top of page

చేసిన పాపాలే.. పాక్‌ను వెంటాడుతున్నాయ్‌!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 13, 2025
  • 2 min read

పాలు పోసి పెంచినంత మాత్రాన పాము తన యజమాని అన్న అభిమానంతో కాటు వేయకుండా ఉంటుందా? ఎంతమాత్రం కాదు.. ఇప్పుడు మన దాయాది పాకిస్తాన్‌ విషయంలో అదే జరుగుతోంది. మనదేశంపై కక్షతో లష్కరే, జైషే వంటి ఉగ్రమూకలను పెంచి ఉసిగొల్పినట్లే.. మరోవైపు సరిహద్దు దేశమైన ఆఫ్ఘనీస్తాన్‌లో అశాంతి రాజేసేందుకు తెహ్రీక్‌ ఏ తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ), తెహ్రీక్‌ ఏ లబ్బాయిక్‌ పాకిస్తాన్‌ (టీఎల్‌పీ) అనే ఉగ్రవాద సంస్థలను పాలు పోసి పెంచింది. ఇప్పుడు ఆ తెహ్రీక్‌ సంస్థలే పాక్‌ పాలిట భస్మాసుర హస్తంలా మారాయి. ఇప్పటికే తాలిబన్‌ పాకిస్తాన్‌ తీవ్రవాదులు ఆఫ్టన్‌ సరిహద్దులోని పాక్‌ భూభాగంలో చాలా కాలం నుంచి విధ్వంసక చర్యలకు పాల్పడుతూ పాక్‌ సైన్యానికి, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇదే కారణంతో ఇటీవల పాక్‌ సైన్యం ఆఫ్ఘనీస్తాన్‌లోని కాబుల్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న టీటీపీ శిబిరాలపై వాయుసేన ఆధ్వర్యంలో దాడులు చేయడం, తమ భూభూగంలోకి చొరబడినందుకు ప్రతిగా ఆఫ్ఘన్‌ దళాలు సరిహద్దుల్లోని పాక్‌ సైనిక పోస్టులపై విరుచుకుపడి భారీ నష్టం వాటిల్లజేశాయి. ఇదే తరుణంలో పాకిస్తాన్‌ గడ్డపై కీలక నగరాల్లో హింస పెచ్చరిల్లుతోంది. లాహోర్‌లో తాజాగా జరిగిన హింసాత్మక ఘర్షణల వెనుక ఒకప్పుడు పాక్‌ సైన్యానికి ప్రీతిపాత్రంగా ఉన్న తెహ్రీక్‌ ఎ లబ్బాయిక్‌ పాకిస్తాన్‌ అనే సంస్థ హస్తం ఉన్నట్లు పాక్‌ నిఘా వర్గాలు నిర్థారించాయి. ఈ ఉగ్ర సంస్థను స్వయంగా పాక్‌ సైన్యమే పెంచి పోషించింది. దేశంలో ప్రజా ప్రభుత్వాలను అణచివేయడానికి వీధి దళాలను సృష్టించడం టీఎల్‌పీ లక్ష్యం. కానీ ఇప్పుడు సైన్యం పాలు పోసి పెంచిన ఆ ఉగ్ర పామే పాకిస్తాన్‌ను కాటు వేయడం ప్రారంభించింది. లండన్‌కు చెందిన పాకిస్తానీ మానవహక్కుల కార్యకర్త ఆరిఫ్‌ అజాకియా మాట్లాడుతూ ‘లష్కరే తోయిబా లాగే టీఎల్‌పీ కూడా పాక్‌ సైన్యం సృష్టించిన సంస్థ అని వ్యాఖ్యానించారు. ఈ ఉగ్రసంస్థను స్వదేశంలో అంతర్గత రాజకీయాలను తారుమారు చేసి ఆధిపత్యం సాధించడానికి దీన్ని సృష్టించిందని చెప్పారు. తెహ్రీక్‌ ఏ లబ్బాయిక్‌ అనేది ఉర్దూ పదం. తెహ్రీక్‌ అంటే ఉద్యమం, లబ్బాయిక్‌ అంటే ‘నేను ఉన్నాను’ అని అర్థం. ఏకు మేకైనట్లు ఇప్పుడు ఆ సంస్థే పాకిస్తాన్‌కు తలనొప్పిగా మారిందని అభివర్ణించారు. అందుకు తగినట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం లాహోర్‌లో తెహ్రీక్‌ ఏ లబ్బాయిక్‌ పాకిస్తాన్‌ (టీఎల్‌పీ) ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. వేలాది ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొని ఇస్లామాబాద్‌ వైపు కవాతు చేశారు. ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘర్షణల కారణంగా 11 మంది తమ మద్దతుదారులు మరణించారని టీఎల్‌పీ వ్యవస్థాపకుడు ఖాదిమ్‌ హుస్సేన్‌ రిజ్వీ వెల్లడిరచారు. 