చేపా.. చేపా.. ఎందుకు పప్పులమ్ముతున్నావ్?
- BAGADI NARAYANARAO

- Aug 26, 2025
- 3 min read
రైతుబజార్ ఫిష్ సెంటర్‌లో కిరాణా వర్తకం
సబ్‌లీజుకిచ్చేసి సొమ్ములు చేసుకుంటున్న మత్స్యకార నాయకుడు
పార్కింగ్‌తో జామైపోతున్న రైతుబజార్ రోడ్డు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
చేపలు అమ్మాల్సిన చోట కిరాణా వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకమని అధికారులు చెబితే.. అధికారంలో ఉన్నది మా ప్రభుత్వమే.. అంటూ ఎదురుతిరుగుతున్నారు. స్వయాన స్థానిక ఎమ్మెల్యే వచ్చి వ్యాపారం ప్రారంభిస్తే మీరెందుకు అడ్డుకుంటున్నారని మార్కెటింగ్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ తంతు అంతా ఇలిసిపురం కూడలిలో ఉన్న రైతుబజార్ ప్రాంగణంలో జరుగుతుంది. వైకాపా హయాంలో ఫిష్ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో రూ.10 లక్షల యూనిట్ కాస్ట్‌తో రైతుబజార్ పార్కింగ్ స్థలంలో ఒక ఫిష్ రిటైల్ అవుట్ లెట్‌ను నిర్మించారు. దీన్ని కేవలం చేపల విక్రయానికే వినియోగించాలి. అయితే దీన్ని నాలుగు నెలల క్రితం శ్రీకాకుళం రూరల్ మండలం నరసయ్యపేటకు చెందిన టీడీపీ నాయకులు, మత్స్యకార సహకార సంఘం పూర్వ అధ్యక్షులు మైలపిల్లి నర్సింగరావు ఆధ్యర్యంలో ఫిషర్ ఉమెన్ కో`ఆపరేటివ్ సొసైటీకి చెందిన మైలపిల్లి నీలవేణికి ఈ ఏడాది మే 5 నుంచి వచ్చే ఏడాది మే 4 వరకు ఏడాది పాటు లీజుకు కేటాయించారు. లీజు అగ్రిమెంట్ ద్వారా లీజుకు తీసుకున్న షాపులో కేవలం చేపలు మాత్రమే విక్రయించాలని, మరే ఇతర వ్యాపారం చేయడానికి వీళ్లేదని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మత్స్య సంపదకు మినహా మరే ఇతర వ్యాపారం చేసినట్టు ఫిర్యాదు వస్తే లీజు రద్దు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లీజు కాలానికి రూ.20 వేలు డిపాజిట్‌తో నెలకు రూ.5 వేలు అద్దె చలాణా రూపంలో డీడీ ఫిషరీష్‌కు చెల్లించాలని అగ్రిమెంట్ ఇచ్చారు.
వారం రోజుల క్రితం నోటీసులు
ఈ నెల 15న ఎమ్మెల్యే గొండు శంకర్ దీన్ని ప్రారంభించారు. శంకర్ ప్రారంభించిన నాటికి అక్కడ ఖాళీ షాపు మినహా ఎటువంటి వస్తువులు, సరుకులు లేవు. ఆ తర్వాత చేపలు అమ్మాల్సిన చోట కిరాణా వ్యాపారం ప్రారంభించారు. దీనిపై రైతుబజార్‌లో ఏడీ మార్కెటింగ్‌కు ప్రతి నెల అద్దెలు చెల్లించి కిరాణా వ్యాపారం చేస్తున్న వర్తకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చేపలు విక్రయిస్తామని లీజుకు తీసుకొని కిరాణా వ్యాపారం చేయడం వల్ల రైతుబజార్లో చిరు వ్యాపారులంతా నష్టపోతున్నామని ఏడీ మార్కెటింగ్‌కు ఫిర్యాదు చేశారు. లీజుదారులను మార్కెటింగ్ శాఖ అధికారులు వివరణ కోరితే ఎవరూ స్పందించలేదు. దీంతో మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మత్స్యశాఖ అధికారులు లీజు మేరకు చేపలు విక్రయించాలి తప్ప.. కిరాణా వ్యాపారం చేయకూడదని హెచ్చరించారు. మత్స్యశాఖ అధికారులు హెచ్చరికలను లీజుదారులు పట్టించుకోపోవడంతో వారం రోజుల క్రితం నోటీసులు అందించారు. అయినా లీజుదారుడు వినిపించుకోలేదు. దీంతో రైతుబజార్లో చిరు వ్యాపారులంతా సోమవారం గ్రీవెన్స్‌లో జేసీకి వినతి పత్రం అందించి ఫిర్యాదు చేశారు. ఫిష్ అవుట్‌లెట్‌లో చేపలు మాత్రమే విక్రయించాలని నిబంధనలు ఉన్నా కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నందున రైతుబజార్లో ఉన్న చిరు వర్తకులతో పాటు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న సూపర్ మార్కెట్‌కు తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జేసీ ఫర్మాన్ ఖాన్ మార్కెటింగ్, మత్స్యశాఖ అధికారుల వివరణ కోరారు. దీంతో వారు లీజుదారుడికి నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. లీజుదారుడిని పిలిపించి మాట్లాడినా స్పందించలేదని వివరించారు. దీంతో జేసీ నోట్ ఫైల్ పెట్టాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించి లీజును రద్దు చేయాలని ఆదేశించారని తెలిసింది. రైతుబజార్లో వర్తకులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారని తెలుసుకున్న లీజుదారుడు జేసీని కలిసి వినతి అందించినట్టు తెలిసింది. దీనిపై జేసీ స్పందిస్తూ చేపలు విక్రయించాల్సిన చోట కిరాణా వ్యాపారం చేయడం కుదరదని లీజుదారుడిని వెనక్కి పంపించినట్టు విశ్వసనీయ సమాచారం.
