top of page

చోరీ.. చోరీ..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Oct 30, 2025
  • 2 min read
  • జిల్లాలో మళ్లీ పెరుగుతున్న దొంగతనాలు

  • కొద్దిరోజుల వ్యవధిలోనే పలుచోట్ల ఘటనలు

  • తాళాలు వేసి ఉన్న ఇళ్లు, షాపులే టార్గెట్‌

  • పోలీసుల నిఘా లోపమే కారణమన్న ఆరోపణలు

  • స్థానికేతరులే చోరీలకు కారణమని నిర్థారణ

(చోరీ జరిగిన మెడికల్‌షాపులో అధారాలు సేకరిస్తున్న  క్లూస్‌ టీం)
(చోరీ జరిగిన మెడికల్‌షాపులో అధారాలు సేకరిస్తున్న క్లూస్‌ టీం)

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

చోరశిఖామణులు మళ్లీ రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఇటీవల వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలను హడలెత్తిస్తూ.. పోలీసులను పరుగులెత్తిస్తున్నాయి. ఈ మధ్య రోజుల వ్యవధిలోనే అధిక సంఖ్యలో దొంగతనాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసు నిఘా వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తున్న చోరులు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోని షాపులను కొల్లగొడుతున్నారు. ఇటీవల గార మండల పరిధిలో మూడు, శ్రీకాకుళం రూరల్‌ మండల పరిధిలో మూడు చోరీ కేసులు నమోదయ్యాయి. వీటిని పోలీసులు ఛేదించి ముగ్గురు అంతర్‌ జిల్లా దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండి ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మోటారు సైకిల్‌ దొంగతనాలు, పంచలోహా విగ్రహాల దొంగతనం, చైన్‌ స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిని కూడా ఛేదించి నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వీటిని మర్చిపోక ముందే పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఒకేరోజు నాలుగు చోట్ల దుండగులు చోరీలకు పాల్పడి సొత్తు ఎత్తుకెళ్లారు. సైక్లోన్‌ విధుల్లో పోలీసులు నిమగ్నం కావడం, విద్యుత్‌ నిలిచిపోవడం వల్ల దొంగలు చేతికి పని చెప్పి నాలుగు దుకాణాల నుంచి సుమారు రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

పెట్రోలింగ్‌ లోపం

జిల్లా వ్యాప్తంగా కొన్ని గ్రామీణ ప్రాంతాలు మినహా అన్నిచోట్ల సీసీ కెమెరాలతో పోలీసు సర్వేయలెన్స్‌ ఉంది. కాశీబుగ్గలో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగిన మూడు మెడికల్‌ షాపులు, ఒక ట్రావెల్‌ ఏజెన్సీలోనూ సీసీ కెమెరాలు ఉన్నాయి. వీటిని పరిశీలించి దొంగలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే అసలు చోరీలు జరగకుండా చూడాల్సిన పోలీసులు చోరీ జరిగిన తర్వాత హడావుడి చేయడం విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలో నైట్‌ బీట్‌ నిర్వహించడం పూర్తిగా నిలిచిపోయిందని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. అడపా దడపా పెట్రోలింగ్‌ చేసి పోలీసులు మమ అనిపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు సిబ్బంది కొరత, ప్రోటోకాల్‌ విధులు, ఇతర పనుల ఒత్తిడితో పోలీసులు సతమతమవుతున్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తుండటంతో నిఘా నీరుగారిపోతుందన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో వ్యూహాత్మక ప్రదేశాలన్నింటిలోనూ సీసీ కెమెరాలు అమర్చినట్టు పోలీసులు చెబుతున్నా.. అవి ఎంతమేర పని చేస్తున్నాయో పోలీసులకే తెలుసు. తమ శాఖ రూపొందించిన ఎల్‌హెచ్‌ఎంఎస్‌పై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను వినియోగించుకోవాలని పోలీసులు కోరుతున్నా ప్రయోజనం కనిపించడంలేదు. తాళం వేసి ఉన్న ఇళ్లలోనే ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి.

బయటి ప్రాంతాలవారితోనే చిక్కు

జిల్లాలో నమోదవుతున్న చోరీ కేసులను ఛేదించడంలో పోలీసులు ముందంజలో ఉండటం కాస్త ఉపశమనం కలిగించే అంశం. చోరీ అయిన ప్రోపర్టీ రికవరీలోనూ గతం కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు. అయితే నిందితులను పట్టుకోవడానికి, ప్రోపర్టీ రికవరీకి పోలీసులు, అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడం నిత్యకృత్యంగా మారిపోయింది. దీనికి కారణం.. చోరీ కేసుల్లో పట్టుబడుతున్నవారంతా పక్క రాష్ట్రాలు, ఇతర జిల్లాల నేరస్తులే. వారి కదలికలపై ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచడంతో వారు ఇక్కడికి వచ్చి నేరాలకు పాల్పడుతున్నారు. బైక్‌లు, చైన్‌ స్నాచింగ్‌, గంజాయి రవాణా, ఇళ్లు, దేవాలయాల్లో దొంగతనాలు చేస్తున్నవారిలో 90 శాతం జిల్లాతో సంబంధం లేనివారే. బైక్‌ దొంగతనాలు చేస్తున్నవారంతా ఇతర జిల్లాలకు చెందినవారే. చైన్‌ స్నాచర్స్‌, గంజాయి రవాణా చేస్తున్నవారు ఒడిశా, బీహార్‌, తమిళనాడు ప్రాంతాలవారు. ఇళ్లు, దేవాలయాల్లో దొంగతనాలు చేస్తున్నవారిలో ఈ జిల్లాకు చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. జిల్లాలో పాత నేరస్తులపై నిఘా ఉండడంతో కొంతమేర నేరాలు తగ్గాయని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇతర ప్రాంతాలకు చెందిన నేరస్తుల కారణంగానే అడపాదడపా నేరాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. పోలీసులు రాత్రి గస్తీని ఒకే ప్రాంతానికి పరిమితం చేయడం వల్లే శివారు ప్రాంతాల్లో నేరాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే దీంతో పోలీసులు ఏకీభవించడం లేదు. అన్నిచోట్లా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్లే త్వరితగతిన నేరస్తులను గుర్తించి, కేసులను ఛేదించి చోరీ సొత్తు రికవరీ చేయగలుగుతున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కొందరు పోలీసు అధికారులు కలిసి ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి చోరీ సొత్తు రికవరీకి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. దీనివల్ల కేసుల్లో పురోగతితో పాటు రికవరీ సాధ్యమవుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page