top of page

చెరువులకు ‘గర్భ’శోకం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jan 6
  • 2 min read
  • ఇళ్ల స్థలాల కోసం కుళ్లబొడుస్తున్న అక్రమార్కులు

  • ఆ జాబితాలో చేరిన జగన్నాథసాగరం

  • రెండు దశాబ్దాల క్రితం రాజకీయ నేత కన్ను

  • ఇప్పటికే 16 ఎకరాలు ఆక్రమణపాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జనాభా పెరుగుతున్న కొద్దీ పట్టణాలు, నగరాలు జనావాసాలతో కిక్కిరిసిపోతున్నాయి. శివారు ప్రాంతాలతోపాటు ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అక్కడ నిర్మాణాలు సాగిస్తూ పట్టణాలను కాంక్రీట్‌ జంగిల్స్‌గా మార్చేస్తున్నారు. కొత్తగా వెలుస్తున్న ఇళ్లు, భవనాలను కొనుగోలు చేసి, అన్ని అనుమతులతో రాజమార్గంలో నిర్మిస్తే ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇళ్లస్థలాలకు డిమాండ్‌ అధికంగా ఉండటంతో అక్రమార్కులు దాన్నే ఆదాయ వనరుగా మార్చేసుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాలతోపాటు సామాజిక అవసరాలకు ఎప్పుడో నిర్మించిన చెరువులు తదితర వనరులను సైతం కబ్జా చేసి స్వయంగా నిర్మాణాలు చేపట్టడమో.. లేఅవుట్లు వేసి అమ్మేసుకోవడమో చేస్తున్నారు. ఫలితంగా చెరువులు కనుగరుగై వాతావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. పలాస`కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఇదే దుస్థితి నెలకొంది. ఆ మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు జాడ లేకుండా పోతున్నాయి. పలువురు చెరువులను ఆక్రమించి పూడ్చేసి ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. వందల ఎకరాల్లో విస్తరించిన చెరువులన్నీ క్రమేణా అక్రమార్కుల చేతిల్లోకి వెళ్లిపోయాయి. అధికారంలో ఉన్న పార్టీలతో అంటకాగుతూ నాయకులుగా చెలామణీ అవుతున్నవారే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. కానీ ఎవరూ ఈ ఆక్రమాలను ప్రశ్నించే సాహసం చేయడం లేదు. అక్రమార్కులకు రాజకీయ అండదండలు ఉండటమే దీనికి కారణం. అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లతోనో, ముడుపులు ముట్టడం వల్లో ఆక్రమణల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో ఆక్రమణల జాబితాలో జగన్నాథ సాగరం కూడా చేరిపోయింది.

2002లోనే బీజం

పూర్వం ఎప్పుడో తర్లాకోట జమీందార్లు పలాస`కాశీబుగ్గ ప్రాంత ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చడానికి వీలుగా సుమారు 59 ఎకరాల విస్తీర్ణంలో జగన్నాథ సాగరం పేరుతో చెరువును తవ్వించారు. తమ పాలిట కల్పతరువుగా భావించే స్థానికులు దీన్ని పెద్ద చెరువుగా వ్యవహరిస్తుంటారు. పలాస రెవెన్యూ పరిధి సర్వే నెం.113లో 59 ఎకరాల్లో ఉన్న జగన్నాథసాగరం పల్లె వీధి నుంచి పొందర వీధి వరకు విస్తరించి ఉంది. దశాబ్దాలుగా స్థానికుల అవసరాలు తీరుస్తున్న ఈ చెరువులో సుమారు 16 ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. 2002లోనే ఆక్రమణలకు బీజం పడిరది. ఒక రాజకీయ నాయకుడు తొలుత చెరువు పక్కనే 40 సెంట్ల భూమి కొనుగోలు చేశాడు. దాన్ని చూపించి మెల్లగా చెరువు గర్భంలోకి చొరబడి కొంతమేరకు కబ్జా చేసి లే అవుట్‌ వేశాడు. 2014లో దాన్ని స్థానికంగా ఒక వ్యక్తికి అంటగట్టాడు. అయితే కొంతకాలానికి సదరు వ్యక్తి మృతి చెందడంతో ఆ లే`అవుట్‌ను సదరు రాజకీయ నాయకుడే తిరిగి స్వాధీనం చేసుకొని ఇటీవలే సంతోష్‌, సాహు అనే వ్యక్తులకు విక్రయించాడు. కొనుగోలు దారులు గత కొంత కాలంగా నగరంలో చెత్తను, డెబ్రిష్‌ను రాత్రి సమయాల్లో ట్రాకర్లతో తరలించి సుమారు 20 మీటర్ల మేర చెరువు గర్భంలో డంపింగ్‌ చేస్తున్నారు. వీరు చెత్తను డంపింగ్‌ చేస్తున్న చోటే జంట పట్టణాల ప్రజలకు చెరువు నుంచి తాగునీటిని సరఫరా చేసే పంప్‌హౌస్‌ ఉంది. చెరువులో చెత్త, మట్టి వేసి తాగు నీటిని కలుషితం చేస్తున్నా రెవెన్యూ, పురపాలక అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.

ఏ ప్రభుత్వమున్నా ఆక్రమణలు మామూలే

ప్రభుత్వాలు మారినా నాయకుల తీరు మాత్రం మారలేదని చెప్పడానికి జంట పట్టణాల్లో ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణలే నిదర్శనం. అనుమతి లేకుండా కంకర, మట్టిని తవ్వి అనేకమంది రూ.కోట్లు కూడబెట్టుకుంటున్నారు. విచ్చలవిడిగా సహజవనరుల దోపిడీ సాగుతున్నా స్పందించే అధికారులు లేరు. అధికార, విపక్ష పార్టీలు భూ ఆక్రమణలు మినహా ఇతర అంశాలపై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు ఆక్రమణకు పాల్పడటం సర్వసాధారణం అయ్యింది. 2014`19 మధ్య టీడీపీ హయాంలో ప్రభుత్వ, దేవదాయ భూములతో పాటు చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. 2019`24 మధ్య వైకాపా హయాంలో అంతకు మించి భూదోపిడీ సాగింది. ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వంలోనూ ఇవి కొనసాగుతున్నాయి. జగన్నాథసాగరం ఆక్రమణలే దీనికి నిదర్శనం. కొన్నేళ్ల క్రితం వరకు సాగరం గట్టును రహదారిగా స్థానికులు వినియోగించేవారు. ప్రస్తుతం ఆ రహదారి కూడా లే అవుట్‌గా మారిపోయింది. సాగరం చుట్టుపక్కల అనధికార లే అవుట్లు వేసి విక్రయిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. దానికి సమీపంలో పంటపొలాలను కొనుగోలు చేసి దానికి అనుకుని ఉన్న చెరువును మట్టితో చదును చేసి కొనుగోలు చేసిన జిరాయితీ భూమిగా చూపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page