జీఎస్టీ తగ్గింపు లాభం మనకు దక్కదా?
- DV RAMANA

- Sep 6, 2025
- 2 min read

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం సంస్కరించింది. కొన్ని రకాల వస్తువులు, సేవలపై చాలా ఎక్కువ పన్ను పిండుతున్నారన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఆ మేరకు కసరత్తు చేసింది. దసరా, దీపావళి కానుకగా జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలోనే ప్రకటించారు. ఆ మేరకు కొద్దిరోజుల క్రితం సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్ ప్రస్తుతం ఉన్న నాలుగు పన్ను శ్లాబులను రెండుకు కుదించింది. 12 శాతం, 28 శాతం శ్లాబులను తొలగించి.. 5 శాతం, 12 శాతం శ్లాబులను కొనసాగించాలని నిర్ణయించింది. వీటికి అదనంగా కొత్తగా 40 శాతం శ్లాబు తీసుకొచ్చినా అది సిగరెట్లు, గుట్కా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తులకే పరిమితం. వ్యక్తిగత, ఆరోగ్య బీమా వంటి కొన్ని కీలకమైన సేవలను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిత్యావసరాలు, మందు లు, ద్విచక్ర వాహనాలు, కొన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ జీఎస్టీ పరిధిలోకి రావడం వల్ల వాటి ధరలు తగ్గుతాయని సామాన్య ప్రజలు సంబరపడుతున్నారు. అయితే జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే లాభాన్ని అంతిమ లబ్ధిదారు అయిన వినియోగదారులకు అందకుండా చేసేందుకు ఉత్పత్తిదా రులు, కార్పొరేట్ శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాలు కూడా ఈ అనుమానాలనే బలపరుస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ వర్గాలు చేస్తున్న ప్రకట నలు, కొన్ని వస్తువుల ధరలు జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాతే అమాంతం పెరగడం వంటివి మార్కెట్ శక్తుల మాయాజాలంగా కనిపిస్తున్నాయి. ఇంతవరకు 28 శాతం జీఎస్టీ శ్లాబులో ఉన్న సిమెంటును అక్కడి నుంచి తప్పించి 18 శాతం శ్లాబులో చేర్చారు. దీని వల్ల ప్రతి సిమెంట్ బస్తాపై 10 శాతం పన్ను రేటు తగ్గడంతో ఇళ్లు నిర్మించుకునే ప్రజలకు బాగా కలిసివస్తుంది. ఈ నిర్ణయం వల్ల నిర్మాణరంగం కూడా జోరందుకుంటుందని సర్కారు భావించింది. అయితే జీఎస్టీ తగ్గినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ సిమెంట్ రేట్లు తగ్గించేది లేదని ఫ్యాక్టరీల యజమాన్యా లు ఇప్పటికే ప్రకటించాయి. హెల్త్ పాలసీలు, వాహనాల రేట్ల విషయంలోనూ ఇదే వ్యూహం అను సరించాలని ఆయా కంపెనీలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీల ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గితే జీఎస్టీ సంస్కరణల ఫలితం సామాన్య వినియోగదారులకు దక్కదు. దీనికితోడు శ్లాబుల మార్పుపై అనేక కంపెనీలకు ముందే సమాచారం లీక్ కావడంతో అధికారికంగా ప్రకటించేలోపు తమ ఉత్పత్తుల రేట్లను గత ఆరు నెలల్లో పెంచేశాయి. అందువల్ల తద్వారా జీఎస్టీ తగ్గినా ఆమేరకు తమ వస్తువుల ధరల్లో మార్పు లేకుండా చూసుకుంటున్నారని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గతంలోనూ చాలా వస్తువులపై జీఎస్టీ తగ్గించినప్పటికీ వినియోగదారులకు పెద్దగా లాభం చేకూర లేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందనే ఆందోళనలున్నాయి. ప్రభుత్వం జీఎస్టీ శ్లాబులను నాలుగు నుంచి రెండుకు కుదించనుందని, దీనివల్ల చాలా వస్తువుల రేట్లు తగ్గించాల్సి ఉంటుందన్న సమాచారం కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి కార్పొరేట్ వర్గాలకు ముందే లీకైనట్లు చెప్తున్నారు. దాంతో చాలా కంపెనీలు అప్రమత్తమై తమ ఉత్పత్తుల రేట్లు పెంచాయంటున్నారు. గత ఆరు నెలల్లో పలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది. ఉదాహరణకు పారాచ్యూట్ కొబ్బరినూనె 300 ఎంఎల్ డబ్బా ధర ఆరు నెలల క్రితం రూ.130 ఉంటే.. ఇప్పుడు అది రూ.190కి చేరింది. అంటే ఆరు నెలల్లోనే దాని ధర ఏకం గా రూ.60 పెరిగినట్లు! కార్ల పరిశ్రమలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. గతంలో చిన్న కార్లపై జీఎస్టీ రేట్లను ప్రభుత్వం తగ్గించినప్పుడు కొన్ని కార్ల తయారీ కంపెనీలు మాత్రం ధరలను తగ్గించలేదు. ఉత్పత్తి వ్యయం, డీలర్ కమీషన్లు, ఇతర పన్నులు వంటి అంశాలను దీనికి సాకుగా చూపించాయి. చివరికి జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన లాభం వినియోగదారులకు బదులుగా కమీషన్ రూపంలో డీలర్లకు లేదా కంపెనీ యాజమాన్యాల జేబుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో! ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పన్నులు తగ్గించాలని సర్కారు భావిస్తే.. కంపెనీల స్వార్థం ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందకుండా తన్నుకుపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.










Comments