నిబంధనలకు విరుద్ధంగా
గ్రీవెన్స్‌కు ఫిర్యాదు వచ్చిన వెంటనే మత్స్యశాఖ అధికారులను రైతు బజార్ ఆవరణలో ఉన్న ఫిష్ రిటైల్ అవుట్ లెట్‌ను పరిశీలించడానికి వెళ్లే సమయానికి షాపు షట్టర్లు క్లోజ్ చేసి వెళ్లిపోయారని తెలిసింది. లీజుదారుడు ప్రభుత్వ నుంచి నెలకు రూ.5వేలకు లీజుకు తీసుకొని నర్సింగరావు దాన్ని శ్రీపోలేరమ్మ ఫిష్, మటన్, చికెన్, కిరాణా షాపులకు నెలకు రూ.15వేలకు అద్దెకు ఇచ్చినట్టు తెలిసింది. వాస్తవంగా ఈ ఫిష్ అవుట్ లెట్‌ను నగరం పరిధిలోని మహిళా మత్స్యకార సొసైటీకి అప్పగించాలి. వైకాపా హయాంలో శ్రీ ముత్యాలమ్మ మార్కెటింగ్ ఫిషర్ ఉమెన్ కార్పొరేషన్ సొసైటీకి 2023 సెప్టెంబర్ 17 నుంచి ఏడాది కాలానికి నగరానికి చెందిన మైలపిల్లి మహాలక్ష్మీ లీజుకు తీసుకున్నారు. దీనికి నెలకు రూ.3,850 అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ ఇచ్చారు. దీన్ని మహాలక్ష్మి పార్టీషన్ చేసి రెండు షాపులుగా మార్చారు. ఈ రెండు షాపుల్లో ఒకదాంట్లో డ్రైఫిష్, మరోదానిలో లైవ్ ఫిష్‌ను విక్రయిస్తూ వచ్చారు.
ప్రస్తుతం ఇచ్చిన లీజులో గతం కంటే అద్దెను రూ.1150 పెంచి రూ.5వేలు (రెండు షాపులు కలిపి) చేశారు. లీజుకు తీసుకున్న నర్సింగరావు ఫిష్ రిటైల్ అవుట్ లెట్‌ను మరొకరికి అద్దెకు ఇచ్చినట్టు రైతుబజార్లో వర్తకులు చెబుతున్నారు. జేసీ మాత్రం లీజును రద్దు చేస్తున్నట్టు మత్స్యశాఖ అధికారులకు అల్టిమేటం ఇచ్చారని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా అవుట్‌లెట్ నిర్వహించడాన్ని మార్కెటింగ్‌శాఖ అధికారులు లీజుదారుడ్ని ప్రశ్నించారు. చిరు వ్యాపారులు మాత్రం రైతుబజారు పార్కింగ్ స్థలంలో ఫిష్ అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేసినప్పుడే అభ్యంతరం వ్యక్తం చేశామని చెబుతున్నారు. రైతుబజారు వచ్చే వినియోగదారుల వాహనాలకు సరైన పార్కింగ్ లేకపోవడం వల్ల వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులకు అనేక మార్లు విన్నవించినట్టు చెబుతున్నారు. పార్కింగ్ స్థలంలో వ్యాపార సముదాయాలు ఏర్పాటుచేయడం వల్ల అనేక కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.










Comments