top of page

జిల్లాకే పెద్దన్న.. దాసన్న

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 7
  • 3 min read
  • నాడు కుటుంబానికి అన్నగా పూర్తి న్యాయం

  • సోదరుడి రాజకీయ ఉన్నతికి బాటలు

  • పార్టీకి, అధినేతలకు అపర విధేయుడిగా ముద్ర

  • అధికారంలో ఉండగా ఎన్నో అభివృద్ధి పనులు

  • కష్టకాలంలో పార్టీని నడిపించే నేతగా గుర్తింపు

ree

జిల్లా రాజకీయాల్లో ఆయనదో ప్రత్యేక స్థానం. ప్రత్యుర్థులు కూడా అన్నా అని సంబోధించి ఆప్యాయత కనబరిచేలా చేసే వ్యక్తిత్వం ఆయన సొంతం. పార్టీపరంగా ఎన్ని విభేదాలు ఉన్నా.. వ్యక్తిగతంగా ఎవరి జోలికి పోని నికార్సయిన రాజకీయవేత్త, అజాత శత్రువు. అన్నా.. అని పిలిస్తే చాలు మురిసిపోయి కావలసింది చేసే పెట్టే బోళాతనం ఆయన సొంతం. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నానుడి. దాన్ని నూటికి నూరుపాళ్లు సార్థకం చేసిన నాయకుడు ధర్మాన కృష్ణదాస్‌. తొలుత తన కుటుంబాన్ని తండ్రిలా, పెద్దన్నలా నడిపిన ఆయన.. తర్వాత గ్రామ రాజకీయాల నుంచి జిల్లా రాజకీయాల వరకు కూడా అదే పాత్రను దిగ్జియంగా పోషించారు.. ఇప్పటికీ పోషిస్తున్నారు. విశ్వసనీయతకు, నమ్మకానికి కూడా మారుపేరుగా దాసన్న నిలుస్తున్నారు.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ree

పోలాకి మండలం మబగాంలో ధర్మాన రామలింగం నాయుడికి ఉన్నతస్థాయి కుటుంబం. రాజకీయంగానే కాకుండా సాహితీరంగంలోనూ మంచి పేరు, కళా పోషకులన్న ఖ్యాతి సొంతం చేసుకున్న రామలింగంనాయుడు, సావిత్రమ్మల సంతానంలో జ్యేష్టుడే (పెద్ద కుమారుడు) ధర్మాన కృష్ణదాస్‌. రామలింగంనాయుడు తదనంతరం ఇంటి పెద్దకుమారుడిగా, తన సోదరులకు అన్నగా తన బాధ్యతలు పరిపూర్ణంగా నిర్వహించారు. అన్న అనే పదంలోని ‘అ’ అంటే.. అమ్మ, ‘నా’ అంటే.. నాన్న అని అర్థం. ఆ రెండక్షరాలు, ఆ రెండు బంధాలు కలిస్తే అన్న. ఆ హోదాకు పూర్తి న్యాయం చేసిన వ్యక్తి ధర్మాన కృష్ణదాస్‌. కుటుంబాన్నే కాదు.. కుటుంబానికి ఉన్న పేరుప్రఖ్యాతులను కూడా కాపాడుకుంటూ వచ్చి.. తనకంటే చిన్నవారైనా సోదరులను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడంలో ఆయన చేసి శ్రమ, కృషి అసామాన్యం.

