జిల్లా ‘దేశం’కు అధ్యక్షుడు కావలెను!
- NVS PRASAD

- May 14
- 3 min read
జిల్లా అధ్యక్ష పదవిపై మోజు లేదంటున్న కలమట
బూత్ కమిటీలను చక్కదిద్ది డివిజన్ ఇన్‌ఛార్జిలను నియమిస్తున్న శంకర్
కోటబొమ్మాళి నియోజకవర్గానికి కావాలని అడిగే ధైర్యం చాలని అచ్చెన్న
అధ్యక్ష పదవి కాళింగులకా, కాపులకా?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, జిల్లాలో పార్టీ అధ్యక్షుడ్ని ఎన్నుకోవడం కోసం ఎప్పుడూ లేనంతగా కసరత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. త్వరలో జరగబోయే మహానాడు నాటికి అన్ని జిల్లాల్లోనూ పార్టీ అధ్యక్షులు నియమితులై ఉండాలన్న నిబంధన టీడీపీ విధించుకుంది. బుధవారం పాలిట్‌బ్యూరో సాయంత్రం జరుగుతున్న పాలిట్‌బ్యూరోలో కడపలో జరపనున్న మహానాడు కార్యక్రమం ఒక్కరోజు చేయాలా, మూడు రోజుల పాటు నిర్వహించాలా? అనే నిర్ణయం తీసుకోనున్నారు. సరిగ్గా ఆ సమయానికి వేదిక మీద జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండాలనేది ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం. 2019`24 మధ్య టీడీపీ అధికారంలో లేనప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూన రవికుమార్‌లు సమన్వయంతో పని చేశారు. దాని ఫలితంగానే జిల్లాలో వైకాపాను ఊడ్చేశారు. కానీ ఎన్నికల తర్వాతే అసలు చిక్కంతా వచ్చిపడిరది. కూన రవికుమార్‌కు రావాల్సిన మంత్రి పదవి రాత్రికి రాత్రి మారిపోవడం, కేంద్రమంత్రిగా రామ్మోహన్‌నాయుడుకు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఇప్పుడు జిల్లాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి స్థాయి ఉన్న నాయకుడు కరువైపోయాడు. గతం మాదిరిగా అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్షుడెవరైనా ఒకటేనన్న సిద్ధాంతాన్ని టీడీపీ పూర్తిగా పక్కన పెట్టింది. నామినేటెడ్ పదవుల్ని సైతం ఆచితూచి ఇస్తున్న తరుణంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రతీ రోజు కూర్చునే ఒక నాయకుడి కోసం వెతుకుతుంది. 2024 ఎన్నికలకు ముందు పాతపట్నం అసెంబ్లీ సీటును కలమట రమణకు ఇవ్వలేకపోవడం వల్ల ఆయన్ను పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన యాక్టివ్‌గా పని చేయలేకపోతున్నారని, ఆయన దృష్టంతా ఇప్పటికీ పాతపట్నం నియోజకవర్గం చుట్టే తిరుగుతుందని తేలిపోయింది. దీనికి తోడు ఆయన కూడా మరోసారి తనకు జిల్లా అధ్యక్షుడిగా పని చేయాలన్న ఆరాటం లేదని ఇప్పటికే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వద్ద తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెప్పుకుంటున్నారు. కలమట రమణ తప్పుకున్నా, లేదా తప్పించినా అది కాపుల స్థానమని పార్టీ భావిస్తే పలాస నియోజకవర్గం నుంచి పీరుకట్ల విశ్వప్రసాద్‌కు ఆ పదవి ఇవ్వాలని అక్కడి ఎమ్మెల్యే గౌతు శిరీష లోకేష్‌ను కోరే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. డీసీఎంఎస్ లేదా డీసీసీబీ అధ్యక్ష పోస్టుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని పీరుకట్ల కోసం శిరీష రికమండ్ చేశారు. కానీ ప్రభుత్వం ఆ మేరకు అవకాశం కల్పించలేకపోయింది. ఇక జిల్లాలో మిగిలింది. గ్రంథాలయ సంస్థ చైర్మనే. దాన్ని ఇంతకు క్రితమే పీరుకట్ల విఠల్ నిర్వహించి వున్నారు. ఈయన ప్రస్తుతం జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా. కాబట్టి జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.
