చెరువులో వాటాల చిచ్చు
- BAGADI NARAYANARAO

- May 12
- 2 min read
కలిసిమెలిసి ఉన్న రెండు గ్రామాల్లో రేగిన ఉద్రిక్తతలు
బక్లీ చెరువు లీజులో సగం వాటా ఇవ్వాలంటున్న భైరవానిపేట
అదే తమదేనని తాజాగా వాదిస్తున్న సీపన్నాయుడుపేట
ఏటా రూ.20 వేలే ఇస్తామని స్పష్టీకరణ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
దశాబ్దాల తరబడి ఉమ్మడి ఆస్తిగా ఉన్న చెరువు రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. దానిపై హక్కులు, ఆదాయంలో వాటాలపై వివాదాలు తలెత్తడంతో నిరసనలు, దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఫలితంగా ఇన్నాళ్లూ అన్నదమ్ముల్లా మెలిగిని శ్రీకాకుళం నగరపాలక సంస్థ 50వ డివిజన్ పరిధిలోని సీపన్నాయుడుపేట, భైరవానిపేట గ్రామాల ప్రజలు ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి వచ్చారు. రెండు గ్రామాల ఉమ్మడి ఆస్తిగా కొనసాగుతున్న చెరువుపై కొన్నాళ్లుగా సీపన్నాయుడుపేట వాసులే పెత్తనం చెలాయిస్తున్నారని బైరివానిపేట ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువును చేపల పెంపకానికి లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు గ్రామాలు పంచుకుంటూ ఉత్సవాలు, జాతరల నిర్వహణకు వినియోగిస్తూ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో చెరువుపై ఆదాయం పెరుగుతుండగా తమ గ్రామానికి అరకొర వాటా ఇస్తూ మిగిలిన మొత్తాన్ని సీపన్ననాయుడుపేటకే వాడేస్తున్నారని భైరవానిపేట వాసులు ఆరోపిస్తున్నారు. లీజు ఆదాయంలో సగం ఇవ్వాల్సిందేనని నిలదీస్తూ ఆదివారం బైరవానిపేట దళితులంతా చెరువు వద్దకు వెళ్లి ఆందోళన చేశారు.
అరకొరగా లీజు వాటా
ఫాజుల్‌బాగ్‌పేట రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 23/2లో బక్లీ చెరువు (బచ్చీస్ చెరువు) 39.60 ఎకరాల్లో విస్తరించి ఉంది. దశాబ్ధాల చరిత్ర కలిగిన ఈ చెరువును రెండు గ్రామాల తాగు, సాగునీటి అవసరాలకు సమానంగా వాడుకునేవారు. కాలక్రమంలో ఈ రెండు గ్రామాలు శ్రీకాకుళం నగరంలో కలిసిపోవడం, చెరువు ఆయకట్టు భూములు ఆవాసాలుగా మారిపోవడంతో చెరువు నీటితో అవసరం లేకపోయింది. దాంతో చేపల పెంపకానికి చెరువును లీజుకు ఇవ్వడం ప్రారంభించారు. లీజు రూపంలో వస్తున్న ఆదాయాన్ని సీపన్నాయుడుపేట గ్రామ అవసరాలకే అక్కడి పెద్దలు వినియోగిస్తూ బైరవానిపేట రామ మందిరం ఉత్సవాలకు ఏటా అరకొర డబ్బులు ఇచ్చి చేతులు దలుపుకుంటున్నారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా తాజాగా ఈ చెరువును రూ. ఎనిమిది లక్షల లీజు రేటుతో మూడేళ్లకు లీజుకు ఇచ్చారు. దీంతో తమ గ్రామ అవసరాలకు ఆ సొమ్ములో సమాన వాటా ఇవ్వాలని బైరివానిపేట ప్రజలు కోరారు. లీజు సొమ్ము నుంచి ప్రతి ఏటా వెయ్యి రూపాయలు చొప్పున పెంచి తమ గ్రామానికి ఇచ్చేవారని బైరివానిపేట గ్రామస్తులు చెబుతున్నారు. లీజు సొమ్ము పంకాలకు సంబంధించి సీపన్నాయుడుపేట పెద్దలు లెక్కలు చూపించేవారు కాదు.. బైరవానిపేట గ్రామస్తులు అడిగేవారు కాదు.
ఏకపక్షంగా ఒప్పంద పత్రం
ఈ తరుణంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో రామమందిర ఉత్సవాలు ఉన్నాయని.. ఆ ఖర్చులకు డబ్బులు ఇవ్వాలంటూ బైరవానిపేట గ్రామపెద్దలు గత నెలలోనే సీపన్నాయుడుపేట పెద్దలను కలిసి విన్నవించారు. అప్పటి నుంచీ డబ్బుల కోసం సీపన్నాయుడుపేట పెద్దల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అదిగో.. ఇదిగో .. అంటూ తప్పించుకు తిరగడం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత సీపన్నాయుడుపేట బచ్చీస్ అభివృద్ధి కమిటీ పేరుతో రూ.20 బాండ్ పేపర్ కొనుగోలు చేసి అందులో మొదటి పార్టీగా సీపన్నాయుడుపేటను, రెండో పార్టీగా బైరవానిపేట రామమందిరం ఉత్సవ కమిటీని చూపించి ఉమ్మడి ఒప్పందం రాయించారు. దానిపై సంతకాలు చేయాలంటూ బైరవానిపేట దళితులను ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అయితే లీజు ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఏటా రామమందిర ఉత్సవాలకు రూ.20 వేలు మాత్రమే ఇస్తామని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. బైరివానిపేటకు బచ్చీస్ చెరువుపై ఎటువంటి హక్కు లేదని, అది పూర్తిగా సీపన్నాయుడుపేటకే సొంతమని కూడా నమోదు చేయించారు. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన బైరవానిపేట గ్రామస్తులు అదే విషయంపై సీపన్నాయుడుపేట పెద్దలతో చర్చించేందుకు ఆదివారం వెళ్లారు. చెరువు ఆదాయంలో సగం వాటా కావాలని ఒత్తిడి తెచ్చినప్పటికీ కుదరదంటూ సీపన్నాయుడుపేట పెద్దలు తోసిపుచ్చారు. దీంతో బైరివానిపేట వాసులు చెరువు వద్దకు చేరుకుని తమకు సమాన వాటా ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తామని నినాదాలు చేశారు.










Comments