top of page

చందా ఇస్తే సరి..లేదంటే కేసులే మరి!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Sep 26, 2025
  • 2 min read
  • మద్యం షాపుల నుంచి మామూళ్ల వసూళ్లు

  • షాపు, ప్రాంతాలను బట్టి రేట్లు ఫిక్స్‌

  • చందాలు ఇచ్చే షాపుల జోలికి రాబోమని భరోసా

  • ప్రభుత్వ వాహనాల్లోనే ఎక్సైజ్‌వారి వసూళ్ల యాత్ర

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

దసరా వస్తోందంటే చాలు.. చందాల దందా మొదలైనట్లే. పాలు, నీళ్లు సరఫరా చేసేవారు, కరెంటోళ్లు.. ఇలా చిన్నతరహా ఉద్యోగాలు చేసుకునేవారు దసరా కట్నాల కోసం రావడం సర్వసాధారణం. కానీ జిల్లాలో ఎక్సైజ్‌ శాఖ కూడా చందాల వసూళ్లు ముమ్మరం చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికోసం ఫిక్స్‌డ్‌ రేట్లు కూడా పెట్టేసింది. లైసెన్స్‌ పొందిన మద్యం షాపులకు ఒక రేటు, అనధికారికంగా నడుస్తున్న బెల్ట్‌ షాపులకు మరో రేటు ఫిక్స్‌ చేసి ఖరాకండీగా వసూలు చేస్తున్నారంటున్నారు. మద్యం షాపులకు రూ.పదివేలు, వాటికి అనుబంధంగా ఉన్న బెల్ట్‌ షాపులకైతే ప్రాంతాన్ని బట్టి రూ.మూడు వేల నుంచి రూ.ఐదువేల వరకు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఇక మండల కేంద్రాల్లో మద్యం అమ్ముతున్న పాన్‌షాపుల వారి నుంచి రూ. రెండు వేలు చొప్పున బలవంతంగా వసూలు చేస్తున్నారు. అలాగే చిన్నసైజు గ్రామాల్లోని బెల్ట్‌ షాపులకు రూ.వెయ్యి నిర్ణయించారని తెలిసింది. సర్కిళ్లవారీగా వసూళ్లు సాగిస్తున్న ఎక్సైజ్‌ సిబ్బంది.. ఇందుకోసం ప్రభుత్వం తమకు కేటాయించిన వాహనాలనే వినియోగిస్తున్నారు. బహిరంగంగానే జరుగుతున్న ఈ వసూళ్లపర్వం తీవ్ర దుమారం రేపుతోంది.

ఐదేళ్ల తర్వాత మళ్లీ మొదలు

చందాలు ఇవ్వకుంటే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్‌ సిబ్బంది బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చందాలు ఇచ్చిన వారి జోలికి రాబోమని భరోసా కూడా ఇస్తున్నారని తెలిసింది. వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ డిపోల్లోనే మద్యం విక్రయాలు జరపడం వల్ల నెలవారీ మామూళ్లు, దసరా చందాలు దండుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం వ్యాపారం ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వడంతో ఈ ఏడాది దసరా చందాలకు ఎక్సైజ్‌ సిబ్బంది ఎగబడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా అధికార కూటమి నాయకులు కనుసన్నల్లోనే మద్యం షాపులు నడుస్తుండటంతో వారి నుంచే పెద్ద మొత్తంలో దసరా చందాలను సర్కిల్‌ కార్యాలయాలకు ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. వీటిని సిండికేట్‌ నిర్వాహకులే కార్యాలయాలకు తెచ్చి ఇస్తారు కాబట్టి లైసెన్స్‌డ్‌ షాపుల నుంచి చందాల కోసం పెద్దగా పాకులాడాల్సిన అవసరం లేదు. అయితే వాటికి అనుసంధానంగా నడుస్తున్న బెల్ట్‌ షాపుల నుంచి మాత్రం ముక్కి పిండి వసూలు చేస్తున్నారని మద్యం వ్యాపారులు గుసుగుసలాడుతున్నారు. పాతపట్నం, కోటబొమ్మళి, నరసన్నపేట పరిధిలో దసరా చందాల వ్యవహారం దుమారం రేపుతోంది. దీనిపై సిండికేట్‌ నిర్వాహకులే గుర్రుగా ఉన్నారని తెలిసింది. పెద్దమొత్తంలో చందాలు డిమాండ్‌ చేస్తుండటం ఇబ్బందికరంగా ఉందని గ్రామీణ ప్రాంతాల మద్యం వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, సోంపేట, మందస, మెళియాపుట్టి, నందిగాం తదితర ప్రాంతాల్లో సారా తయారీదారుల నుంచి నెలవారీ మామూళ్ల్లతో పాటు దసరా చందాలు కూడా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దసరా చందాలు దండేస్తున్న ఎక్సైజ్‌ శాఖ ఇక మద్యం షాపుల్లో అక్రమాలపై ఏం చర్యలు తీసుకుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page