చంద్రబాబు పంతం.. 5 కోట్ల ప్రజలకు శాపం
- SATYAM DAILY
- 2 hours ago
- 2 min read
రాజధాని పేరుతో ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోశారు
మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితులు తెస్తున్నారు
అమరావతి కోసం 50 ఏళ్లు ఆగమంటారా?
ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలని, సీఎం చంద్రబాబు ఏకపక్ష వైఖరి, పక్షపాత ధోరణితో ఒక ప్రాంతానికే లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారని ఆక్షేపించారు. నిపుణుల కమిటీ సిఫార్సులు బేఖాతరు చేస్తూ రాజధానిపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని, ఆయన వైఖరితో మళ్లీ హైదరాబాద్ తరహా పరిస్థితులు ఉత్పన్నమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు స్థానికంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఏకపక్ష విధానం వల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు శాశ్వతంగా వెనకబడిపోయే ప్రమాదం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చి రాష్ట్రం విడిపోయిందని చంద్రబాబు వేసిన కమిటీయే పేర్కొందన్నారు. అయినా సీఎం చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారని, అమరావతి పేరుతో కేవలం సంపన్న వర్గాల ప్రయోజనాల కోసం నిధులన్నీ అక్కడే కుమ్మరిస్తే, భవిష్యత్తు తరాలు మళ్లీ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాల్సిన దుస్థితిని చంద్రబాబు కల్పిస్తున్నారని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు ఏర్పాటైన నిపుణుల శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి అమరావతి ప్రాంతం అనుకూలం కాదని స్పష్టంగా చెబితే.. ఆ కమిటీకి కనీస వసతులు కూడా కల్పించకుండా హింసించి పంపిన చంద్రబాబు, నేడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తన రాజకీయ అవసరాల కోసం అమరావతి తీర్మానం చేసి, పార్లమెంటులోనూ ఆమోదింపజేసుకుని కేంద్రంతో నోటిఫై చేయించారని ధర్మాన ఆరోపించారు.
80 ఏళ్లైనా ఇంకా వలసలేనా?:
ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే పేర్కొందని, రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా సీఎం చంద్రబాబు ఆ ప్రాంతానికి ఏం చేశారని ధర్మాన ప్రశ్నించారు. మరోవైపు 80 ఏళ్లైనా కూడా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఇంకా పొట్ట చేతబట్టుకుని వలస వెళ్తున్నారని, ఇక్కడ 60 ఏళ్లయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడమే కారణమన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ.వెయ్యి కోట్లు కూడా కేటాయించకపోవడం ఏం ధర్మమన్నారు. అమరావతిలో కనీస మౌలిక వసతుల కోసమే రూ.2 లక్షల కోట్లు కావాలని, అది పూర్తి కావడానికి 50 ఏళ్లు పడుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారని, అప్పటి వరకు వెనుకబడిన ప్రాంతాల ప్రజలు గోచీలు కట్టుకుని కూలీలుగా మిగిలిపోవాలా అని ఆయన ప్రశ్నించారు.
జగన్ విజన్‌పై హేళన సరికాదు:
ప్రపంచమంతా అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా వెళ్తుంటే, ఇక్కడ సీఎం చంద్రబాబు మాత్రం కేంద్రీకృత అభివృద్ధికి మొగ్గు చూపుతున్నారు. కానీ, జగన్ చాలా ముందుచూపుతో 5, 6 జిల్లాలకు మేలు చేసేలా వికేంద్రీకరణను ప్రతిపాదిస్తే, అవహేళన చేస్తున్నారని, ఇది ఏ మాత్రం సరికాదన్నారు.
వంశధారపై అచ్చెన్నాయుడి అబద్ధాలు:
వంశధార ప్రాజెక్టుపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని, ట్రిబ్యునల్‌లో మనకు అనుకూలంగా నాడు జగన్ హయాంలో తీర్పు రావడంతో, దాన్ని అమలు చేయడానికి జగన్ ఒడిశా వెళ్లి, అక్కడి సీఎంతో చర్చించారని గుర్తుచేశారు. ఇన్నేళ్ల సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు తన పాలనలో ఏనాడైనా ఒడిశా సీఎంతో మాట్లాడారా? ట్రిబ్యునల్ తీర్పు తర్వాత ఒడిషా ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సెల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేసినా, చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదో మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలన్నారు. వంశధారపై ట్రిబ్యునల్ తీర్పు జగన్ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందని, దానికి సంబంధించిన గజిట్ ఇప్పుడు వస్తే.. అదంతా తామే చేశామని అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారన్నారు. అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని చెబుతున్నవారు సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఒడిషా ప్రభుత్వ ఎస్సెల్పీ కోసం మంత్రి అచ్చెన్నాయుడు మర్చిపోయినట్లు ఉన్నారని ధర్మాన అన్నారు. ఆయనకు ఈ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రధానితో మాట్లాడి, ఒడిషా ప్రభుత్వంతో ఆ ఎస్సెల్పీని ఉపసంహరింపచేయాలన్నారు. వంశధార ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు అవసరం కాగా, ఈ బడ్జెట్‌లో కేవలం రూ.80 కోట్ల కేటాయింపు తమ ప్రాంతాన్ని మోసం చేయడమే అని ధర్మాన ప్రసాదరావు అన్నారు.






Comments