పార్టీ ఆదేశిస్తే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధపడొచ్చు. కాకపోతే ఇక్కడ చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని ఏకగ్రీవంగా నిర్ణయించాల్సి ఉంది. బయటపడకపోయినా అచ్చెన్న, రవిల మధ్య కనబడని విభజన రేఖ ఒకటి ఉంది. ఇదే విషయం వారిని అడిగితే ఖండిరచొచ్చు గానీ, బేధాభిప్రాయాలు లేవని చెప్పడం అసాధ్యం. అందుకే రవికుమార్‌కు రాకుండా అచ్చెన్నాయుడు అడ్డుపడే అవకాశాలుంటాయి. పోనీ పార్టీ అధిష్టానమే ఫైనలని భావించినా లోకేష్ కూడా ఇందుకు ఓకే చేయాల్సివుంటుంది. కానీ ప్రస్తుతం కూన రవి పట్ల నారా లోకేష్ కాస్త కినుకు వహించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూన రవి సంధించిన మూడు ప్రశ్నలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయన్న భావన లోకేష్‌కు ఉందట. కానీ కూన రవి అడిగిన ప్రశ్నలు మాత్రం అధికారుల స్థాయిల్లో పరిష్కారం కాక తన నియోజకవర్గంలో మంటలు రేపుతున్న అంశాలే. ఏది ఏమైనా లైవ్ టెలీకాస్ట్ వచ్చే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నట్లు అనిపించే ప్రశ్నలు వేయకూడదనేది లోకేష్ భావన. కాబట్టి స్వపక్షంలో ప్రతిపక్షంగా నిలవకూడదని భావిస్తే కూన రవి అభ్యర్థిత్వాన్ని పరిశీలించరు. ఇంత పెద్ద జిల్లాలో పార్టీ పెట్టిన దగ్గర్నుంచి ఎంతోమంది నాయకుల్ని తయారుచేసిన టీడీపీకి ఇప్పుడు ఒక స్థాయి, ఒక స్టేచర్ ఉన్న అధ్యక్షుడు కరవయ్యారు.
గతంలో చౌదరి బాబ్జీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. కాళింగ సామాజికవర్గానికి చెందడం, పేర్లల్‌గా కింజరాపు కుటుంబానికి విధేయుడిగా ఉండటం వంటి అంశాలు గతంలో ఆయనకు కలిసొచ్చాయి. ఇప్పుడూ ఆయన్ను అధ్యక్షుడ్ని చేయాలంటే ఇవే సమీకరణాలు పార్టీ పరిగణలోకి తీసుకోవచ్చు. ఆయన కుమారుడు చౌదరి అవినాష్‌కు డీసీఎంఎస్ చైర్మన్ పోస్టు ఇచ్చినప్పుడే బాబ్జీని పార్టీకి వాడుకుంటామని చంద్రబాబు చెప్పారు. డీసీఎంఎస్ పదవి చేపట్టే ముందు పార్టీ అధినేతకు కృతజ్ఞతలు చెప్పడానికి తండ్రీకొడుకులిద్దరూ ప్రస్తుతం అమరావతి వెళ్లారు. బాబ్జీ ఉంటున్న ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం ఎంపీ పరిధిలో ఉన్నందున ఆయనకు ఇవ్వరని భావించక్కర్లేదు. ఎందుకంటే.. విజయనగరం డీసీఎంఎస్ చైర్మన్‌గా విశాఖపట్నంలో నివాసముంటున్న ఓ ఎన్‌ఆర్‌ఐని ఇటీవల పార్టీ నియమించింది. కాబట్టి ఎచ్చెర్ల నియోజకవర్గం విజయనగరం ఎంపీ సెగ్మెంట్‌లో ఉన్నా, జిల్లాగా మాత్రం శ్రీకాకుళంలోనే ఉంది. దీనికి తోడు బాబ్జీ తెల్లారితే జిల్లా కేంద్రంలోనే ఉంటారు. నిత్యం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండే నాయకుడు కావాలనుకుంటే బాబ్జీ వైపు పార్టీ చూడటంలో తప్పులేదు.
మహానాడు నాటికి స్థానికంగా పంచాయతీలు, అర్బన్, రూరల్‌లలో టీడీపీ ఇన్‌ఛార్జిలను నియమించడం పూర్తి చేయాలని పార్టీ ఇచ్చిన లైన్‌పై శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మరింత లోతులోకి వెళ్లి పని చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ముందున్న రెండు మండలాల అధ్యక్షులు, 50 డివిజన్లకు ఇన్‌ఛార్జిలను నియమిస్తే పని పూర్తయిపోయింది. కానీ తన నియోజకవర్గ పరిధిలో ఉన్న 279 పోలింగ్ బూత్‌లకు సరైన ఏజెంట్లు లేరని గత ఎన్నికల ద్వారా గుర్తించిన గొండు శంకర్ ముందు బలమైన బూత్ ఏజెంట్లను నియమించే పనిలో పడ్డారు ఏ డివిజన్‌లో అయితే బూత్ ఏజెంట్ల నియామకం పూర్తయిందో ఆ డివిజన్‌కు ఇన్‌ఛార్జిలను నియమిస్తున్నారు. వీరి నియామకం పూర్తయిన తర్వాత నగర పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించనున్నారు.










Comments