top of page

చాలా పద్ధతిగా.. చేస్తున్నారు దగా!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 20 hours ago
  • 3 min read
  • దోపిడీకి గురవుతున్న వరి రైతులు

  • నాసిరకం సాకుతో 4.3 కేజీల ఎక్కువ డిమాండ్‌

  • మరోవైపు చెల్లింపుల్లోనూ అదే కారణంతో కోత

  • కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో జరగని సేకరణ

  • అదే అదనపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లు

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో అధికారులు, మిల్లర్లు, దళారులు కలిసి ఒక పద్ధతి ప్రకారం వరి రైతులను దగా చేస్తున్నారు. 80 కేజీల బస్తా వద్ద 4.3 కేజీల ధాన్యాన్ని అదనంగా తూస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆరు నుంచి ఎనిమిది కేజీల ధాన్యం అదనంగా తూకం వేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ధాన్యం తీసుకెళ్లమంటావా, కల్లంలోనే ఉంచుకుంటావా అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. ఇక్కడ సేకరించే ధాన్యం నుంచి బియ్యం దిగుబడి తగ్గి నూకలు శాతం పెరుగుతుందని, అందువల్లే నాలుగు కేజీలు అదనంగా తీసుకుంటున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం బియ్యం సరఫరా చేయాలంటే ఇలా తీసుకోక తప్పదంటున్నారు. పోనీ అదనంగా తీసుకుంటున్నా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర మాత్రం చెల్లించడం లేదు. పంటను మొదట్లోనే రైతులు కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తే కొంత ప్రతిఫలం లభిస్తుంది. అలా కాకుండా జనవరిలో విక్రయించేవారికి మాత్రం కొంత ఇబ్బంది ఉంటుందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. అపరాల సాగు కోసం వరి పంటను కోసి ఫిబ్రవరిలో నూర్పులు చేయడం మన జిలాల్లో అనవాయితీ. మరికొందరు పండుగ ఖర్చులకు అక్కరకు వచ్చేలా సంక్రాంతి ముందు నూర్పులు చేసి విక్రయిస్తుంటారు. ఆ సమయానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ పూర్తయితే కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించడానికి అవకాశం ఉండదు. అటువంటప్పుడు మిల్లరు డిమాండ్‌ చేసిన ధరకు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది జిల్లావ్యాప్తంగా రైతులు ఆలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారని అంటున్నారు. గోనె సంచిని రైతు రూ.11కు కొనుగోలు చేస్తే, ప్రభుత్వం రూ.5 మాత్రమే చెల్లిస్తోంది. గతంలో వీటిని ప్రభుత్వమే సరఫరా చేసేది. ఇప్పుడు నిలిపివేయడం వల్ల రైతులు ఒక గోనె సంచికి రూ.6 నష్టపోతున్నారు.

వారికి ముడుపులు.. వీరికి ఏడుపులు

అధికారుల లెక్కల ప్రకారం 80 కేజీల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే 48 కేజీల బియ్యం, 5 కేజీల ఊక, 11 కేజీల తౌడు, 2 కేజీల చిగురు తౌడు, 12 కేజీల నూకలు, 2 కేజీల జీర (రంగుమారిన) బియ్యం వస్తాయి. ఇందులో బియ్యం కేజీ రూ.39 రేటుతో ప్రభుత్వానికి పీడీఎస్‌ రూపంలో సరఫరా చేస్తారు. ఊక కేజీ 40 పైసలు, తౌడు కేజీ రూ.30, చిగురు తౌడు కేజీ రూ.20, నూకలు కేజీ రూ.40, జీర బియ్యం రూ.30 ధరకు మిల్లర్లు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈ లెక్కన 80 కేజీల బస్తాకు మిల్లరుకు 2,884 గిట్టుబాటు అవుతుంది. అన్ని ఖర్చులు పోనూ మిల్లరుకు ఒక బస్తాకు నికరంగా రూ.2,700 వస్తుంది. రైతుల వద్ద మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు బియ్యం ఇవ్వడానికి రకరకాల కారణాలు చెబుతూ అదనంగా నాలుగు కేజీలు చొప్పున లాగేస్తున్నారు. దీనివల్ల మిల్లరుకు వచ్చే ఆదాయం రూ.114. ఈ మొత్తంతో మిల్లింగ్‌ ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం నుంచి అదనపు ఆదాయం, మిల్లింగ్‌ రాయితీలను మిల్లర్లు పొందుతున్నారు. ఈ ప్రక్రియలో రాజకీయ నాయకులు, అధికారులకు పెద్ద మొత్తాల్లో ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే తంతు తప్పదని మిల్లర్లే చెబుతున్నారు. మిల్లర్లు చెప్పినట్టు ప్రజాప్రతినిధులు, అధికారులు నడుచుకుంటారు. కాగా ధాన్యం సేకరణ ప్రక్రియలో అధికారులు కేవలం పాత్రధారులేనని నడిపించేదంతా ప్రభుత్వ పెద్దలేనన్నది బహిరంగ రహస్యం.

