుమార్ దరఖాస్తుదారులతో కుమ్మక్కై సబ్సిడీ రుణం మంజూరయ్యేలా మేనేజ్ చేశారని బైరి, కరజాడ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపి ప్రజాధనాన్ని దోచిపెట్టారని అంటున్నారు. చెత్తతో సంపదను సృష్టించడానికి ఉద్దేశించిన భవనాన్ని సబ్సిడీ కాజేయడానికి వాడేసుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
గతంలోనూ ఇదే తరహా అక్రమాలు
బ్యాంకు అధికారులతో ఉన్న పరిచయాలతో సూర్యనారాయణ, వెంకటరమణలు ఇంకా పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. భైరి రెవెన్యూ సర్వే నెంబర్ 31/12లో నిర్మించిన రాజాసూర్య ధర్మకాటా పేరుతో అక్రమంగా నిర్మించిన భవనానికి రుణం మంజూరు చేయించుకున్నట్లు ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. అది ఆక్రమ నిర్మాణమని తెలిసినా బ్యాంకు రుణం ఇవ్వడం వారి కుమ్మక్కు వ్యవహారాలను బహిర్గతం చేస్తోంది. పంట కాలువ స్థలంలో దీన్ని అక్రమంగా నిర్మించారని అధికారులు నిర్ధారించి, నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ను రబ్బరు పౌడరు గొదాంకు అద్దెకు ఇచ్చారు. అందులో విద్యుత్ కనెక్షన్ లేకపోయినా షార్ట్ సర్క్యూట్‌తో గొదాంలో అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ అధికారులతో కేసు నమోదు చేయించి నివేదిక రాయించడం ద్వారా రూ.10 లక్షల ఇన్సూరెన్స్ క్లయిమ్ చేయడానికి సిద్దపడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రూరల్ పోలీసులకు గొదాంను అద్దెకు తీసుకున్న వ్యక్తి ఫిర్యాదు చేశారు. కానీ రూరల్ పోలీసులు దీనిపై ఇప్పటికీ కేసు నమోదు చేయలేదు. ఈ వ్యవహారంలోనూ బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నమ్మినవారికే వెన్నుపోటు
భైరి జంక్షన్‌లో ఏర్పాటు చేసిన భారత్ పెట్రోల్ బంక్ విషయంలోనూ ఇదే రీతిలో మోసం చేసినట్లు తెలిసింది. 50 శాతం భాగస్వామ్యంతో బంక్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుని శ్రీకాకుళం నగరంలోని కత్తెర వీధికి చెందిన మెట్ట విశాలక్ష్మిని మోసం చేసిన కేసులో న్యాయస్థానం ఆదేశాలతో రూరల్ పోలీస్ స్టేషన్‌లో సూర్యనారాయణ, వెంకటరమణలపై కేసు నమోదైంది. ఫోర్జరీ సంతకాలతో భారత్ పెట్రోల్ సంస్థను తప్పుదారి పట్టించారని ఫిర్యాదు చేశారు. భాగస్వామ్య వాటా కింద సర్వే నెంబర్ 32/2లో 29 సెంట్ల స్థలంతో పాటు నగదు రూపంలో పెద్ద మొత్తాన్ని తీసుకున్నట్టు బాదితులు ఆరోపిస్తున్నారు. వాటాదారులుగా నమ్మించడానికి బీపీసీఎల్ అవుట్‌లెట్‌కు విశాలక్ష్మి పేరును చేర్చి రాజాసూర్యా విశాలక్ష్మి పెట్రోల్ పంపుగా నామకరణం చేశారు. కానీ అధికారికంగా తనను ఎక్కడా భాగస్వామిగా పేర్కొనలేదని తెలుసుకున్న విశాలక్ష్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ మనోవేదనతోనే వృద్ద దంపతులు విశాలక్ష్మి, బాలకృష్ణలు మంచం పట్టారు. బ్యాంకు ఉద్యోగులుగా కొనసాగుతున్నప్పటి నుంచి వారికి భైరి సూర్యనారాయణతో పరిచయం ఉంది. దాన్ని ఆసరా చేసుకొని సూర్యనారాయణ మోసం చేశారని భోరుమంటున్నారు. ఇప్పటికీ ఈ వివాదం పెండిరగులో ఉంది.










Comments