top of page

జాతీయ రహదారుల డిజిటలైజేషన్‌

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 30, 2025
  • 2 min read

జాతీయ రహదారుల రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. డిజిటైలేజేషన్‌ దిశగా పరుగులు తీస్తున్నాయి. కేంద్ర ఉపరితల రవాణా శాఖ పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్వహించే జాతీయ రహదారులను ఒకవైపు జోరుగా విస్తరణకు నోచుకుంటున్నాయి. మరోవైపు దేశంలోనే అనేక రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడం, నాలుగు, ఆరు లైన్లకు విస్తరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అదే సమయంలో ఈ రహదారుల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికను జోడిస్తూ వాహన యజమానులకు వీలైనన్ని ఎక్కువ సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. దేశంలో తొలిసారి వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో బోవోటీ (బిల్డ్‌, ఓన్‌, ట్రాన్స్‌ఫర్‌) విధానం లో గోల్డెన్‌ క్వాడ్రిలేటర్‌ ప్రాజెక్టు చేపట్టారు. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢల్లీి, కోల్‌కతా, చెన్నై నగరాలను అనుసంధానించే నాలుగు జాతీయ రహదారులను ఈ పథకం కింద నాలుగు లైన్లకు విస్తరించారు. వీటి నిర్మాణ ఖర్చులు రాబట్టుకునేందుకు ఈ రహదారుల్లో టోల్‌ ప్లాజాలు ఏర్పాటు చేసి ఫీజు వసూలు చేయడం మొదలుపెట్టారు. నిర్మాణ ఖర్చులు తిరిగి వచ్చేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో టోల్‌ ప్లాజాలను ఎత్తివేయాలన్నది నిబంధన. అయితే అప్పటి నుంచి జాతీయ రహదారులపై టోల్‌ వసూళ్లు కొనసాగుతున్నాయి. తొలినాళ్లలో మాన్యువల్‌గా టోల్‌ప్లాజాల వద్ద వాహనాలను ఆపి డబ్బులు కట్టించుకునేవారు. తర్వాత ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి వచ్చింది. అనంతరం ఫాస్ట్‌ట్యాగ్‌ విధానం తీసుకొచ్చి ఆటోమేటిక్‌గా టోల్‌ కట్టే సౌకర్యం కల్పించారు. ఇటీవలే ఏడాదికి రూ.మూడు వేలు చెల్లిస్తే 200 ట్రిపుల వరకు ఇక టోల్‌ కట్టక్కర్లేని వెసులుబాటు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు పూర్తిగా హైవే వ్యవస్థను డిజిటలైజ్‌ చేసేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ చర్యలు చేపట్టింది. జాతీయ రహదారులపై ప్రయాణ సమయంలో ట్రాఫిక్‌ అతిక్రమణతోపాటు ఇతర రోడ్డు రవాణా నిబంధనలను ఉల్లంఘించే వారిని ఆధునిక సాంకేతికత సాయంతో పట్టుకుని రోడ్డు ప్రమాదాలను నివారించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నంలో తొలి అడుగుగా.. ప్రయోగాత్మకంగా ఢల్లీి`గురుగ్రామ్‌ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వేపై అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏటీఎంఎస్‌)ను అమల్లోకి తీసుకొచ్చారు. దాంతో దేశంలోనే తొలి స్మార్ట్‌ డిజిటల్‌ హైవేగా ఈ రహదారి గుర్తింపు పొందింది. ఎన్‌హెచ్‌ఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండియన్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. 56.46 కిలోమీటర్ల నిడివి ఉన్న ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, ఎన్‌హెచ్‌`48 రూట్లపై ఈ టెక్నాలజీని విజయవంతంగా అమలు చేశారు. ఇందులో భాగంగా 28 కిలోమీటర్ల ప్రాంతాన్ని అధునాతన నిఘా వ్యవస్థతో సమీకరించారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ మానిటరింగ్‌, ప్రమాదాల నివారణ, వేగ పరిమితి నియంత్రణ వంటి అంశాల్లో ఇది కీలకంగా మారనుంది. ఈ స్మార్ట్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో భాగంగా, సీటు బెల్ట్‌ లేకుండా డ్రైవ్‌ చేయడం, ట్రిపుల్‌ రైడిరగ్‌, పరిమితి మించిన వేగం వంటి 14 రకాల నిబంధనల ఉల్లంఘనలను ఈ ఆధునిక వ్యవస్థ ఎటువంటి మానవ సహాయం లేకుండానే గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని తక్షణమే నేరుగా పోలీసులకు పంపేలా, ఎన్‌ఐసీ ఈ`చలాన్‌ పోర్టల్‌తో అనుసంధానం చేశారు. వాహనాలపై నిఘా కోసం జాతీయ రహదారి వెంబడి ప్రతి కిలోమీటర్‌కు ఒకటి చొప్పున, మొత్తం 110 హై రిజల్యూషన్‌ పీటీజెడ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలూ పని చేస్తూ రహదారిపై పరుగులు తీసే వాహనాలను తమ నిఘా కళ్లతో పరిశీలిస్తుంటాయి. ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం, ప్రమాద ఘటనలను వీడియోల్లో బంధించడం, వాహనాల వేగాన్ని గుర్తించి నమోదు చేయడం, సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌కు నిరంతరం సమాచారాన్ని చేరవేయడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనిలోని కమాండ్‌ సెంటర్‌ను డిజిటల్‌ బ్రెయిన్‌ మాదిరిగా తీర్చిదిద్దారు. రహదారిపై ఏదైనా ప్రమాదం సంభవించిన వెంటనే ఆ విషయాన్ని ఈ డిజిటల్‌ బ్రెయిన్‌ సమీప ంలోని రహదారి భద్రత సిబ్బందికి అలర్ట్‌ మెసేజ్‌ పంపుతుంది. పొగమంచు, రహదారి అవాంతరాలు, జంతువుల ప్రవేశం వంటి విపత్తులను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. మొత్తం మీద భారత రహదారులు మరింత ఆధునికత, భద్రత, డిజిటలైజేషన్‌ వైపు దూసుకు పోతున్నాయి. ఢల్లీి-గురుగ్రామ్‌ హైవేపై అమలు చేసిన ఈ స్మార్ట్‌ వ్యవస్థ విజయవంతం కావడంతో దేశంలోని అన్ని నేషనల్‌ హైవేలను ఈ వ్యవస్థ పరిధిలోకి తీసుకురానున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page