ధరలోనూ కోత

కేంద్రం క్వింటాలు గ్రేడ్‌`1 బియ్యానికి రూ.2,389, సాధారణ రకానికి (గ్రేడ్‌`2) రూ.2,369 మద్దతు ధర నిర్ణయించింది. ఆ ప్రకారం 80 కేజీల బస్తాకు రూ.1912 చెల్లించాలి. కానీ మిల్లర్లు రూ.1700 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిసింది. జిల్లాలో 406 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. పంట చేతి కొచ్చి విక్రయానికి సిద్ధంగా ఉన్నా కొన్నిచోట్ల కొనుగోళ్లు జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో దళారుల ప్రమేయం తగ్గించడానికి సాంకేతికతను వినియోగిస్తున్నా తరచూ సమస్యలు తలెత్తుతుండటంతో కొనుగోళ్లు టార్గెట్‌ మేరకు జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు మిల్లుల్లో ధాన్యాన్ని తరలిస్తుండగా 80 కేజీల బస్తాకు అదనంగా 4 కేజీలు ఇస్తే తప్ప వాటిని తమ వద్ద అన్‌లోడ్‌ చేయడానికి అనుమతించేది లేదని మిల్లుర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో ట్రాక్టర్ల డ్రైవర్లు బస్తా 84 కేజీలు ఉంటేనే తాము మిల్లుకు తరలిస్తామని, లేదంటే తమకు గిట్టుబాటు కాదని చెబుతున్నారు. దీంతో రైతులు ఈ ఒత్తిళ్లకు తలొగ్గి నష్టపోక తప్పడంలేదు.

మిల్లర్ల దొడ్డిదారి దందాలు

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 3.8 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా 10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇందులో 6.5 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. జిల్లాలో 264 మిల్లులు ఉంటే, 250 మిల్లులకు మాత్రమే బ్యాంకు గ్యారెంటీలు తీసుకొని సీఎంఆర్‌ పద్ధతిలో ధాన్యం అప్పగించాలని నిర్ణయించింది. ధాన్యం రవాణా చేసే వాహనాలకు ట్రక్‌ షీట్స్‌ జనరేట్‌ చేయడంలోనూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని జియో కో`ఆర్డినేట్స్‌కు, జీపీఎస్‌కు మ్యాచ్‌ కాకపోవడం వల్ల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని మిల్లర్లు రైతుల నుంచి దళారుల ద్వారా దొడ్డిదారిలో ధాన్యం తరలించుకుపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకముందే పంట చేతి కొచ్చిన రైతుల నుంచి ధాన్యాన్ని మిల్లర్లు తరలించుకు పోయినట్లు జలుమూరు, సారవకోట మండలాల్లో అధికారులు జరిపిన తనిఖీల్లో వెల్లడైంది. బ్యాంకు గ్యారెంటీలు తీసుకోకుండానే మిల్లులకు ధాన్యం తరలించుకుపోయినట్టు గుర్తించినా రాజకీయ నాయకులు ఒత్తిడితో ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 71,110 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు చేర్చారు. దీనికి రూ.139.14 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ. 79.04 కోట్ల చెల్లింపులే జరిగాయి. మిగతా రూ. 59.41 కోట్లకు సంబంధించి ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేసినట్టు పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం దశల వారీగా ధాన్యం కొనుగోళ్లు తగ్గిస్తున్నదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదంటున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page