తమ్ముడి ఉన్నతికి ఒక్క మాటతో ఊతం

తొలినాళ్లలో కృష్ణదాస్‌ ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. అయితే స్వగ్రామం మబగాం రాజకీయాల్లో ఆయన కుటుంబం కీలకపాత్ర పోషించేది. అయితే తండ్రి మరణించడం, తాను ఉద్యోగం చేస్తున్న సమయంలో 1981లో టంగుటూరి అంజయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఇదే అదనుగా రామలింగం నాయుడు లేని ధర్మాన కుటంబంపై ఆధిపత్యం సాధించాలని అత్యాశకుపోయారు. కవ్వింపు రాజకీయాలకు తెరతీశారు. దమ్ముంటే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో తమపై పోటీ చేసి గెలవాలని వారు కృష్ణదాస్‌ను సవాల్‌ చేశారు. అయితే ‘నా వరకు ఎందుకు.. నా తమ్ముడిని నిలబెడతాను.. సత్తా ఉంటే గెలవండి చూద్దాం’ అంటూ కృష్ణదాస్‌ ప్రతి సవాల్‌ విసిరారు. అన్నట్లుగానే ఆ ఎన్నికల్లో తన సోదరుడు ధర్మాన ప్రసాదరావును ఎన్నికల బరిలోకి దించి, సర్పంచ్‌గా తొలి ప్రయత్నంలోనే గెలిపించి ప్రత్యర్థులను చిత్తు చేసిన ఘనత కృష్ణదాస్‌ది. ఆ విధంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా తమ్ముడి రాజకీయ ఉన్నతికి సోపానం వేశారు. అందుకు తగినట్లే ధర్మాన ప్రసాదరావు శరవేగంగా రాజకీయ పరమపద సోపానం అధిరోహించారు. 1985లోనే తొలిసారి ఎమ్మెల్యే టికెట్‌ అందుకున్న ఆయన ఆ ఎన్నికల్లో రెండువేల స్వల్పతేడాతో ఓడిపోయారు. అయితే 1987లో పోలాకి ఎంపీపీగా గెలిచారు. ఆ తర్వాత రెండేళ్లకే 1989 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండేళ్లకే 1991లో నేదురమల్లి జనార్ధనరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతు స్వీకరించారు. అలా జగన్‌తో సహా ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద పని చేసిన ఘనత సాధించారు. అంటే.. ధర్మాన ప్రసాదరావు రాజకీయ ఉన్నతికి ఆనాడు అన్న కృష్ణదాస్‌ చేసిన సవాల్‌, జరిపిన ప్రచార పోరాటమే పునాదిగా నిలిచాయని చెప్పడం అతిశయోక్తి కాబోదు.

నాడు వైఎస్‌.. నేడు జగన్‌

ఎంతో సౌమ్యుడు, అజాతశత్రువుగా, తనను నమ్మి గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయని నేతగా పేరు పొందిన కృష్ణదాస్‌ తాను నమ్మిన నాయకుల పట్ల కూడా అంతే విశ్వసనీయత, విధేయతతో మెలగుతున్నారు. 2004లో ధర్మాన ప్రసాదరావు నరసన్నపేట నుంచి శ్రీకాకుళం నియోజకవర్గానికి షిఫ్ట్‌ కావడంతో ఆ ఎన్నికల్లో కృష్ణదాస్‌కు నరసన్నపేట నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. ఆనాటి పీసీసీ అధ్యక్షుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సమయంలోనే ఆయనకు మద్దతుగా రాజకీయాల్లోకి వచ్చిన దాసన్న అక్కడి నుంచి వైఎస్‌కు అనుచరుడిగా మారిపోయారు. అదే ఆయన్ను నరసన్నపేట నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆ ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన 2009లో కూడా విజయం సాధించారు. అయితే వైఎస్‌ హఠాన్మరణం తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, వైఎస్‌ కుమారుడు జగన్‌ను కాంగ్రెస్‌ నాయకత్వం ఒంటరిగా వదిలేయడం చూసి దాసన్న తీవ్రంగా చలించిపోయారు. పార్టీపై ధిక్కార స్వరం వినిపించి, ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా త్యజించారు. జగన్‌ వెంట నడవడం ప్రారంభించిన ఆయన 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా జెండాతో పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఎన్నికల్లో మళ్లీ గెలిచిన కృష్ణదాస్‌పై పార్టీ అధినేత జగన్‌ కూడా నమ్మకం ఉంచి కీలకమైన రెవెన్యూ శాఖతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాకముందు చాన్నాళ్లు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన దాసన్న మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయి కష్టాలో పడిన ఈ సమయంలో కూడా జిల్లా పార్టీ పగ్గాలు చేతబట్టి పార్టీకి, అధినేతకు తాను విధేయుడినని నిరూపించుకున్నారు. అలాగే తనను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు కొమనాపల్లి`సరుబుజ్జిలితో సహా పలు వంతెనల పనులు పూర్తి చేయించి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచారు. ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించారు. కృష్ణదాస్‌ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాల విభజన జరిగింది. ఆ సమయంలో శ్రీకాకుళానికి పక్కనే ఉన్న పారిశ్రామిక ప్రాంతమైన ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం జిల్లాలో కలిసిపోతుందని శ్రీకాకుళం జిల్లా ప్రజలు భయపడ్డారు. కానీ వారి ఆకాంక్షలను సీఎం జగన్‌ వద్ద వినిపించి ఎచ్చెర్లను శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించడంలో దాసన్న విజయం సాధించారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page