2015లో ఈ సంస్థ పురుడుపోసుకుంది. అప్పటినుంచే తన కార్యకలాపాలతో పాకిస్తాన్‌ను పదే పదే ఇబ్బందులకు గురిచేస్తూ వస్తోంది. 2017లో ఏకంగా 21 రోజులపాటు ఇస్లామాబాద్‌ను ముట్టడిరచింది. విచిత్రమేమిటంటే ఈ సంస్థ ఇబ్బంది పెట్టినప్పుడల్లా పాక్‌ సైన్యమే మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 2017లో నిరసనలు జరిగిన సమయంలో ఒక సీనియర్‌ సైనికాధికారి టీఎల్‌పీ నిరసనకారులకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఆ ఉద్యమం కారణంగా అప్పటి న్యాయశాఖ మంత్రి జాహిద్‌ హమీద్‌ రాజీనామా చేయవలసి వచ్చింది. 2021లో అధికారంలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం టీఎల్‌పీ చీఫ్‌ సాద్‌ రిజ్వీని ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జైలులో పెట్టింది. దానికి నిరసనగా వేలాది మంది టీఎల్‌పీ మద్దతుదారులు లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్‌ వరకు ‘లాంగ్‌ మార్చ్‌’ నిర్వహించారు. ఆ సందర్భంగా తలెత్తిన హింసలో పదిమంది పోలీసులతో సహా 20 మందికి పైగా మరణించారు. చివరికి పాక్‌ సైన్యం మధ్యవర్తిత్వంతో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం టీఎల్‌పీతో చర్చలు జరిపి రహస్య ఒప్పందం కుదుర్చుకుందనే వార్తలు వచ్చాయి. ఆ ఒప్పందం మేరకు సాద్‌ రిజ్వీతోపాటు రెండు వేలమందికి పైగా టీఎల్‌పీ కార్యకర్తలను జైళ్ల నుంచి విడుదల చేశారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆన్‌ గ్లోబల్‌ రిలేషన్స్‌ నివేదిక ప్రకారం.. 2018 లో జరిగిన పాకిస్తాన్‌ జాతీయ ఎన్నికల్లో పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌(పీఎంఎల్‌`ఎన్‌)ను బలహీనపరిచి ఇమ్రాన్‌ఖాన్‌కు మార్గం సుగమం చేయడానికి టీఎల్‌పీని వాడుకున్నారు. ఆ క్రమంలో ఐఎస్‌ఐ ఆదేశానుసారం టీఎల్‌పీ పని చేసిందని నివేదికలు స్పష్టం చేశాయి. ఇది ‘ఖాతమ్‌-ఎ-నుబువ్వత్‌’ వంటి భావోద్వేగ అంశాలను ఉపయోగించుకుంటుంది. మతపరమైన భావోద్వేగాలను ఆయుధంగా ఉపయోగించే సంప్రదాయం పాకిస్తాన్‌కు కొత్త కాదు. భారతదేశానికి వ్యతిరేకంగా కూడా దీన్నే ఉపయోగించారు. ఆ సమయంలో టీఎల్‌పీ తన శక్తిని తెలుసుకుంది. దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకుంది. టీఎల్‌పీ తీరు గురించి పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన మానవహక్కుల కార్యకర్త అమ్జద్‌ అయూబ్‌ మీర్జా మాట్లాడుతూ ‘ఈ రోజు మనం చూస్తున్న గందరగోళం దశాబ్దాలుగా మతాన్ని ఆయుధంగా మార్చడం వల్ల వచ్చిన అనివార్య ఫలితం’ అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. పాకిస్తాన్‌ ఇప్పుడు తన సొంత వైరుధ్యాల బరువుతో కూలిపోతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్‌లో సైన్యమే తెరపైనా, తెర వెనుకా అధికారం చెలాయిస్తోంది. పలుమార్లు ప్రజా ప్రభుత్వాలను కూలగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అధికారాన్ని కాపాడుకునేందుకే పౌర ప్రభుత్వాలపైకి ప్రయోగించడానికి టీఎల్‌పీని సృష్టించింది. ఇప్పుడదే దేశం మొత్తాన్ని అస్థిరపరుస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page